Sunday, November 28, 2010

కుళ్ళు డౌటు

నాకో కుళ్ళు డౌటు వచ్చిందోచ్చ్.. ఒకటేనా అంటారా.. అదీ కరెక్టే..


రామ్మా చిలకమ్మా, ప్రేమ మొలకమ్మ?
లేక
రామ చిలకమ్మా, ప్రేమ మొలకమ్మ??


ఈ పాత విన్నప్పుడల్లా నాకోచ్చే డౌట్ ఇది.  గొంతు ఎంత మధురంగా ఉన్నా, భాషలో ఉన్న మధురిమ వచ్చీ రాని మాటలతో దెబ్బతింటుందేమో..ఎక్కడ ఒత్తులు పెట్టాలో అక్కడ వదిలేసి ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెట్టేసి నా లాంటి అల్పజీవులకి ఇలాంటి డౌట్లు తెప్పించేస్తారు :(.


అలాగే, మన అల్లు అర్జున్ ఫియాన్సీ స్నేహ రెడ్డిని చూస్తె నాకు కామన జేత్మలాని కొంచెం గ్రేసి సింగ్ కొంచెం గుర్తొస్తున్నారు.. మీకేవరికన్నా అనిపించిందా నా కళ్ళు కూడ గుడ్ బై చెప్తున్నాయ మెల్లిగా?

Friday, November 26, 2010

మరుపు వరమా?

అమ్మ.. అంటే నాకు అమ్మమ్మ.. తను పోయి నిన్నటికి 5ఏళ్ళు.. తను పోయినప్పుడు నాకు ఏమి అర్థం అవ్వలేదు, తను లేదు అని కూడ తెలియలేదు.. ఐదేళ్ళ క్రితం తను నా ముందే కను మూస్తే.. అలా అచేతనంగా ఉండిపోయాను.. చావు అంటే వినటమే.. చూడటం అంటే టీవీ లోనే.. ఆ బాధ ఏంటో ఏమి తెలియలేదు.. మొదటి సారి, దుఖం అంటే ఒకే సారి వచ్చేయ్యదు.. అలల్లాగా చిన్నగా, పెద్దగా, వస్తూ పోతూ, ఒకోసారి అలా తగిలి వెళ్ళిపోతూ, ఒక్కోసారి ముంచేస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటుంది అని అర్థం అయ్యింది .. అమ్మ దినం అయిపోయాక ఊరినించి ఇంటికొచ్చాక నెమ్మదిగా ఒక కెరటంలాగా తన్నుకొచ్చిన ఏడుపు ఆగతానికి నెల రోజులు పట్టింది.. ప్రతి ఆదివారం పది గంటలు అవ్వగానే ఫోన్ వైపు వెళ్ళే వేళ్ళు .. అమ్మా అంటూ ఖంగుమంటూ వినిపించే నీ కంఠం కోసం ఎదురు చూపు, అది వినపడదు అని తెలిసి వెక్కి వెక్కి ఏడవటం.. తెరలు తెరలుగా జ్ఞాపకాలు, ఎప్పటికి తీరదేమో అనే బాధ... తాతతో మాట్లాడినా తను వంటరిగా అక్కడ ఎలాగున్నాడో అని భయం.. ఎప్పుడు తనకి బాగోలేదు అని ఫోన్ వస్తుందో అని ఆందోళన.


తరవాత ఎప్పుడు మనుషుల్లో పడ్డానో తెలియదు.. ఒక పరిచయం, అది అమ్మ పంపిన వరం అనే భావన.. అందులోనే మునిగి తేలి ఆఖరికి జీవిత బంధంగా మారడం, అందులోనే కొట్టు మిట్టాడటం.


కాల చక్రం గిర్రు గిర్రున తిరిగిపోయింది... అవ్వటానికి అమ్మమ్మ అయినా అమ్మ పోయినంత బాధ, ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా తను గుర్తు వచ్చి కన్నీళ్లు వాటంతట అవే జల జలా రాలడం.. మెల్లిగా ఎప్పుడు తన జ్ఞాపకం మరుగున పడిపోయిందో తెలియదు.. అదొక సంసార మాయలో పడిపోయాను.. అయినా ప్రతి ఏడాది వారం ముందు నించి కూడ గుర్తుండేది, మెల్లిగా మానుతున్న గాయం.. ఏదోకటి వండి తనకి పెట్టి, గుర్తు చేసుకోవడం.. అదొక తృప్తి.. తనని తలుచుకోవడం... కాని నిన్న అసలు ఆ తలపు కూడ రాలేదు.. ఈ జంజాటం లో పడి ఏది గుర్తుండట్లేదు..


మనిషికి దేవుడిచ్చిన వరం మరుపు కాని నా జీవన మూలం ఐన ఆవిడని ఎలా మర్చిపోయాను... బాధగా ఉంది.  చాలా బాధగా ఉంది .. నా బిడ్డలో తనని చూసుకుంటున్నాను నేను.. తన పేరు కూడ పెట్టలేదు నేను.. పోయిన జన్మలో పడ్డవి చాలు అమ్మ ఇప్పుడు ఎందుకు అని... ఒకప్పుడు ఆడపిల్ల అంటే లక్ష్మి అని పేరు అనుకునేదాన్ని కాని తరవాత ఎందుకో పెట్టాలనిపించలేదు.. తనే మళ్లీ పుట్టింది అని ఒక భావన, ఏది మునుపటి లాగ  ఉండకూడదు, అంతా సంతోషమే ఉండాలి అని పిచ్చి కోరిక.. ఒక్కోసారి నా బిడ్డలో అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు కనిపిస్తారు... తను ఏమైనా చేస్తే వాళ్ళు చేసిన పనులే గుర్తొస్తాయి.. ఎప్పుడు మరచిపోని వాళ్ళని, తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన రోజుని ఎలా మర్చిపోయాను??


అమ్మా.. అర్థం కాట్లేదే, సారీ కూడ చెప్పలేనే.. నాకు అర్థం కానివి అన్ని నీకు అర్థం అవుతాయి కదా.. నాకు అర్థం అయ్యేట్టు చెప్పేదానివి కదా.. ఇప్పుడూ అంతేనేమో... చిచ్కూ గాడి కళ్ళలోకి చూస్తె నిన్ను చూసినట్టుందే, పర్లేదులేమ్మా, నా గురించి దిగులెందుకు.. నా కాలం ఐపాయింది ఇప్పుడు నీ జీవితం ముఖ్యం, నిన్ను నువ్వు బాగా చూసుకో, ఆరోగ్యం జాగ్రత్త అని ఎప్పటిలాగే నువ్వు చెప్పినట్టుంది... అమ్మా!!!!! వాడి వళ్ళో తలపెట్టుకుంటే కూడ హాయిగా ఉంది... వాడు కూడ బుజ్జి బుజ్జి చేతులతో నిమురుతూ నొప్పిగా ఉండి అనుకుని తల నిమురుతూ అమ్మ పోయి అంటే ఎంతో బాగుందమ్మా...  నిజంగా నువ్వే కదూ?

Thursday, November 25, 2010

అంతర్మధనం - కధాంబుధి 3

నిద్రలో ఏమి కల వచ్చిందో మెత్తగా నవ్వుకుంటున్న నా చిట్టి తల్లి మొహంలోకి చూస్తూ ఉండిపోయా చాలా సేపు.  ఏమి పట్టనట్టు సర్వం మరిచి అమ్మ ఉంది పక్కన అని ఒక చేతిని నాకు తగిలేటట్లు పెట్టుకుని ఎంచక్కా నిద్రపోతుంది... అలా చూస్తూనే ఆ పసికందుని ఇంకొంచెం పొదవి పట్టుకుని ముడుచుకుని తన వంటి నుంచి వస్తున్న బేబీ సోపు వాసనని పీల్చుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకుంటే గతం.. అరె నన్నెలా మర్చిపోయావ్ అంటూ పరుగు పెట్టి వచ్చేసింది... సినిమాలో చూపించినట్టు రింగులు తిరగదు, పొగల్లోంచి రాదు.. ఒక వరదలాగ ఆలోచనల్లో వచ్చి నన్ను కదిలించేస్తుంది.. ఎప్పటిలాగే ఈ రోజు కూడా...నువ్వు భలే నిద్రపోతావు అలా నడుం వాల్చగానే ఇలా కళ్ళు మూతలు పడిపోతే అదొక వరం అని మా అమ్మ అంటుంటే.. ఓస్ ఇది కూడ ఒక బ్రహ్మవిద్యా అనుకుని నవ్వేదాన్ని.. ఇప్పుడు తెలుస్తోంది నిద్రా మరుపు దేవుడు మనిషికిచ్చిన అద్బుతమైన వరాలు అని..


ఒకప్పుడు అందరిలాగే నేను కూడ నా లాంటి వాళ్ళని ఒక రకమైన తేడాగా చూసేదాన్నేమో.. అసలెవరైనా పిల్లలు తల్లి తండ్రి ఉండి కూడ లేనట్లు బ్రతుకుతుంటే చాలా బాధ పడేదాన్ని, ఎంతగానో వాదించి గోల పెట్టేదాన్ని.. ఎందుకు కనాలి అలాంటప్పుడు ఈ పిల్లల్ని అని ఒక రకంగా ఈసడిన్చుకునేదాన్ని కూడ.. ఒక రకమైన కోపం, కసి.. మీ జీవితాలు మీ ఇష్టం ఆ పసికందుని ఎందుకు తేవాలి ఈ ప్రపంచంలోకి అని ఎంతో అనుకునేదాన్ని.  అందుకేనేమో అమ్మమ్మ చెప్పేది ఎప్పుడు దేన్నీ అసహ్యించుకోవద్దు ఏమో ఎవరికి తెలుసు రేపు అది మనకే జరగోచ్చు, లేదా మనమే అలా చేయొచ్చు అని, అప్పుడు యవ్వన గర్వం కదా.. పోమ్మా, నువ్వెప్పుడు ఇంతే అని దాటేసే దాన్ని.. being on the other side of the spectrum అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది.  ఎలాంటి బలమైన కారణాలు ఉంటాయో అనిపిస్తుంది.   జీవితంలో ఎన్నో కోణాలు ఉంటాయ్ అని అవి మెల్లిగా మన జీవితంలో ఆవిష్కరింపబడినప్పుడు కదా తెలిసేది.  రెండేళ్ళ క్రితం నేను కూడ నమ్మలేనేమో నాలో ఇంత తెగువ ఉంది అని, నేను ఇంత మొండి జీవాన్ని అని.


జీవితంలో ఎన్నో ప్రయాణాలు... నేను ఎన్నో చేసాను కాని నన్ను ఎంతగానో ప్రభావితం చేసినవి రెండు.. ఒకటి కోటి ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టడం.. రెండోది కూలిపోయి నిలదొక్కుకునే ప్రయత్నంలో  వెనుదిరిగి రావడం... ఇంకా అంతా కళ్ళకి కట్టినట్లే ఉంది.. ఎన్నాళ్ళు వేదిస్తుందో నన్ను ఈ జ్ఞాపకం.. ఎప్పటికైనా నన్ను విడుతుందో లేదో..




ఎన్నో కలలు గూడు కట్టుకుని, ఎంతో ఆసతో ఎగిరిపోయిన నేను రెక్కలు తెగి కన్నీళ్ళ కడలిలో కొట్టుకుని తిరిగి నా ఊరే చేరుకున్నాను.  ఎన్నో రోజులు పట్టలేదు ఆ బంగారు కల కల్ల అని తెలుసుకోవడానికి.  గుండెల్లో దుఖం సుడులు తిరుగుతుంది, దాన్ని గొంతులో నించి రాకుండా దాయటం చాలా కష్టంగా ఉండి.. నోరు కాబట్టి మూయగాలిగాను కాని కళ్ళు మాత్రం మేము వినం, ససేమిరా అని మొరాయిన్చేసాయి మరి.. ఎవరి ముందు బేల అయిపోకూడదు అనే నా ప్రయత్నం నన్ను నిలవనియ్యట్లేదు..శరీరంలో వణుకు... అణచిపెట్టిన ఉద్విగ్నత అంతా నన్ను నిలువునా కంపింప చేస్తుంది మరి.  "why me??" ఇదే ప్రశ్న భగవంతుడి ని ఎన్ని వేళ సార్లు అడిగానో, నోరు, మనసు నొప్పి పుట్టే లాగ.. అసహాయత అంటే ఏంటో అనుభవంలోకి వచ్చింది.. ఎవరికి నేను ఏమి పాపం చెయ్యలేదే, తెలిసి తెలిసి ఎవరికి ఎలాంటి హాని చెయ్యలేదే మరి ఎందుకు.. అందమైన భవిష్యత్తు గురించి కలలు కనడం నేరమా... అమాయకంగా పెళ్లి అనే బంధనంలో ఇరుక్కుని పోవడం ఒక పెద్ద పాపమా.. ఎంతమంది సుఖంగా, సంతోషంగా లేరు పెళ్లి చేసుకుని.. నా రాతే ఇలాగ తగలడిపోవాలా?   అవును ప్రేమించడం తప్పా.. నిజమే నేను ప్రేమించాను, ప్రేమించే పెళ్లి చేసుకున్నాను, అందరిని ఒప్పించే చేసుకున్నాను అదే నేను చేసిన పాపమా?


ఎలా ఉండేదాన్ని ఒకప్పుడు, నవ్వుతూ, తుళ్ళుతూ, పారే సెలయేరు లాగ.. కిల కిలమంటూ ఎప్పుడు చిరునవ్వుతో, ఎప్పుడో కాని రాని కోపం ఎప్పుడు నీడల్లే ఉంటూ, కట్టలు తెచ్చుకున్న ఆవేశం మాటల్లో బయటికి వస్తూ.. నన్ను నేనే గుర్తించలేనంత భయంకరంగా ఎప్పుడు ఐపోయింది.  ఆనాటి రూపం తలుచుకుంటే మళ్లీ వరదలాగ పొంగుకోచ్చిన దుఖం.. ఎగిసిపడే కెరటంలాగా, ఉత్సాహ తరంగంలాగా, గల గలా ఎప్పుడు ఏదో పని కల్పించుకుని చిన్న చిన్న ఆనందాలే జీవితం అంటూ ప్రతి నిమిషం సంతోషంగా ఉండే నేనేనా ఈరోజు ఇలా ఉన్నాను.. మనిషిని మూగబోయానా... లేదు లేదు మనసే మూగవోయింది.  ఏ ముహూర్తాన అతనిని చూసానోకాని చేష్టలుడిగి అలాగే ఉండిపోయా నాడు నేడు కూడా.


రూపం, దాన్ని మించిన మంచి గుణం, పెదవుల మీద చెరగని చిరునవ్వు, ఆడవారి మీద చెప్పలేనంత దయ, ప్రేమ.. కన్నా తల్లి అన్నా తోడబుట్టిన చెల్లి అన్నా ఎంతో మమకారం.  స్త్రీలు చాలా కష్టాలు పడుతున్నారు అని జాలిపడి పోయే స్వబావం.. ఇవి నన్ను కట్టి పడేసిన అంశాలు... మాట మాట కలవడం, ఒకరి భావాలు ఒకరికి నచ్చడం, ఇదిగో అంటే అదిగో అనుకునే లోపు అందరిని ఒప్పించి మా పెళ్లి.. ఎన్నో కలలు, బంగారు భవితకి పూల బాటలు, తియ్యని తలపులు.. అన్ని రెండునాళ్ళ ముచ్చటే అయ్యాయి.


గృహ హింస అంటే కొట్టడాలు , తిట్టడాలు , తాగి రావడాలు, అత్తా ఆడపడుచుల ఆగడాలు అనుకునే దాన్ని అంతవరుకు.  నవ్వుతూ తిట్టగల విద్య ఒకటి ఉంటుంది అని తెలిసుకునే సరికే చాలా ఆలస్యం ఐపోయింది.  అతనంటే ఉన్న వెర్రి ప్రేమకి ఉద్యోగం వదిలి అతని వెంట వెళ్ళడం ఎంత తెలివి తక్కువ పనో ఇప్పుడు తెలిసి వస్తోంది.  ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే ఇద్దరు ప్రేమించుకోడం అనుకున్నానే కాని నేను ప్రేమించడం అతను ఆ ప్రేమను పొందడం అని నిర్వచించిన నాడు నా మనసుకు తగిలింది తొలి ముష్టిఘాతం.. వివాహ బంధం మీద అమితమైన ప్రేమ, అంతులేని గౌరవం,  ఎలాగైనా కుటుంబాన్ని చక్క దిద్దుకోవాలి అని తాపత్రయం... ఇదేదో చిన్న అపశ్రుతి, అదే సర్దుకుంటుంది.. ఒకరినొకరు అర్థం చేసుకోలేదు ఇంకా అతనే తెలుసుకుంటాడు.. పెళ్ళైన తొలి నాళ్లలో అందరు ఈ ఫేజ్ నించి వెళ్తారు, సామర్ధ్యం తో నిలబెట్టుకోవడమే గృహిణి ధర్మం అని ఎన్నో తలపోసాను.. అన్ని వృధా ప్రయత్నాలే అని తెలుసుకుని కూడ.. చ్చ, నేను failure కాదు అని మొండిగా ఇంకా అలాగే ఉండిపోయాను... వెనుదిరగడం చేతకానితనం అని అనుకుని ఇంకొంత కాలం ఆగి చూసాను... కాని ఎంత కాలం?  ఈ అర్థం లేని ప్రయాణం.


సుతి మెత్తని సున్నితత్వం, దృడమైన సామర్ధ్యం ఈ లక్షణాలే నాకు వెన్ను దన్నుగా ఉంటాయి అని అనుకుంటాను నేను.. పెళ్లి అనుకున్నప్పుడు నా కోరిక, ప్రతీ ఆడపిల్ల అదే కోరుతుందేమో మరి, అందరి లాగ కలహాలు మనస్పర్ధలు మా మధ్య రాకూడదు, మా జంట అంటే ఆదర్శ జంట అని అందరు అనుకోవాలి అని.. అదే తపన.  జీవతంలో సర్దుకుపోవాలి, ఒకరి కోసం ఒకరు.. అసలు ఇరువురు కాదు ఒక్కరు అన్నట్టే ఉండాలి అని.  కాని నిర్దిష్టంగా ఎప్పుడు ఒకటే నిర్ణయం... మనసు పొరల్లో ఎప్పుడో చిన్ననాడే నా చుట్టు పక్కన జీవితాలని చూసి తీసుకున్న నిర్ణయం.. ఇద్దరూ సర్డుకుంటేనే కలిసి మనగలం, ఒకరికి ఇంకొకరిని ఉద్దరిస్తున్నాం అనే భావన ఉన్న, లేదా రెండో వారికి అది కలిగినా కలిసి ఉండి నరకం చేసుకోవడం వ్యర్ధం అని..




పెళ్లి చేసుకునే ముందు నాలో తనకి బాగా నచ్చిన అంశాలు, ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు.. అప్పుడు కలుపుగోలుతనం ఇప్పుడు లేకితనం ఎందుకు అయ్యింది, అప్పుడు అభ్యుదయంగా అనిపించిన అవే భావాలు ఇప్పుడు ఎందుకు నసగా అనిపిస్తున్నాయ్... ఎప్పుడు నువ్వు మాట్లాడితే వినాలని ఉంది అనే మనిషి పెళ్లి అయ్యాక నోరు ఎత్తితే చాలు.. ఆపెయ్యమని సైగ చెయ్యడం ఎందుకు.. ఒకప్పుడు నచ్చినది ఈ రోజు ఎందుకు నచ్చట్లేదు.. అది నచ్చకపోవడం కాదు భరించలేకపోవడం అనేది మెల్లిగా తెలిసి వచ్చింది.  రెండు కుటుంబాలు కలయిక పెళ్లి అంటారు, నిజమే కాని రెండు జీవితాలు కూడ ముడిపడే బంధం పెళ్లి.. ఆ కుటుంబ సభ్యులు కోసం బ్రతకడం మాత్రమే కాదు.. నాకు నువ్వు నచ్చావ్ ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళ భావాలకి అనుగుణంగా మారు అంటే నా వల్లకాలేదు.. అసలు ఎవరిని చూసి నేను ఆ ఇంటికి వెళ్ళానో ఆ మనిషి పరాయి దానిలాగ చూస్తె భరించడం కష్టమేమో.  ఇద్దరి మధ్య చెప్పలేని అడ్డుగోడ, నీది నాది అని విడి విడి ఆలోచనలు.. నేను మనం అనుకుని చెప్పేవాటి వెనక విపరీతార్ధాలు వెదకడం, అనుమానించడం.  నిజమే నేను వేరు అయినప్పుడు నాకు వారి గురించిన గోల అవసరమా... నిద్రపోతున్న గాడిదని లేపి తన్నిన్చుకోవడం అంటే ఇదేనేమో.. లేని ఆలోచనలు రేకెత్తించడం.. ప్రతిది అనుమాన దృక్పదంతో చూసేటప్పుడు అదే అనుమానం నిజం చేస్తే పోలేదు అని ఒక రకమైన కసి.


నాకు పెళ్ళికి ముందు నా మీద నాకు ఒక నమ్మకం ఉండేది.. నేను మంచిగా మాట్లాడగలను, ఎలాంటి సమస్యనైన అర్థం చేసుకుని, క్షుణ్ణంగా అలోచించి మంచి నిర్ణయం తీసుకోగలను అని.. ఎందరో స్నేహితులు కూడ అదే మాట చెప్పేవారు, కాని అతను మాత్రం నోరు మెదపడం ఆలస్యం ఏదో ఒక కామెంట్ చెయ్యడం, ఎగతాళి, వెటకారం... ఎంత అంటే ఆఖరికి నా ఆలోచనలు సరి అయినవేనా అని నాకే అనుమానం కలిగేటంత. ఎవరితో ఏది మాట్లాడినా, వారి ముందే అది తున్చేయ్యడం, ఏదోకటి అని కించపరచడం.. మొదట్లో అది తమాషాకి అనుకుని సర్డుకుపోయినా.. రాను రాను అతని చుట్టు ఉన్న మనుషులు కూడ అదే రకంగా మాట్లాడటం తట్టుకోవడం కష్టం ఐపోయింది, అదేదో చెప్పిన చందాన.  చుట్టు మనుషులతో ఎప్పుడు సరదాగా ఉండే నాకు మనుషులతో కలవడం రాదు, వాళ్ళతో మాట్లాడటం రాదు, మాట్లాడిన ప్రతి దాంట్లో తప్పు పట్టడం, ఐతే చులకన చెయ్యటం లేదంటే అదుగో అలా మాట్లాడావు అని మాటలు లేకుండా బీసుకుపోవడం... ఒకసారి, రెండు సార్లు కాదు, ప్రతి సారీ, ప్రతి మనిషి దెగ్గర... ఆఖరికి నిజమేమో అని నేనే నమ్మేసేటంత.  ఎవరితో మాట్లాడినా అదొక నేరం, మాట్లాడకపోతే విపరీతార్ధం, ప్రతి పని ఒక అపహాస్యం.. నాలుగు గోడల మధ్య మాత్రమే కాక నలుగురిలో కూడ.


ఎందరో స్నేహితుల సమస్యలను, నా జీవితంలో సమస్యలను తేలికగా పరిష్కరించుకున్న నేను అతను గురి చూసి గుచ్చే మాటల ధాటికి నిలువునా కుప్ప కూలిపోయాను.. అతని కళ్ళలోకి చూస్తె నా మీద నాకే అసహ్యం కలిగేంత చులకన భావం.. అనుక్షణం కొట్టి తిట్టి నరకం చూపెట్టడం అంటారు... కేవలం చూపులతో, మాటలతో, వంకర నవ్వులతో ఎంత చిత్రవధ చెయ్యగలరో అనుభవిస్తే తప్ప అర్థం కాదేమో.. ఎవరికి చెప్పినా అర్థం చేసుకోలేని బాధ, కొడితే అయ్యే గాయాలు అందరికి కనిపిస్తాయి, మరి మనసుని కుల్లబొడిచేస్తే అవి ఎవరికి కనిపిస్తాయి... ఆఖరికి కన్నవారికి కూడ అవి కట్టు కధల్లాగానే ఉంటే, విడ్డూరంగానే ఉంటుంది.. ఏమి మేము చెయ్యలేదా కొట్టే మొగుళ్ళతో కాపురాలు, అన్ని తెచ్చి అమర్చి పెడుతుంటే తిని కూర్చోక తీపరమా అనే వారు కూడ..


ఎప్పుడు ఇంట్లో ఉంటే ఈ ఆత్మన్యూనత భావం నన్ను మింగేసేతట్లు ఉంది అని ఉద్యోగం చేద్దాము అంటే అందులోను ఆంక్షలే..  జీతం తక్కువ ఆ పాటి దానికి రోజంతా కష్టపడటం అవసరమా, నేను తెచ్చేది చాలదా, కష్టపడి ఆఫీసు నించి వచ్చేసరికి నువ్వు కూడ అలిసిపోయి వచ్చి దేభ్యం మొహం వేసుకుని వేలాడటం అవసరమా అని తిట్లు... ఇవి చాలవన్నట్టు.. ఏమి నా కొడుకు తిండి పెట్టట్లేదా.. ఇలా మా పరువు బజారున పడేయ్యటం అవసరమా అని అత్తగారి మాటలు... రోజు, రోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మాటలు అనే శూలాలతో గుచ్చి, గుచ్చి మానసికంగా ఎంతో దిగాజారిపోయే లాగ చేస్తుంటే ఆ మనిషితో ఎంత కాలం సహజీవనం చెయ్యగలను.. సంవత్సరం తిరిగే లోపు జీవత్చవంగా మారిపోయాను, లేచామ, వండామ , తిన్నామా, పడుకున్నామా... అబ్బో అదొక తల నొప్పి ఉంది కదా.. రోజంతా మనసుని చంపేసి రాత్రి శరీరం మాత్రం ఉత్తేజంగా ఉండమంటే ఎక్కడినించి వస్తుంది కోరిక... ఎక్కడో చదివాను పురుషుడికి సృష్టి కార్యం మీద మనసు, స్త్రీకి ఆ సమయంలో ఉండే మానసిక ఆనందం మీద మనసు అని, నిజమేనేమో.. జీవితం యాంత్రికంగా.. తెల్లారితే ఎందుకు అప్పుడే అని.. పొద్దు గూకితే అబ్బో మళ్ళీనా అని చెప్పుకోలేని బాధ.


అందరితోను నవ్వుతూ మాట్లాడుతూ, ఎంతో ఆప్యాయంగా ఉండే అతని గురించి అందరు పొగుడుతూ ఉంటే ఎవరికి మాత్రం ఏమి చెప్పుకోను.. చెప్పుకున్న ఎవరు అర్థం చేసుకుంటారు.. ఏమి చెప్తే ఏమి అంటాడో అని భయంతో చెప్పడం మానేసాను, చెప్పకపోతే అదొక తంటా.. దేవుడా.. ఇదేనా నరకమంటే, పోయాక కదా చూపించాలి నాకు బ్రతికుండగా ఎందుకయ్యా?  ఒకసారి మెట్టినింట అడుగు పెడితే ఇక సంబంధ బాంధవ్యాలు తెగిపోయినట్లే... అక్కడే చావు, బ్రతుకు, స్వర్గం నరకం, అత్త అమ్మ, ఆడపడుచు, మరిది తోబుట్టువులు.. మామగారే తండ్రి.. సరే, తప్పు లేదు, పెద్దవారు ఒక మాట అన్న సర్దుకు పోవాలి కాని అసలు ఎవరి మూలాన ఐతే వాళ్ళు నాకు బంధువులు అవుతారో ఆ మనిషే సరి లేనప్పుడు నేను వాళ్ళందరిని ఎందుకు భరించాలి... ఎంత కాలం భరించాలి.. భర్త అర్థం చేసుకుంటే అవన్నీ అసలు సమస్యలే కాదు, ఇద్దరిలోనే సామరస్యం లేనప్పుడు ఈ క్షణం క్షణం నేను చేసేది సరి ఐన పనే అని నిరూపించుకుంటూ బ్రతికే బ్రతుక్కు అర్థం ఏంటి?.


పెళ్ళికి ముందు కావాలని ఉద్యోగం మానేసాను నిజమే మరి ఇప్పుడు తను మానేయ్యమంటే ఎందుకు మనుసుకి ఇంత కష్టంగా ఉంది, లోపం నాలోనే ఉంది అనుకున్నా, మనుసుని ఎన్నో విధాల సర్ది చెప్పాలి అనుకున్నా అవ్వటం లేదు.. ఏదో తేడా తంతుంది ఏంటో తెలియట్లేదు... ఇద్దరం కూడ పెళ్ళైన ఏడాది దాక పిల్లలు వద్దు అనుకున్నాం నిజమే, కాని నెల తిరిగేలోపు అతను మెల్లిగా అసలు వద్దు ఎవరినైనా పెంచుకుందాం అనడం.. సరే అని ఒప్పుకుంటే ముందు అసలు నువ్వు మంచి తల్లివి కాగలవు అని నాకు నిరూపించు తరవాత ఆలోచిద్దాం అనే సరికి నాకు కలిగిన విరక్తి చెప్పలేను.. ఛి ఎందుకీ బ్రతుకు, నేను ఏంటో ఒకరికి నిరూపించుకుంటే నాకు మాతృత్వం ప్రాసదిస్తాడా.. నాకు అవసరమా.. ఆ క్షణాన తెలిసింది నన్ను పీడిస్తున్న బాధ ఏంటో... అవును నా జీవితం గురించి నేను కాదు, తను తీసుకుంటున్నాడు నిర్ణయాలు, నేను ఏంటి అనేది అతను చెప్తున్నాడు, ఏది చేసినా అదేదో hidden agenda తోటి చేస్తున్న అని అనుమానాలు ఒకటి... నాకు నేనుగా ఉద్యోగం వద్దు, పిల్లలు వద్దు అనుకోవడం వేరు, లేదా ఇద్దరం కలిసి సమిష్టిగా ఆలోచించుకున్నా అదొక తీరు.. కాని తనే ఆలోచించుకుని, నిర్ణయించుకుని, నా మీద రుద్దితే నాకు ఒప్పుకోవడానికి అహం అడ్డం వచ్చింది... అది నా తప్పు అని ఎంత సర్దుకు పోవాలన్నా నా అంతరాత్మ అందుకు ఎదురు తిరుగుతుంది, దానికి ఎదురు తిరిగి ఉండాలని చూస్తె మనిషిలోని ఎంతటి వికృత స్వరూపం బయట పడగలదో నాకు కనిపించింది. ప్రతి దానికి కోపం, చిరాకు, ఏడుపు, అసహాయత.. చేజేతులార ప్రాణం తీసుకోలేని నిస్సహాయత.  ఒక చేత్తో చప్పట్లు కొట్టలేరు, రెండు కలిస్తేనే కదా అని అనుకోడం కూడ తప్పేమో... రెండో చెయ్యి కలిసే దాక లాగితే చప్పట్లే కాదు చెంప దెబ్బలు ఉంటాయి అనే దానికి ప్రత్యక్ష నిర్వచనం నేనేనేమో.. చెప్పలేనంత ద్వేషం, కోపం, కసి, negativity కి నిలువెత్తు రూపం నేనే అన్నట్టు నాకే తెలుస్తుంది.. ఏదైనా జరిగితే నోర్మూసుకుని మారుతుంది అనుకోడం కాదు అరిచి చెప్పాలి అని కసి.. ఆ అరుపులు చూసి నేను పిచ్చి దాన్ని ఒక ముద్ర.. ఇన్ని పడినప్పుడు ఆ పిచ్చితనం ముద్ర పెద్దగా ఏమి అనిపించట్లేదు మరి.. మనిషికి ఒక ఔట్లెట్ కావలి, కసి కోపం ఒకరి మీదకి కేందీకరించి నన్ను నేనే కాలరాసుకుంటున్న పరిస్తితి.. ఆఖరికి కడుపులో బిడ్డని పోగొట్టుకునేంత ద్వేషం, కావాలని చెయ్యకోపోయినా, కోపంలో కోరుకున్నది జరిగిపోయింది... బ్రతకాలంటే భయం, ఏది జరిగినా ఎవరో చేయిస్తున్నారు అని కోపం.. ఆఖరికి ఆ పిచ్చి ముద్ర నిజమేమో అని నేనే నమ్మేసే అంత... అసలే కూలిన ఆశలకి ఇప్పుడు ఒక చెదిరిన కల తోడు.. జీవితం దుర్భరం, అర్థం చేసుకునే తోడు లేనప్పుడు... మళ్లీ పునర్నిర్మించుకునే అవకాశం లేదు.. ఓపిక లేదు, మనసు అంతకంటే లేదు.


... అంతలో ఒక రోజున తెలిసింది నేను మళ్ళీ నెల తప్పాను అని.. సంతోషంతో ఎగిరి గంతెయ్యనా, గోరుచుట్టుకి రోకలి పోటు అని బాధ పాడనా.. అర్థం అవ్వట్లేదు...


నాలో ఇంకో ప్రాణం నన్ను తట్టి లేపినట్లు అయ్యింది, నాకు కర్తవ్య బోధ చేసినట్టయ్యింది, ముందే మనసులో లీలగా ఉన్న ఒక భావం బలమైన రూపం దిద్దుకుంది.... లేదు ఈ జీవితం నాకు వద్దు.. పుట్టింట్లో చెప్తే ఏమి తక్కువ చేసాడు అంటారు కాని.. అమ్మా అన్నం లేకుండా అన్నా ఉంటాను కాని నువ్వంటే ప్రేమ లేదు అని నిమిషం నిమిషం గుర్తు చేసే మనిషితోటి ఎలాగమ్మ అని అడిగినా అర్థం చేసుకోరు.. భర్త ప్రేమించాట్లేదు అని వదిలి రాకూడదు... ప్రేమించేలా చేసుకోవాలి లేదంటే దిగమింగుకోవాలి అని చెప్పే అమ్మతో ఏమని చెప్పను.. నాకు బోలెడు ప్రేమ ఉంది అది నేను చెప్పలేకపోయాని అని ఆ మనిషి ఈ రోజు అంటే అది నేను ఎలా నమ్మాలి..


Each of us maybe good individuals, maybe perhaps is not a right term.. each of us is a great individual but together we bring the worst in each other.. the patience has one has come to a dead-end and even if the other says let us restart, we only end up bringing out the worst back time and again.. so what is the point.. నమ్మకం అనే పునాది లేని గోడ ఎంత కట్టినా కూలిపోవడమే కదా..


ఎలా వచ్చిందో తెలియదు ఒక మొండి తనం, ఒక మొండి ధైర్యం, ఒక గట్టి నిర్ణయం.. నేను ఒక్క క్షణం ఆ ఇంట్లో ఉండను, ఎవరు నాకు తోడూ ఉన్నా లేకున్నా... కడుపులో బిడ్డని చేజేతులార చంపలేను, మళ్ళీ నేను తట్టుకోలేను, ఒకసారి అనుకోకుండా ఐపోయింది, ఈ సారి అనుకుని చెయ్యడం ఇష్టం లేకపోయింది... కంటాను, పెంచుతాను.. ఆడపిల్ల ఐతే ఆత్మస్తైర్యం తోటి.. మగపిల్లవాడు ఐతే అర్థం చేసుకునే మనసు తోటి.. ఇదే నిర్ణయం.. తిరుగులేని నిర్ణయం.. ఎవరు అడ్డు వచ్చినా మారని నిర్ణయం...


అనుకున్నట్లే అత్త వారింట్లో కంటే పుట్టింట్లో ఎదురైనా సమస్యలు లెక్క లేనన్ని, నిండు గర్భిని అని లేకుండా రాచి రంపాన పెడితే వెళ్ళిపోతుంది అని పిచ్చి ఆశ.. కాని పడ్డవాడికి తెలుస్తుంది నొప్పి.. నేను వెళ్ళలేదు, వెళ్ళను కూడా.. ఇంకా మా వాళ్లకి ఆశ బిడ్డ మొహం చూసి నేను వెళ్తాను అని.. కాని అదే బిడ్డ మొహం చూస్తె నా నిర్ణయం ఇంకా బలపడుతుంది.. అది వాళ్ళు ఎప్పటికి అర్థం చేసుకుంటారో, అసలు చేసుకుంటారో లేదో.. అంతెందుకు ఈ పొత్తిళ్ళలో బిడ్డ కూడ అర్థం చేసుకుంటుందో లేదో.




కాని నేను మాత్రం వెనుదిరగను... కన్న బిడ్డ కోసం ఐన సరే నా ఆత్మగౌరవం కాల రాచుకోను.. ఎందుకంటే ఈ రోజు బిడ్డకోసం సర్డుకుపోయినా రేపు నేనేదో తనకోసం చేసి తనని ఉద్దరించాను అని ఒక మాట తనని అనేస్తే.. ఇంక ఈ జీవితానికి అర్థం ఏది?


అయినా ఎవరికోసమో కాదు నాకోసం నేను బ్రతుకుతాను.. నేను కన్న బిడ్డ కోసం బ్రతుకుతాను, బ్రతికిస్తాను.. ఎవరేమన్నా!!!


ఇంత ధైర్యంగా సమాజానికి ఎదురీదుతూ, ధైర్యంగా అసలు మనిషినేనా అని అనుమానం కలుగుతూ బ్రతుకుతున్న నాకు కూడ ఇంక కొద్దో గొప్పో మనసు మిగిలి ఉండి అని చెప్పటానికి కాబోలు ఇంకా ఈ జ్ఞాపకాలు వెన్నాడుతున్నాయి..


ఇప్పటికి నేను పాత  మనిషిని కాలేదు, బహుశా ఎప్పటికి కాలేనేమో.. ఎన్ని కష్టాలోచ్చిన్న అది నేను చేసుకున్నవి అని తలుచుకుంటే అదొక తృప్తి.. తప్పో సరో నాకు తెలియదు... కాలమే చెప్పాలి..


They say life is a journey..and I came to know that there are rules of everything of love, of living and everything if we leave it in anyone's hands.. we need to find the passion of our lives ourselves... I found mine.. it is TO LIVE...




సీతా రాములు ఆదర్శ దంపతులు అంటే కాదు కాదు సీతకి కష్టాలే తప్ప ఏనాడూ సుఖం లేదు అనుకునే దాన్ని.. భార్య భర్తల మధ్య ప్రేమ రాధ కృష్నుల్లాగా ఎందుకు ఉండదు? అంటే వాళ్లకి పెళ్లి అవ్వలేదు కాబట్టి ఆ ప్రేమ అమరమా అనిపిస్తుంది నేడు.


ఇది ఒక నాణానికి ఒక వైపు మాత్రమే, ఇంకో వైపు ఉంటుంది.. అది అతని వైపు ఆలోచనా సరళి, అతనికీ కారణాలు అనేకం, వివేకంతో ఆలోచిస్తే అవీ అర్థం అవుతాయ్... అతను కూడా ఎంతో మంది మధ్య నలిగిపోతూ ఏది నిజం ఏది అబద్దం తేల్చుకోలేక సతమతమవుతున్నాడు, మెల్లిగా తెలుసుకుంటాడు, మెల్లిగా అన్ని సర్దుకుంటాయి అనుకుని ఇంకొంత కాలం వేచి చూడవలసింది ఏమో అని నాకు అనిపించట్లేదు.. నమ్మకం పునాది లేనిది ఎంత కాలం సాగుతుంది.. తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎంత కాలం ఒక చేత్తో గెట్టిగా పట్టుకుని ఊపిరి తీసుకోవడానికి కూడా భయపడుతూ, ఒకరినొకరు తప్పించుకుంటూ, ఎదురు పడితే రెట్టించుకుంటూ బ్రతకడం వ్యర్ధం అని అర్థం అవుతుంది.. ఇద్దరిలోను నమ్మకం లేదు, తనకి ఎప్పుడూ లేదు నాకు ఇప్పుడు లేదు .. మా ఇద్దరికీ మా కారణాలు ఉన్నాయ్.. మా ఇద్దరికీ ఒక బిడ్డ ఉంది.. కాని మా జీవిత గమనాలు వేరు... మరి ఇప్పుడు నిర్ణయం?  పగిలిన అద్దం అతకదు.. బలవంతంగా చేసినా ఎప్పుడు గుచ్చుకుంటుందో తెలియదు.