Sunday, December 25, 2016

కధలో రాజకుమారి

కధలో రాజకుమారి జీవితం అందంగా ఊహించుకుంటాం, పుట్టుకతోనే అదృష్టం తన్నుకొచ్చింది, జీవితం పూల బాట అనుకుంటాం కానీ అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది ఆ బంగారు పంజరపు బాధ.  ఇంట్లో అన్ని ఉన్నాయి కూర్చోపెట్టి అడిగిందల్లా కొనిపెట్టే నోరు మెదపని భర్త ఉన్నాడు నీకు ఏంటి చెప్పు అంటూ వేళాకోళం ఆడే జనాలకేం తెలుసు నాలో గూడుకట్టున్న బాధ ఏంటో.

ఆడపెత్తనం ఉండే ఇళ్ళు  చూశాను  కానీ ఆ కిటుకేంటో ఎప్పటికీ అర్థం కాదేమో నా లాంటి వాళ్లకి, అమెరికా సంబంధం అనగానే జీవితం ఒక ఒడ్డున పడిపోయినట్టే అని సంబర పడిపోయిన అమ్మ, నాన్న, మేనమామలు ఆ ఆత్రంలో పసుపు బట్టలతో అమెరికా వెళ్లి పాడె  మీద తిరిగొచ్చిన సుబ్బయ్య మామ కూతురు గురించి మర్చేపోయారు, గుర్తుంటే మాత్రం మా అమ్మాయి అదృష్టం ఆ పిల్ల లాగ కాదు అని సర్దిచెప్పేసుకుంటారు కానీ లక్ష్మీ  దేవి తలుపు తడితే వద్దనుకుంటారా ఏంటి.  అసలే ఊరందరిలో చివరాఖరుగా అమెరికా మొహం చూడని కుటుంబం మాదే కదా, ఎలా వదలుకుంటాం ఈ అవకాశం.  కుర్రాడు బుద్ధిమంతుడు, కానీ కట్నం అడగట్లేదు, పైగా చార్జీలకు ఖర్చులు కూడా పెట్టఖ్ఖర్లేదు తానే తీసుకెళ్తాడు అన్నాడు, ఇంకేం దివిటీలు పెట్టి వెతికినా దొరకని ఆణిముత్యం మా పాలిన  పడింది అని సంబరం జరుపుకోటమే సరిపోయింది.


పెళ్లి అయ్యి అవ్వంగానే కట్నం వద్దు అంటే మాత్రం ఆడపిల్లకి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా చెయ్యి దులిపేసుకున్న పుట్టింటివారు అనే సూటిపోటి మాటలు అనే అత్తా మామ ఆడపడుచు, చెప్పినా కూడా ఊహించుకుంటున్నావు  అని నోరు నొక్కే తండ్రి, నా తల్లితండ్రుల మీద ఇన్ని అబాండాలు వేస్తావా అని గయ్యిన లేచే భర్త...  ఏ తలుపు తడితే ఏమి లాభం, ఎవరు పట్టించుకోని కాడికి చెప్పటం ఎందుకు అనుకుని అప్పుడు మూగబోయిన స్వరం మళ్ళీ లెగవలేదు.   చెవులుండీ చెవుడు, నోరుండీ మూగలాగా బ్రతుకు సాగిస్తేనే ప్రశాంతత అని పెదవుల మీద నవ్వు చెదరకుండా చూపించిన భర్త ముందు, అల్లుడు ఎదురుపడి అరపైసా అడగనంత వారు ఆణిముత్యం అనుకునే తల్లిదండ్రుల ముందు మనసులో ఉన్న మాటమా చెప్పటం అనవసరం అనుకుని రాజీ పడిపోయి బ్రతకటమే.

అమెరికాలో మహారాణి వాసం, అంట్లు కడిగే మిషను, బట్టలు ఉతికి ఎండేసే  మిషను, ఇల్లు ఊడ్చి తుడిచే పనిలేదు అష్టైశ్వర్యాలు రాసులు పోసి మరీ ఉంటాయి అనుకుంటారు ఎప్పుడు ఇటు అడుగు పెట్టని వారు, పొద్దున్న లెగిచి మన పని మనం చేసుకుని ఉద్యోగం చేసొస్తే, ప్రపంచాన్ని భుజం మీద మోసేస్తున్నాం అనుకుని గారంగా చూసే అమ్మ లేదు, ఎంత చేసినా ఏమి చేస్తుంది పొద్దున్న లేచి ఇంత  వండి పడెయ్యటమే కదా అనుకునే భర్తకి పొంతన లేదు.   రోజంతా ఎదురు చూసి అష్టకష్టాలు పడి  ఇంటర్నెట్లో చూసి వంట చేస్తే, తినేసి అమ్మ దగ్గర నేర్చుకో, అత్తయ్య ఏమి నేర్పినట్లు లేదు అని దెప్పిపొడిచే భర్త  మీద ప్రేమ కురిపించెయ్యాలి అంటే మనసు రాదు కానీ నటించటమే దారి.  పుట్టినూరు, దేశం వదిలేసి ఇంట దూరం చేరినాక ఇంకొకరు తెలియదు కాబట్టి అన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంకొంచెం బాగా చెయ్యాలి అనుకుని రోజులు వెళ్లదీయటమే.

ఒక బిడ్డ కడుపున పడితే బ్రతుకు మారుతుంది అంటే వర్క్ స్టేటస్, వీసా, గ్రీన్ కార్డు, జీతం, అన్నీ కుదరాలి తరవాత ఇదే దేశంలో ఒక బిడ్డని కంటే సిటిజెన్ అయిపోతారు ఇదీ ప్లాను, ఇద్దరం కలిసి కదా ఆలోచించుకోవాలి, ఓహ్, మర్చేపోయాను నేను మనిషిని కాదుగా, భర్త నిర్ణయిస్తే భార్య వెనుక నడవటమే కదా నా నుంచి expect  చేసేది.

ఎలాగో  ఇన్ని కడతేరి, గండం గట్టెక్కి బిడ్డ కడుపున పడ్డాక, పురిటికన్నా అమ్మ వస్తుంది కదా అనుకుంటే, అబ్బో ఆరు నెలలు ఇంకో మనిషిని పోషిస్తే ఎంత ఖర్చో, ఎందుకు సరిపెట్టేద్దాం అని భర్త అంటే ఏమి చెయ్యలేక pregnancy  హార్మోన్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా సరే నోరు నొక్కేసుకుని కాలం వెళ్లదీయటమే.   ఇప్పటికైనా పంజరంలో నా జీవితాన్ని అమ్మ నాన్న తెలుసుకుని ఏదైనా చేస్తారేమో అనుకుంటే, మమ్మల్ని చూడకపోయినా పర్లేదు నువ్వు బాగున్నావుగా అంటూ మళ్ళీ సర్దుకుపోయిన వాళ్ళు.  అసలు నన్ను ఒక అయ్యా చేతిలో పెట్టి నన్ను దులిపేసుకున్నారా అని మరింత కుంగిపోవటం తప్ప ఏమి చెయ్యను.

అడపా దడపా వచ్చే అత్తామామ, ఫోన్లో పలకరించే అమ్మ నాన్న, ఇంట్లో అనునిత్యం మేమున్నాం అంటూ ఇద్దరు పిల్లలు, వాళ్ళని బడికి, అక్టీవిటీలు అంటూ తిప్పటానికి పడవ లాంటి పెద్ద కారు, పెద్ద లంకంత కొంప, చిట్టి ముత్యాల్లాంటి పిల్లలు, నవ్వుతూ ఉండే భర్త... ఎంతైనా పెట్టి పుట్టాను కదా....   అన్నీఉన్నా ఏది తృప్తి నివ్వని రాజకుమారి కధ   నా కధ రెండు ఒకటే

No comments:

Post a Comment