Sunday, October 24, 2010

నాదాకా వచ్చినప్పుడు కదా - కధాంబుధి 2

కళ్ళు కొంచెం కొంచెం తెరవగలుగుతున్నాను నేను కాని ఏమి అర్థం కాట్లేదు, అమ్మని చూస్తె ఏడుస్తుంది, నాన్న ఎటో చూస్తున్నారు.. అదేంటి అన్న ఇక్కడున్నాడు వీడు ఎప్పుడోచ్చాడు అమెరికా నించి.. అరె ఏంటి నోట్లోంచి మాట రావట్లేదు...


నేను కళ్ళు తెరవడం చూసి అమ్మ ఏడుపు ఇంకొంచెం పెరిగింది.. డాక్టర్ హడావుడిగా వచ్చి చూసి పర్లేదు అల్ ఇస్ వెల్ అని చెప్పి వెళ్లారు.. నాకు ఇంకా ఏమి అర్థం కాలేదు.. ఏమయ్యింది అమ్మా అని అడిగాను ఎలాగో కూడదీసుకుని.. నా గొంతు నాకు కొత్తగా ఉంది.. ఏమి లేదు అని ఎన్నో రకాలుగా సర్ది చెప్పారు అమ్మ నాన్న... మెల్లిగా ఒక రోజు గడిచాక అర్థం అయ్యింది నా మీద ఆసిడ్ దాడి జరిగింది అని.. అది చేసింది ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకడు రాము అని.. షాక్, అది తేరుకునే లోపు ఇంకో షాక్... ఖాళీగా ఉండి TV పెడితే నాకు జరిగిన incident మీద చర్చలు, పేపర్స్ అంటే దాచేశారు కాని పాపం remote దాచినా directgaa ఆన్ చేసుకుంటా అని మర్చిపోయినట్టున్నారు...


చాల నీచంగా ఉన్నాయ్ విశ్లేషణలు, ఈ తరం కుర్రకారు ప్రేమలు పైత్యాలు అంటూ ఏదో మాట్లాడుతున్నారు, ఒకరితో తిరిగి కొత్త వాడు రాగానే అసలు వాడిని మోసం చేసినట్టుగా అంటున్నారు.. ఏమి జరిగింది అని అతన్ని అడిగారు, అమ్మని నాన్నని అడిగారు, అన్నని కూడా అడిగారు... నాకు ఏమి జరిగిందో నాకు తెలిసేలోపే దేశం అంతా మరుమోగించేసారు నిజా నిజాలు తెలుసుకోకుండా... నేను చేసిన తప్పేంటి, నా పరిసరాల ప్రభావానికి లొంగి పోవడమా, అలాగని నేను ఎలాంటి తప్పు చెయ్యలేదే.. చేసేవారు ఉన్నారు కాని నేను అలా కాదె, మరి ఎందుకు???? నా మూలాన నా కుటుంబం మొత్తం తల దిన్చుకుందే ఎందుకు??  ఈ ప్రలోభాలు పెట్టిందే ఈ సమాజం, ఒక standard set చేసి అది ఇలాగుండాలి అని చెప్తుంటారు మరి దానికి విరుద్ధంగా ఎందుకు జరుగుతుంది.. ప్రేమ నీచం అంటూ ఇప్పుడు చెప్తున్నటువంటి ఇదే ఛానల్ శ్రీజ శిరీష్ పెళ్ళికి ఎందుకు అంతా కవరేజి ఇచ్చింది... ఆ టీవిలో చెడిపోతున్న పిల్లలు అంటూ lecture ఇస్తున్న జ్యోత్స్న వాళ్ళ అమ్మకి ఇంట్లో కూతురు చేసేవి తెలియదు కాని నేటి యువత మీద ఏక ధాటిగా భలే వాయిన్చేస్తుంది....


కనీసం ఆలోచించే ఓపిక కూడా లేదు నాకు ఇంక, కనీసం కన్నీరు రాదే... అమ్మ వాళ్ళు ఏంటి అసలు ఏమి అనడం లేదు.. వాళ్ళేదో వాళ్ళే పాపం చేసాము అన్నట్టుగా బాధపడుతుంటే నన్ను రంపంతోటి కోస్తున్నట్టుగా ఉండి.. అమ్మా వినమ్మా.. నువ్వన్నా నన్ను నమ్మమ్మా అని కరువు తీర ఏడవాలి అని ఉంది.. కాని అది కూడా చెయ్యలేకపోతున్నా, ఏమి అర్థం కావట్లేదు... తోటి వాడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటాను అన్నట్లు చెయ్యొద్దు అని అమ్మ ఎన్ని సార్లు చెప్పినా వినలేదు కదా.. ఈ అమ్మ ఒత్తి పిచ్చి మాలోకం అనుకున్నాను.  ఇప్పుడు కనీసం ఆ స్నేహితులు కూడా నాకు సాయం రారే అలాంటిదేమీ లేదు తను మంచిది అని చెప్పరే...


అంతా పిచ్చి పిచ్చిగా ఉంది.. ఇదంతా ఒక కల నేను మేలుకుంటే పోతుంది అనిపిస్తుంది కాని కళ్ళు తెరిచే ఉన్నాయ్, ఇది నిజంగా నిజం అని నేను నమ్మట్లేదు అంతే... కళ్ళు మూసుకుని వెనక్కి వాలితే నాకు గతం కళ్ళ ముందు తిరిగింది.. నిజం నిప్పు లాగ వెంటాడుతుంటే జ్ఞాపకాలే నీడని ప్రసాదిస్తాయేమో...


అమ్మ నాన్నల గారాల పట్టిని నేను.  ఇంటికి లక్ష్మి అని మురిసిపోతూ అల్లారు ముద్దుగా పెంచుతున్నారు నన్ను, అన్న ఉన్నాడు, వాడికీ నేనంటే చెప్పలేనంత ప్రేమ.  చిన్నప్పుడు ఉహ తెలియనప్పుడు ఏమి కొట్టుకున్నామో కాని తరవాత మా మధ్య ఎప్పుడు చిన్న తగువు కూడా లేదు.  అందరూ ఇదేమి విడ్డూరం అనుకుంటూ ఉంటే.. అమ్మ నాన్న కళ్ళల్లో కోటి కాంతులు, తమ పెంపకం గురించి తలుచుకుని గుండెలలో పొంగిపోయేవారు.   మాదేముందండి జ్ఞానం గల బిడ్డలు, భగవంతుడిచ్చిన వరాలు, వాళ్ళు నిజంగా మేము ఏనాడు చేసుకున్న ఫలమోనండీ అంటూ గర్వంగా చెప్పుకునేవారు.


నాకంటూ ఏమి లోటు లేదు, ఆడింది ఆట పాడింది పాట.  అమ్మ గుట్టుగా గుంభనంగా ఉన్న దాంట్లో పొదుపుగా ఉంటూ ఒకరి దెగ్గర చెయ్యి చాచకుండా, ఒకరితో పోల్చుకుని ఎగిరి ఎగిరి పడకుండా నాన్న తెచ్చిన దాంట్లో గడుపుతూ, మాకు మంచి చెడు తెలియచెబుతూ, పల్లెత్తు మాట అనకుండా, భయంతో కాకుండా శ్రద్ధతో పెంచింది.  బాల్యంలో అల్లరి మామూలే కాని ఒక నిండు కుండ లాంటి జీవితం మాది.  దేనికైనా సరే తల్లి తండ్రి ఉన్నారు అని ధీమాతో పెరుగుతున్నాము.


అంతా మంచే కాని ఎటువంటి తేడా లేకుండా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది.   పెరుగుతున్న కొద్ది అమ్మ, నాన్న, అన్న అనే ప్రపంచం తో పాటు బయట కూడా అవహగాహన మొదలయ్యింది.  చుట్టాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు, బళ్ళో వాళ్ళు మా పరిసరాలు మా మీద ప్రభావాలు చూపడం మొదలు పెట్టాయి.  అన్న నేను చెయ్యి చెయ్యి పట్టుకుని బడికి వెళ్ళడం, పాస్ బెల్లు వేళకి మళ్లీ అన్న దెగ్గరకి చేరిపోవడం, తనతో ఆడుకోవడం.. అంతా బాగానే ఉంది.  నేను 7 తరగతికి వచ్చేపాటికి అన్న కాలేజికి మారిపోయాడు... అప్పుడు మొదలయ్యింది నా కొత్త ప్రపంచం... నాకు ఒక స్వేచ్చ దొరికింది... అప్పటి దాక అలాంటిది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు నాకు.  ఇంట్లో వాళ్ళ తోడిదే లోకం.  సరదాగా టీవిలో వారానికి ఒక సినిమా, నెలకో షికారు ఇది మా జీవితం.


అన్నీ ఉన్న ఈ జీవితంలో అపశ్రుతి ఎప్పుడు మొదలయ్యింది?  అందరు మెచ్చుకుంటుంటే మంచి పిల్ల అని అది ఎప్పుడు నా తలకి ఎక్కింది, అన్ని నాకే తెలుసు అనే అహం ఎందుకు నాలో చేరింది.. ఏమో మనిషి మెదడు పలు రకాలుగా ఎందుకు పరుగుతీస్తుందో తెలిస్తే, అంతా సక్రమంగా జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది.


పని పిల్ల రంగి నన్ను ఆడించేది, సాయంత్రం షికారుకి తీసుకెళ్ళేది, నేనంటే ఎంతో ప్రేమగా ఉండేది.  అలా వెళ్తున్నప్పుడు మా వెనక ఒక కుర్రాడు వచ్చేవాడు, రంగితో ఎన్నో మాటలు మాట్లాడేవాడు, నేను అక్కడ వేరే పిల్లలతో ఆడుకుంటుంటే వాళ్ళు కబుర్లు చెప్పుకునేవారు, అతన్ని చూడగానే అక్క కళ్ళలో ఆనందం, పని తీరులో హుషారు, ఇంకో లోకంలో ఉండేవారు, ఒకోసారి చీకటిపడి అందరు వెళ్ళిపోయాక వెళ్దాంరా అని పోరు పెట్టేదాకా కదిలేవారు కాదు.  ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని రంగి ఒట్టు వేయించుకుని అప్పుడప్పుడు చాక్లెట్టు ఇచ్చేది, బాగా అల్లరి చేసినా అమ్మకి చెప్పేది కాదు, బురదలో తిరిగినా శుబ్రం చేసి ఏమి తెలియనట్లు ఉండేది.  ఎలా తెలిసిందో ఇంట్లో ఈ విషయం తెలిసి రంగిని తనతో పాటు నన్నుబయటకి పంపడం మానేశారు, నా వీపు విమానం మోత మొగిన్చేసారు నిజం దాచినందుకు.


వీధి చివర అన్న బడిలో అక్కకి ఉత్తరం ఇచ్చి రమ్మంటే ఇవ్వడం, అక్క రాసిన జాబు తేవడం... వాళ్ళ స్నేహితులకి కూడా ఇలాంటి పనులు చేసి పెట్టడం మాకు పనులు.  అక్కలు ఎవరిని దెగ్గరకి చేర్చుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ పాపులారిటీ ఉండేది.  అంతా భలే తమాషాగా ఉండేది, ఎవరికి తెలియకుండా చెయ్యమనడం తోటి అబ్బో అసలు మనకి ఎంత importance ఇచ్చేస్తున్నారో అని ఒక పిచ్చి భ్రమ, ఒక వింత లోకం.  Teenage అంటే ఇవ్వన్ని ఉంటే కాబోలు ఇదంతా కామన్ కాబోలు అనుకునేదాన్ని.  ఇంట్లో చాలా విషయాలు చెప్పడం లేదు నేనిప్పుడు ఎందుకంటే వాళ్ళు నన్ను ఏమి తెలియని దాన్ని అంటారు, కళ్ళెర్ర జేసి చిన్న పిల్లవి అంటారు.  నాకు నన్ను నన్నుగా నా వ్యక్తిత్వానికి విలువ నిచ్చేవాల్లుగా నా స్నేహితులు అక్కలు అన్నలె కనిపించడం మొదలు పెట్టారు మరి.


వయసు వచ్చాక మరీ అదుపులు పెరిగిపోయే, వోని వెయ్యాల్సి వచ్చింది, ఎన్నో కొత్త భావాలు, కొత్తగా ఎన్నో మార్పులు.. శారీరకంగాను మానసికంగాను.. ఇవన్ని ఇంట్లో వాళ్ళకంటే ముందు కుర్రాళ్ళు పసిగాట్టేస్తారు కదా, ఇంక నాకు ఉత్తరాలు రావడం మొదలయ్యింది, టీవిలో ఎప్పుడు చూసిన ప్రేమ సందేశం ఉన్న సినిమాలు, చుట్టు ఉన్న peer pressure అన్నిటికి మించి యవ్వనపు మత్తు.. ఎక్కువ సేపు చూస్తె ఎక్కడ దిష్టి తగులుతుందో అని పెంచిన అమ్మ నాన్నలేక్కడ, నిన్ను చూస్తె చూపు తిప్పుకోలేకపోతున్న అని చెప్పే రాజు లాంటి వాళ్ళ మాటలు ఎక్కడ.   ఏమి కావాలో తెలియని వయసులో ఇలాంటివి భలే మత్తుగా అనిపిస్తాయి కదా.


ఒక పక్కన భయం, ఇంట్లో తెలిస్తే ఎలాగా అని.. మళ్లీ ఆ తెలియనివ్వనులే నేను తెలివి గల దాన్ని ఎవరికి నేను ఐ లవ్ యు చెప్పలేదు కదా, వాళ్ళు చెప్తున్నారు నేను వింటున్న, ఒక నవ్వు పారేస్తున్న, నేనేమి వాళ్ళతోటి తిరగట్లేదు కదా.. ఐన తప్పేముంది, గిర్ల్స్ బోయ్స్ ఫ్రెండ్స్ అవ్వలేరా అంత ట్రాష్ అని మనసులో అనుకుని నాలిక తిప్పేసుకుని సర్డుకుపోయేదాన్ని.


ఒక్కోసారి టీవిలో ప్రేమోన్మాదులు అని అది అని చూసి కొంచెం భయం వేసేది కాని నేనేమైన అమాయకురాలినా అని మళ్లీ అదే నాలిక తిప్పుడు.  ఇంట్లోనే నా గురించి తెలియనివ్వట్లేదు ఇంక టీవీ దాక కూడానా అని ధీమా.  ఎప్పుడు మితి మీరి ప్రవర్తించలేదు కాని నలుగురు నా చుట్టూ తిరిగితే అదొక సరదా, ఎక్కడికెళ్ళిన bodyguards లాగ నలుగురు తిరుగుతుంటే అదొక గర్వం.   నుంచున్న కూర్చున్న తుమ్మినా దగ్గినా ఒక fan following , మన వైపు చూసి కుళ్ళుకునే మిగతా ఆడపిల్లల మోహంలో చూసి అదొక గర్వం.  ఎవరైనా బుద్ధిగా చదువు కుంటూ  ఉంటే ఇవన్ని పట్టనట్టు ఉంటే అబ్బో sour grapes వాళ్ళ వైపు ఎవరు చూడట్లేదు కదా ఎన్నైనా చెప్తారు అనుకోవడం.  చదువులో తేడా రానంత వరుకు, టైంకి ఇంటికి చేరిపోయినంత వరుకు ఎలాంటి ఇబ్బంది లేదు నాకు ఇంట్లో.


ఎప్పుడు రూమ్లో దూరిపోయి ఇంటర్నెట్, texting , ఫోన్స్ అంటూ ఉన్న నా గురించి తెలియక.. అబ్బో నా బిడ్డకి అసలు చదువు తప్ప వేరే ధ్యాస లేదు అని మురిసిపోయే అమ్మ నాన్నలు... ఇది నా లోకం.


పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరు చూడట్లేదు అనుకుంటే అది నిజం కాదు కదా.. ఎప్పుడో ఎదురు దెబ్బ తగులుతుంది.. సరదాగా ఉంటూ మా grouplo ఉండే రాము ఈ మధ్య విపరీతంగా possessive ఐపోయాడు, ఎవరితో మాట్లాడిన అదొక రకంగా అయిపోవడం, తనతోనే ఎప్పుడు ఉండాలని అనుకోవడం.  తప్పురా అని చెప్పాను, నాకు ఇవన్ని కేవలం స్నేహాలు,  ఈ రోజీ లాగే ఆ రాజు కూడా, నా జీవితంలో నాకు వేరే aims అండ్ hopes ఉన్నాయ్  అని చెప్పాను.. ఏమయిందో ఏమో సారీ అని చెప్పి మళ్లీ మామూలుగా ఉంటాను అన్నాడు.  అంతటితో అది నా దృష్టిలో ఒక సమస్య కాదు, జస్ట్ చిన్న misunderstanding క్లియర్ ఐపోయింది అంతే.  ఇంతలో Engineeringlo చేరడం కొత్త లోకంలో పడటం జరిగిపోయింది.. seniors లో ఉండే కృష్ణ చాలా intelligent,  మంచి మనిషి.. తను నాకు propose చెయ్యడం, నాకు నచ్చడం, నేను ఇంట్లో అడగమనడం ఇంట్లో వాళ్ళు సరే ముందు చదువు తరవాత చూద్దాం అనడం కూడా జరిగిపోయింది... మళ్లీ ఎప్పట్లాగే నేను నా స్నేహాలు నా లోకం..


ఇంతలో ఒక రోజు రాము బైక్ మీద కనిపించాడు, చాలా రోజులయ్యింది కదా అని చెయ్యి ఎత్తి పలకరిస్తుంటే, గబాల్న ఏదో తీసి నా మీద చిమ్మాడు.. అబ్బా ఏంటి ఈ మంట, ఈ నొప్పి ఏముతుంది ఏమి తెలియట్లేదు.. కళ్ళు తెరవలేకపోతున్న.. పిచ్చిగా అరవాలనుంది అరవలేకపోతున్నా.. ఏమి అవుతుందో తెలియట్లేదు.....


అమ్మా అని ఒక పిచ్చి కేక మాత్రం వేసాను.. ఎప్పుడు వచ్చాడో తెలియదు అన్నయ్య కంగారుగా కుదుపుతూ ఉంటే ఏమి అర్థం కాలేదు.. వాడిని గెట్టిగా పట్టుకుని కరువు తీర ఏడుపు తీర్చున్నాను.. పరవాలేదు నేనున్నాను అని నిబ్బరంగా వాడు చెప్తుంటే అర్థం అయ్యి కూడా కానట్లే ఉంది...


అన్నీ నాకే తెలుసు ఎంతో తెలివిగల దాన్ని అని విర్రవీగిన విషయం తలుచుకుంటే ఒక వెర్రి నవ్వు వస్తుంది.. అది చూసి పిచ్చి పట్టిందేమో అని హడిలిపోయిన అమ్మ నాన్న అన్నలని చూస్తె ఏడుపొస్తుంది... ఏమి చేసినా కాలం తిరిగి రాదు, యవ్వనం వృధా చేసుకోకండి అని యువతరానికి అరిచి గీపెట్టి చెప్పాలని ఉంది.. కాని మొన్నటి దాకా మైకం కమ్మిన నా కళ్ళకి ఏమి కనిపించిందో చెవులకి ఏమి వినిపించిందో తమ దాకా వచ్చేవరుకు వాళ్లకి అదే కదా వినిపిస్తుంది అనిపిస్తుంది..  తప్పు ఎక్కడ జరిగిపోయిందో అర్థం అయ్యేలోపు అంతా ఐపోయింది.

Sunday, October 10, 2010

నేనేంటి? - కధాంబుధి 1

ముద్దు ముద్దు మాటలతో, బుడి బుడి అగుడులతో ఇల్లంతా తిరుగుతూ నా దెగ్గరకి చేరిన నా మనవడు ఆర్య, చిట్టి చిట్టి చేతులతో నా మెడని చుట్టేసి వీపు మీద వేలాడుతున్నాడు..  బామ్మ "what is your name ?" అంటూ తను కొత్తగా నేర్చుకున్న కొత్త విద్యలు ప్రదర్శిస్తూ అడిగిన ఈ ప్రశ్న జ్ఞాపకాల పొరలను చీల్చుకుని గుండెని సూటిగా తాకింది...

నేను...

అవునూ నేను అంటే ఎవరు, నా పేరేంటి.. అమ్మాయి, అమ్మడు, అమ్మాయి గారు, ఏమే, ఒసేయ్, అదిగో, ఇదిగో, అమ్మ గారు, అమ్మ, అత్తయ్య, పిన్ని, అక్క, ఇప్పుడు నానమ్మ, బామ్మ తప్ప నా పేరు అంటూ నాకు కూడా గుర్తులేదే. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ నాన్న నాకు పేరు పెట్టారు అన్న సంగతి వాళ్ళ లాగానే కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. నా పేరుతొ ఎవరికి అవసరం.. అసలు ఆ మాటకి వస్తే ఇప్పుడు మాత్రం నాతో ఎవరికి ఏమి అవసరం.

ఆడపిల్లకి చాకలి పొద్దు రాయటం వరకు చదువు వస్తే చాలు అన్న నాన్న గారి మాటలు విని, వాళ్ళు చూసిన సంబందం వంచిన తల ఎత్తకుండా చేసుకుని పుట్టింటి నించి అత్తగారి ఇంట్లోకి మారిపోయాను.. అక్కడ తండ్రి నీడలో, ఇక్కడ భర్త అడుగుజాడలో.. అదే నా జీవిత పరామార్థం అని చిన్నప్పటినించి నూరి పోసి ఉండటం వలన ఈ రోజుల్లో పిల్లల్లాగా నాకు పెళ్లి ఒక బంధకంగా అనిపించలేదు. జీవితం ఇలా ఉండాలి, భాగస్వామి ఇలాగ ఉండాలి ఏమి ఎరుగని కాలం అది. పెళ్ళంటే ఇది అని తెలిసేలోపే కడుపులో ఒక నలుసు.. మా బంగారు కొండ.. ఎంత మురిసిపోయాను, యాంత్రికమైన జీవితానికి కొత్త వెలుగు, ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయినా తరవాత నేను నా బొజ్జలో వాడు, తను నేను ఒకటి, నేనే తను తనే నేను అంటూ, ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూ ఏదో లోకాల్లో విహరించే దాన్ని. నాలో నాకే తెలియని ఒక సున్నితమైన మనస్తత్వం నాకు కనిపించింది, ఎంత వెదికి వెదికి నా ముద్దుల మూటకి నేను పేరు పెట్టుకున్నాను... అమ్మాయైతే శ్రేయ అని అబ్బాయి ఐతే శౌర్య అని.  అడిగిన వారికి అడగని వారికి కూడా వాడి పేరు చెప్పి, వాడి అల్లర్లు చెప్పి, వాడు అడిగే ప్రతి మాటకి సమాధానం నాకు తోచినంతలో కధలల్లి చెప్పి, వెండి వెన్నలని చూపించి పాల బువ్వ పెట్టి, వాడికి దెబ్బ తగిలితే నేను కంట నీరు పెట్టి, జ్వరం వస్తే నేను లంఖణం చేసి.. ఎన్ని ఎన్ని మధుర స్మృతులు.


వాడు పుట్టక ముందు అబ్బాయి ఐతే armed forces లో చేర్పించాలి అనుకునేదాన్ని, దేశమాత ఋణం అని ఏదో అనుకునేదాన్ని.. ఏముందిలే ఆలోచనలే కదా మేడలు కట్టేసాను.  వాడు పెరుగుతున్న కొద్ది నాలో స్వార్ధం కూడా పెరిగిపోయింది నా బిడ్డ నా కంటి ముందు ఉండాలి, కలకాలం ఉండాలి అని ఇంక అంతే అభ్యుదయ భావాలు, సమాజ  ఉద్దరణ లాంటి మాటలు నా నోట రావడం మానేశాయి.  గుండెలో నుంచి రాని భావన పెదవుల మీదకి మాతరం ఎలా వస్తుందిలెండి.

వాడి ప్రతి మాట నాకు వేదం, ప్రతి అడుగు నాకు మురిపెం, వాడి జీవితంలో ప్రతి మైలురాయి నాకు ఒక పెద్ద వేడుక, కొత్తవి నేర్పించడం, వాడితో పాటు నేను కూడా ఎన్నో నేర్చుకోవడం.. ఒక్కడు చాలు వరాల మూట అన్నట్టు నాకు తరవాత పిల్లలే పుట్టలేదు. మా ఇద్దరిదే ప్రపంచం.. మా ఇద్దరి కోసమే ప్రపంచం అన్నట్టుగా ఉన్నాం, అప్పుడు ఇంక ఏమి గుర్తు రాలేదు.. అన్ని బాగున్నప్పుడు కాలం ఆగుతుందా లేదు కదా.. వాడు కాలేజికి వెళ్ళడం, కొత్త స్నేహాలు, కొత్త వ్యాపకాలు, కొత్త ఆలోచనలు, మెల్లిగా నేను మరుగున పడిపోయా.. అలా నా జీవితంలో చరిత్ర కారులు చెప్పినట్టు స్వర్ణ యుగం, కాదు కాదు వజ్ర యుగం లాంటిది ఏమైనా ఉంటే అది ముగిసిపోయింది.

ఏమాటకామాట చెప్పుకోవాలి నేను పడ్డ కష్టం ఏముందో లేదో కాని వాడు మాత్రం ఎంతో శ్రద్ధగా చదువుకుని ఒక గొప్ప విద్యావేత్తగా మారాడు, software software అంటూ కాలం పరుగెడుతున్నా కూడా వాడు మాత్రం తనలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని తయారు చెయ్యాలి అని పవిత్రమైన విద్యని అందరికి పంచడమే వృత్తిగా ఎంచుకున్నాడు.. మేధావిగా ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు కూడా అందుకున్నాడు. ఎంతో మురిసిపోయాను నేను కాని ఎందుకో మనసు అట్టడుగు పొరల్లో ఒక వెలితి, సంపాదనలో ఉద్యోగంలో పడిపోయి ఇన్నాళ్ళు దూరంగా ఉన్న తండ్రి రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నందువల్ల ఒక ఆప్త మిత్రుడు దొరికాడు అంట, తీరిక సమయం దొరికితే తండ్రీ కొడుకులు ఒకటే చర్చలు కబుర్లూను, బయట స్నేహితులు, పెళ్లి అయ్యాక భార్య, ఇప్పుడు వాడి కొడుకు. సరదాలు ముచ్చట్లు వింతలూ విశేషాలు అన్ని వారితోనే పంచుకోవడం.. ఎప్పుడు అమ్మ అదేంటి, ఇదేంటి అంటూ నా చుట్టూ తిరిగే నా బిడ్డ ఏదైనా నేను కల్పించుకుని చెప్పాలన్నా ఊరుకో అమ్మా నీకు తెలియదు అంటున్నాడు. ఏంటి ఈ అన్యాయం అని నా మనసు విపరీతంగా ఘోష పెడుతుంది.. ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించడమే కదా మనిషి జీవిత లక్ష్యం, అదే కదా గీతలో శ్రీ కృష్ణుడు.. అదేలెండి.. భగవంతుడు మనకి చెప్పింది మరి నా పరిమితిలో నేను బాగానే చేసానే.  అసలు ఏనాడు ఇది బరువు, బాధ్యత అన్నట్లుగా చెయ్యలేదే? ఎంతో మనస్ఫూర్తిగా చేసానే మరి ఎందుకు ఈ వయసులో నాకు ఈ వంటరితనం అందరూ నా చుట్టూ ఉండి కూడా నా చుట్టూ నేను గిరి గీసుకుని ఉండేలాగా ఎందుకు మారిపోయాను. అంతేలే మనం ఫలాపేక్ష లేకుండా ఏదైనా సరే చెయ్యాలి అని కూడా ఆయనే అదే గీతలో చెప్పాడు కదా.. ఏంటో పిచ్చి మనసు అన్నిట్లోనూ నాకు కావలసింది మాత్రమే వెతుక్కుంటుంది. వారి ధోరణిలో వారు ఉంటే నేను నిర్లక్ష్యం అని ఎందుకు అనుకోవాలి.. ఎందుకు నేను సర్డుకోలేకపోతున్నాను.

కొత్తగా వచ్చిన కోడలు పిల్ల అయినా నన్ను అర్థం చేసుకుంటుంది నాతొ సమయం గడుపుతుంది అనుకుంటే తను కూడా అబ్బాయి ప్రోత్సాహం వలన పైచదువులు చదివి ఉద్యోగంలో చేరింది. ఎంతో గౌరవంగా ఉన్నా కూడా ఏదో ఒక అడ్డుగోడ మా మధ్యలో... బహుశా నేను నా గిరి నుండి లోనికి రానివ్వలేదేమో.. మరి నాకు నేనే వారు, నేను, వాడు తప్ప ఎవరు లేని ఒక చట్రంలో బిగిసిపోయాను కదా.

తన వృత్తిలో ఎంతో శ్రద్ధాసక్తులు చూపించినందుకు ప్రభుత్వం నా భర్తకి బిరుదులిచ్చింది , సమాజం ధన్య జీవి అంది.


విదేశాలలో ఎన్నో అవకాశాలు ఉండి కూడా మన దేశంలో ఉండి విద్యని ప్రసాదిస్తున్నందుకు నా కొడుక్కి కూడా ఎన్నో సత్కారాలు చేసింది తండ్రికి తగ్గ తనయుడు అంది.


మరి జీవితాంతం ఉహ తెలిసిన తరవాత ప్రతి క్షణం ఈ కుటుంబానికి ధారపోసి, ఆయనకి ఇంట్లో బాధ్యతలు లేకుండా చూసుకుని, బిడ్డని ఎంతో అపురూపంగా, ఆదర్శవంతంగా  పెంచిన నాకు ఏమి మిగిలింది... నీకేమి తెలియదు అనే మాటా? నేను గొప్ప గొప్ప చదువులు చదవలేదు, సాహిత్యంలో ప్రవేశం అంతకంటే లేదు, తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి అని ఏనాడు అనుకోలేదు అయినా ఎప్పుడు అలుముకోని ఈ నిస్పృహ ఏంటి?


ఏదో అసంతృప్తి ఎందుకు ఉండిపోయింది నాలో. ..ఏమి?? వారికి అందిన గౌరవం పరోక్షంగా నాదే కదా.. ఎందుకు నేను ఆ కోణంలో ఆలోచించలేకపోతున్నాను. ఎందుకు నాలో నేను దహించుకుపోతున్నాను?

ఈ కుటుంబ ఆలనా పాలన ఒక తపస్సుగా భావిన్చానే.. ఏంటి ఆ తపస్సుకి ఫలం?  ఇంతకీ దేవుడు వరాలందించి శపించినట్లా  లేక శపించి వరమిచ్చినట్లా.. లేక ఆయన కూడా నాలాగా అయోమయం గందరగోళంలో ఉన్నట్లా?


జీవితంలో ఉన్న ఆశయం నేరవేరిపోయినాక ఏమి చెయ్యను నేను. ఆ ఫోటోలోని విష్ణు మూర్తి నల్లని విగ్రహం నన్ను చూసి నవ్వుకుంటున్నట్టుగా ఉంది. ఆయనకీ నేనంటే హేళన కాబోలు.  . ఎందుకు నాలో ఇంత ఉడుకుమోతుతనం.. నాకంటూ అస్తిత్వం ఒకటి ఏర్పరుచుకోలేదే అని ఒక వెలితి, ఇప్పుడు కొత్తగా ఏమి మొదలు పెట్టలేని అసహాయత.. ఎందుకు నేను ఇంకా ఉండటం తిండి దండగ అనిపిస్తుంది ఈ మధ్య.. కూతురైనా లేదే అని ఒక బాధ కొత్తగా మొదలు అయ్యింది.. ఏంటోలే, కంటి ఎదురుగా ఉండే కొడుకే పలుకరించే తీరిక లేకుండా ఉన్నప్పుడు, ఇంకో అయ్య చేతిలో పెట్టె కూతురు మాత్రం ఏమి చెయ్యగలదు, అసలు నేను ఏమి చేసానేంటి మా అమ్మకి?

కంట్లోనించి కారే నీరు గాల్లోకి తీక్షణంగా చూస్తూ ఆలోచించడం మూలాన వచ్చివో, లేక దుఖంతో పొంగినవో తెలియదు కాని చూపు మసకబారింది..  అడిగి అడిగి విసిగిపోయిన ఆ వెర్రి నాగన్న ఎప్పుడు చేరాడో నా వడిలోకి చేరి నిద్రలోకి జారిపోయి ఉన్నాడు. ఆలోచనల తరంగాలలో తిరిగి చేరిపోవడానికి అవకాశం లేకుండా వాడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడుతుండగా లేచి మళ్లీ గారంగా అదే ప్రశ్న.. what is your name బామ్మ అని.

అవును కదూ నా పేరు కదూ... వెనకటికి ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ చందాన ఉంది నా పరిస్థితి.. ఏంటబ్బా ?? లక్ష్మి కాంతమ్మగా కాలాంతరం చెందిన లక్ష్మి కాంతం కదూ, అసలు బామ్మలకి పేరు కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోయే ఈ తరానికి చెందిన వాడు కదా వీడికి మాత్రం ఎంత కాలం నాతొ ముద్దు ముచ్చటా ఉంటుందో... రెక్కలోస్తే ఈ పక్షీ ఎగిరిపోతుందిగా !!!



కధాంబుధి 

Naa Chitti Koona



నా చిట్టి బంగారానికి,



ఎన్ని రోజులు అయ్యింది నానా నీకు ఉత్తరం రాసి.. ప్రతి నెలా తొమ్మిదో తారీకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి, కొత్త గౌను కొని, ఏదోకటి వండించి, దాన్నో పెద్ద వేడుక లాగ చేసి ఒక ఉత్తరం రాసి ఎంత హంగామా చేసేదాన్నో కదా!! ఇప్పుడు కూడా అదే ప్రేమ అదే మమత కాని ఎందుకో ఒక రొటీన్ లో పడిపోయింది జీవితం.  నువ్వు పడుతూ, లేస్తూ, పరుగులెడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, ఏడుస్తూ నాకు ప్రసాదించే మధుర అనుభూతులు ఎన్నో కదా.. కేవలం తొమ్మిది నెలలు మోసి కన్నందుకు ఇంత అనుబంధం పెనవేసుకుపోతుందా, ఒక జీవన కాలానికి సరిపడే మధుర అనూభూతులని నింపుతుందా .. ఏమో, నాకు మాత్రం అంతా ఇంకా కలలాగే ఉంది.  నువ్వు లేకముందు అసలు జీవితాని ఊహించడమే కష్టంగా ఉంది.  పెద్దయ్యాక నువ్వు నన్ను తిట్టుకోవచ్చు, తిట్టేయ్యనూ వచ్చు కాని నీ చిన్నారి వయసులో నాకిచ్చన ఈ ఆనందం ముందు ఏదైనా చాల తక్కువేనేమో కదా? ఈ నెల దాటితే నీకు సంవత్సరంనర్ర  అనుకుంటేనే అబ్బో అనిపిస్తుంది... కాలం పరుగెడుతుంది అంటారు కాని నిజం కాదేమో నాన్నా,  అలాగ మాయం ఐపోతుందేమో.


నిద్రలో నీ బోసి నవ్వులు చూస్తె నాకు నిద్ర రాదు, అలాగ అన్నిమర్చిపోయి ఆ అమాయకత్వం, ఆ నవ్వులోని దైవత్వంలో తడిసిపోవాలనిపిస్తుంది.. ముద్దుగా చేసే గారం ముచ్చటగా అనిపిస్తున్నా కూడా కేకలేయ్యాల్సి వచ్చినప్పుడు నేను పడే బాధ చెప్పలేను, కాని తప్పదు.


బుడి బుడి నడకలు నడిచే చిన్నారి తల్లి చేయి పట్టుకుని నడిపిస్తుంటే ఇంక ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది.  చిట్టి చిట్టి చేతులతోటి ముఖం మీద తడుముతుంటే బాధ అంటే ఏంటో కూడా గుర్తు రాదు.


బుల్లి శీలి రాకాసి లాగ అరేయ్ ఒరేయ్ అని అందరి మీద కేకలేసి పిలుస్తుంటే ఒక పక్కన ముద్దు రెండో పక్కన అయ్యో అలవాటు ఐపోతుందేమో అని బాధ,  ఎవరికి చెప్పను.  కోపంలో వస్తువులు గిరాటేస్తుంటే అవి పట్టుకొచ్చి నిన్ను నాలుగు పీకాలి అని అనిపించే మనసుని ఎలా అదుపులో పెట్టుకోను.  నా కోపం నీకు వారసత్వంగా రాకూడదు, నా లాగ పిచ్చి దాని ముద్ర నీ మీద పడకూడదు అని ఎంత వ్యధ అనుభవిస్తుంటానో ఎలా చెప్పను.


ఎప్పుడైనా ఎందుకు ఈ నిత్య ఘర్షణ, ఈ విరామం లేని పోరాటం అని వైరాగ్యం కమ్ముకున్నప్పుడు, నీ చిలిపి చూపు, కిల కిల నవ్వు కనిపిస్తే చాలు ఎంతటి శక్తి వస్తుందో నాకు అర్థం కాదు.  నా బలం, బలహీనత రెండు నువ్వే బుజ్జి నాన్నలు.   ఎవరికీ లొంగని నేను నిన్ను చూసి చూడగానే పడిపోయా.. ఇప్పటికి కూడా ఆ మొదటి చూపు, ఆ తొలి స్పర్శ, నాకు ఒళ్ళంతా జల్లు మనిపిస్తుంది.


నువ్వు పుట్టక ముందు నిన్ను అలాగ పెంచాలి ఇలాగ పెంచాలి, అది నేర్పించాలి, ఇది నేర్పించాలి, ఎంతో ఆదర్శంగా తీర్చి దిద్దాలి  అని ఎన్నో అనుకున్నాను, ఇప్పుడు ప్రతి నిమిషం నీ నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను.. క్షణంలో నవ్వు, క్షణంలో ఏడుపు, ఏది గుర్తుండదు, ఎప్పుడు సంతోషం, ఉన్నది నలుగురితో పంచుకోవడం, ఇష్టం ఉంటె ఆడటం, లేదంటే ఆడించటం, నీ ప్రపంచంలో కోపం, చిరాకు, బాధ సంతోషం అంటూ ప్రత్యేకంగా ఏమి లేవు, అన్నిటిని సమ దృష్టితో చూస్తావు.  పక్షులు, జంతువులు, పేద, గొప్ప, ముసలి పడుచు ఇది అది ఏది లేదు.. అన్ని సమానమే, ఏదైనా రెండు నిముషాలే.


ఎప్పుడూ నిజమే చెప్పాలి, ఎంత కష్టమైనా సరే ఎంత నిష్టూరమైనా సరే నిజాయితీగా ఉండాలి అని చెప్పాలంటే తరవాత ఈ సమాజంలో నువ్వు బ్రతకలేవేమో, అదంతా పాత చింతకాయ పచ్చడి ఏమో అని ఒక్కోసారి దిగులు అనిపిస్తుంది.  తియ్యని అబద్ధాలు చెప్పి కనికట్టు చేసే వారు బయట చాలా మంది ఉన్నారు వాళ్ళని ఎలా గుర్తుపడతావో, అసలు గుర్తిస్తావో లేదో అని ఏదో ఆలోచనలు.  నల్లనివన్నీ నీళ్ళు తెల్లనివన్నీ పాలు అని భ్రమలో నిలిచిపోయి, కాదని ఆ తరవాత తెలుసుకుని తల్లడిల్లిపోతావేమో అని  బెంగ... నిజం చెప్పాలి అంటే అసలు ఎప్పుడు ఇదొక ఆలోచన..


ఏదో నేర్పించాలి అనుకుంటూ, నీ నించి నేర్చుకుంటున్నా అనుకుంటూ నన్ను నేను మభ్య పెట్టుకుంటూ బ్రతికేస్తున్నానేమో కూడా..


Born intelligent and education ruined అంతే ఇదేనేమో.. ఎంతో జ్ఞానంతో పుట్టి మెల్లి మెల్లిగా అన్ని మార్చిపోటమే మనం జీవితంలో సాదిస్తున్నామేమో అనిపిస్తుంది ఒక్కోసారి నిన్ను చూస్తె.


ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి అని ఒక తపనలో నిన్ను అందరికి దూరం చేస్తున్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి.  కాని చుట్టుపక్కల వాళ్ళ సూటి పోటి మాటలు విని నీ మనసులో చెరగని ముద్రలు పడకుండా ఉండటం ఎంత అవసరమో తలుచుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎంత సరి ఐనదో తెలుస్తుంది.


నా చిన్ననాటి నుంచి కూడా తల్లి తండ్రి మీద ప్రేమ లేదు, వాళ్ళ మీద నాకు ఉన్న అభిప్రాయలు నేను నాకు నేనుగా ఏర్పరుచుకున్నవి కావు, నా చుట్టు ఉన్నవారి మాటలు, కబుర్లు వాళ్ళ ఏర్పడిన ఫీలింగ్స్ మాత్రమే.  ఒక మనిషి మీద ఇంకొకరికి ఎంత విషంనింపగలరోఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది.. నేను కోల్పోయిన బాల్యం గుర్తొస్తుంది.. సాధ్యం కాని పరిస్తితుల్లో తల్లి తండ్రులు ఎవరిదగ్గరైనా పెంచినప్పుడు  వారు ఏమి వింటున్నారో చూస్తున్నారో తెలుసుకోలేరు కదా.  నిష్కల్మషమైన మనసుని అలాగే ఉంచడం నా కనీస బాధ్యత అని నేను అనుకుంటున్నా.. ఒక మనిషి గురించి నాకు నచ్చనప్పుడు నీదగ్గర ఆ వ్యక్తి గురించి మాట్లాడటం కంటే అసలు ఆ వ్యక్తీ ఉనికి నేను తెలియకుండా ఉండటం మేలేమో కదా.



నువ్వు పుట్టక ముందు ఒక శిశువు జన్మ ఒక మిరకిల్ అని అనిపించేది.. అదే ఇప్పుడు కలిగే భావన వర్ణించలేను, ఒక కణం చేసిన రణం, నా కంటి ముందు జీవం పోసుకుని కనిపిస్తుంటే, మైమరిచి పోవడం, మురిసిపోవడం.. ఈ చిరు జీవి చిరంజీవిగా వర్ధిల్లాలి అని ఆశించడం తప్ప నేను ఏమి చెయ్యలేను... నీ ఎదుగుదలకి కొంత కాలం గర్భంలో మాత్రం నిలుపుకున్న నాకు, జీవితతాంతం మదిలో చెరిగిపోని చోటుని ఇచ్చావు..


నేను మారిపోయాను నాన్నా, చాలా మారాను, మార్పు అంటే భయపడే నేను, అసలు మార్పు అంటే చిరాకు పడే నేను ఎంతగానో మారిపోయాను.


ఎన్నో లక్షాల కణాలని ఓడించి ఎన్నో మార్పులకి తలవంచి ఒక గొప్ప విజేతగా పుట్టిన నిన్ను నీలోని శక్తిని మర్చిపోకుండా, నీ సామర్థ్యాన్ని మరవనియ్యకుండా చెయ్యడం ఎలా?  నీ ఉనికి నీకు ప్రశ్న కాకూడదు ఎందరో జీవితాలకి వెలుగు కావాలి అని అనుకోవడం ఒక పెద్ద కోరికా?  భగవంతుడిచ్చిన ఒక అద్బుత వరం నీ జీవితం, దాన్ని నువ్వు అలాగే నిలబెట్టుకునేలాగా చెయ్యటానికి నా వంతు కృషిగా నేను ఏమి చెయ్యగలను...


బిడ్డల్ని కంటాం కాని వారి రాతలని కాదు అని ఎందరో అంటే విన్నాను.. నిజమే.. కాని అభం శుభం తెలియని పసి మనసులో కల్మషం రేపింది ఎవరు?  ఎందుకు ఒకరు మహాత్ముడిగా మరొకరు క్రూర మృగంగా ఎందుకు మారుతున్నారు.. ఏమి చేస్తే మన సమాజము స్టితి గతులని మనం మార్చగలం.


నిన్ను ఒక human being లాగ పెంచడం కంటే "being human " గా పెంచడం నా ధ్యేయం బంగారు.


ఏదో అయోమయంలో నాకు సరి అని తోచిన విధంగా నేను నిన్ను పెంచుకుంటున్నాను కన్నలు... ఒక్కోసారి ఎప్పుడు గబుక్కున పెద్దగా ఐపోయి నా కంటి ముందు కనిపిస్తావో అనిపిస్తుంది, ఒక్కోసారి ఇలాగే ఎప్పుడు పసి పాపలాగా ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది. నిమిషానికి ఒక భావం కాని ఒకటి మాత్రం శాశ్వతం ఈ ప్రేమ, ఈ బంధం, ఈ క్షణం.


ఎప్పుడైనా కోపం వచ్చి ఎందుకురా బాబు ఈ పిల్లల్ని కనడం పడరాని పాట్లు పడటం అని విసుక్కుంటే ఈ ఉత్తరం కాస్త నాకు చూపించు.. బ్రతుకు బండిలో పడి ఆ విసుగు నీ మీద పడినప్పుడు, వెలకట్టలేని క్షణాలు ఎన్నో నాకు ప్రసాదించావు అని గుర్తుచేయ్యి... నన్ను కను అని నువ్వు నన్ను అడగలేదు, ఇలాగే పెంచు అని నువ్వు నన్ను నిర్దేశించడం లేదు,  ప్రతి దానికి ఏదోఒక  అర్థం పరమార్థం ఆపాదించుకుని నేనే ఏదో చేస్తున్నాను, అది మర్చిపోయి నిన్ను దుమ్మెత్తి పోస్తే ఆ రోజు నన్ను గట్టిగా నిలదియ్యి.. ఎవరికీ తలవంచకు, ఎక్కడ తల దించుకోకు.. చివరకి నా దగ్గర కూడా.  నేను నీకు బలం బలగం అవ్వాలి తప్పితే నీ ఎదుగుదలని కట్టిపడేసే ప్రతిబంధకం మాత్రం అవ్వకూడదు చిన్నమ్మలు.  ఇది తప్పమ్మా అని నువ్వు నాకు చెప్పిన రోజు, నా చిట్టి కూన నాకే సరైన దారి చూపిస్తోంది అని నేను గర్వపడే రోజు వస్తే నా జన్మకి అది చాలు రా బంగారమ్మలు..  


ఏదో రాయాలి అని ఉంది.. ఎంతో చెప్పాలి అని ఉంది, చెప్పిందంతా సోది అనిపిస్తుంది, చెప్పాల్సింది కూడా సోదేనేమో అనికూడా అనిపిస్తుంది నాకు నేను నీకు తెలుసు కదరా రాజాలు, ఏదోకటి చెప్పెయ్యాలి... ఎలా పడతావో ఏంటో కదా నా తోటి... తప్పదురోయ్ నీకు నేను నాకు నువ్వు రాసి పెట్టి ఉన్నాం ;)..తప్పించుకుందాం అన్నా సరే నీకు దారి లేదు కదా :).


బోలెడంత ప్రేమతో
అమ్మ.

PS:  ఇది నేను నా ఇంగ్లీష్ బ్లాగులో ఎప్పుడో రాసుకున్న ఉత్తరం.. ఇప్పుడు ఇలా పంపిస్తున్నా

# తల్లిగానేను

శ్రేయస్సు  

మొదటి అడుగు

ఆరేళ్ళ నించి కూడా నేను రాస్తూనే ఉన్నాను, నా పాటికి నేను, పిచ్చి రాతలు, గీతలు, సుఖం, కష్టం, బాధ, సంతోషం అన్ని వేళలా రాస్తూనే ఉన్నాను.. రాస్తూ పొతే అదొక తృప్తి, ఎవరి కోసమో కాదు, నాకోసం.  నాకు ఉన్న ఒక outlet ఇదొక్కటే.. మనుషులతో మాట్లాడితే అర్థాలకి పెడర్ధాలు తీస్తారు, అవకాసం కోసం ఎదురు చూస్తారు ఏదోకటి అనడానికి, అదే ఈ బుజ్జి బ్లాగు/బ్లాగులు నా నేస్తాలు, ఏమి అనవు, ఓపికగా రాసిందంతా పబ్లిష్ కొడతాయి.  అబ్బ ఛా!! అంతగా కావాలంటే పుస్తకంలో రాసుకోవచ్చుగా తరవాత చదువుకోవచ్చుగా అనేవారు ఉన్నారు, కాని ఏంటో ఒక అలవాటు ఐపోయింది, ఒక fad గా మొదలైన నా రాతలు నాకు ఇప్పుడు therapeuticగా అనిపిస్తాయి.  ఏదోకటి ఇక్కడ కక్కేస్తే, ఒక confession box కెళ్ళిన ఫీలింగ్ వస్తుంది.  మొదట నేను మొదలెట్టింది సరదాగా, తరవాత పంతం తోటి.. అరె, నా మానాన నన్ను ఎందుకు రాయనివ్వరు, ఇది రాయి అది రాయకు అసలు బ్లాగ్ delete చేసెయ్యి అని ఎవరైనా సరే నాకు ఎందుకు చెప్పాలి  అని మొండితనం తోటి.  తీరా చూస్తె ఇన్నేళ్ళకి ఇప్పుడు అది ఒక అలవాటు, ఒక వ్యసనం అనడం సబబేమో.


ఒకప్పుడు నేను రాసింది కేవలం englishలో, రాతలకి రాతలు, భాష మీద పట్టు కూడా వస్తుంది, నా ఉద్యోగానికి ఇంకా బయట జనాలతో మాట్లాడటానికి ఉపయోగపడుతుంది... ఎలాగు పెద్ద కాన్వెంట్లో చదువుకుని, poshగా మాట్లాడలేను కదా ఇలాగైన నేర్చుకుందాం అనుకున్నా.  ఇప్పుడు చాలు, నాకు బాగానే వచ్చేసింది.. ఎంతలాగా అంటే నేను ఏదైనా పొందికగా, అవతల వాళ్లకి అర్థం అయ్యేలాగ, అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పాలి అంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడాల్సి వస్తుంది.  తెలుగులో నన్ను నేను వ్యక్తపరుచుకోలేనంటగా అలవాటైపోయింది అన్నమాట.. ఒకప్పుడైతే అదంతా బాగానే ఉండేది, మరి అప్పుడు youth ;) కదా.

కాలగమనంలో నా కూతురు పుట్టాక ఆ ఆలోచన మారింది, రేపు తను బడికి వెళ్ళాక ఎలాగో ఇంగిలిపీసు లోనే మాట్లడిస్తారు.  కనీసం తల్లి నోట అయినా మాతృభాష నేర్చుకుంటే, వింటే బాగుంటుంది అని ఒక కోరిక.. అప్పుడప్పుడు రాస్తాను, అయినా ఎంతోకొంత రాస్తాను.  తెలుగులో రాయాలి అని నాకు అనిపించడానికి కారణం ముఖ్యంగా శిరీష, దిలీప్, చందు గారు.. వారి ద్వారా ఈ కూడలి, హారం, సమూహం అంటూ తెలుగులో కూడా అబ్బో ఎంత అద్బుతంగా రాస్తున్నారు అనిపించినటువంటి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాను..


బుల్లి బుజ్జి తొలి అడుగులు వేస్తున్నాను..