Friday, November 26, 2010

మరుపు వరమా?

అమ్మ.. అంటే నాకు అమ్మమ్మ.. తను పోయి నిన్నటికి 5ఏళ్ళు.. తను పోయినప్పుడు నాకు ఏమి అర్థం అవ్వలేదు, తను లేదు అని కూడ తెలియలేదు.. ఐదేళ్ళ క్రితం తను నా ముందే కను మూస్తే.. అలా అచేతనంగా ఉండిపోయాను.. చావు అంటే వినటమే.. చూడటం అంటే టీవీ లోనే.. ఆ బాధ ఏంటో ఏమి తెలియలేదు.. మొదటి సారి, దుఖం అంటే ఒకే సారి వచ్చేయ్యదు.. అలల్లాగా చిన్నగా, పెద్దగా, వస్తూ పోతూ, ఒకోసారి అలా తగిలి వెళ్ళిపోతూ, ఒక్కోసారి ముంచేస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటుంది అని అర్థం అయ్యింది .. అమ్మ దినం అయిపోయాక ఊరినించి ఇంటికొచ్చాక నెమ్మదిగా ఒక కెరటంలాగా తన్నుకొచ్చిన ఏడుపు ఆగతానికి నెల రోజులు పట్టింది.. ప్రతి ఆదివారం పది గంటలు అవ్వగానే ఫోన్ వైపు వెళ్ళే వేళ్ళు .. అమ్మా అంటూ ఖంగుమంటూ వినిపించే నీ కంఠం కోసం ఎదురు చూపు, అది వినపడదు అని తెలిసి వెక్కి వెక్కి ఏడవటం.. తెరలు తెరలుగా జ్ఞాపకాలు, ఎప్పటికి తీరదేమో అనే బాధ... తాతతో మాట్లాడినా తను వంటరిగా అక్కడ ఎలాగున్నాడో అని భయం.. ఎప్పుడు తనకి బాగోలేదు అని ఫోన్ వస్తుందో అని ఆందోళన.


తరవాత ఎప్పుడు మనుషుల్లో పడ్డానో తెలియదు.. ఒక పరిచయం, అది అమ్మ పంపిన వరం అనే భావన.. అందులోనే మునిగి తేలి ఆఖరికి జీవిత బంధంగా మారడం, అందులోనే కొట్టు మిట్టాడటం.


కాల చక్రం గిర్రు గిర్రున తిరిగిపోయింది... అవ్వటానికి అమ్మమ్మ అయినా అమ్మ పోయినంత బాధ, ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా తను గుర్తు వచ్చి కన్నీళ్లు వాటంతట అవే జల జలా రాలడం.. మెల్లిగా ఎప్పుడు తన జ్ఞాపకం మరుగున పడిపోయిందో తెలియదు.. అదొక సంసార మాయలో పడిపోయాను.. అయినా ప్రతి ఏడాది వారం ముందు నించి కూడ గుర్తుండేది, మెల్లిగా మానుతున్న గాయం.. ఏదోకటి వండి తనకి పెట్టి, గుర్తు చేసుకోవడం.. అదొక తృప్తి.. తనని తలుచుకోవడం... కాని నిన్న అసలు ఆ తలపు కూడ రాలేదు.. ఈ జంజాటం లో పడి ఏది గుర్తుండట్లేదు..


మనిషికి దేవుడిచ్చిన వరం మరుపు కాని నా జీవన మూలం ఐన ఆవిడని ఎలా మర్చిపోయాను... బాధగా ఉంది.  చాలా బాధగా ఉంది .. నా బిడ్డలో తనని చూసుకుంటున్నాను నేను.. తన పేరు కూడ పెట్టలేదు నేను.. పోయిన జన్మలో పడ్డవి చాలు అమ్మ ఇప్పుడు ఎందుకు అని... ఒకప్పుడు ఆడపిల్ల అంటే లక్ష్మి అని పేరు అనుకునేదాన్ని కాని తరవాత ఎందుకో పెట్టాలనిపించలేదు.. తనే మళ్లీ పుట్టింది అని ఒక భావన, ఏది మునుపటి లాగ  ఉండకూడదు, అంతా సంతోషమే ఉండాలి అని పిచ్చి కోరిక.. ఒక్కోసారి నా బిడ్డలో అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు కనిపిస్తారు... తను ఏమైనా చేస్తే వాళ్ళు చేసిన పనులే గుర్తొస్తాయి.. ఎప్పుడు మరచిపోని వాళ్ళని, తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన రోజుని ఎలా మర్చిపోయాను??


అమ్మా.. అర్థం కాట్లేదే, సారీ కూడ చెప్పలేనే.. నాకు అర్థం కానివి అన్ని నీకు అర్థం అవుతాయి కదా.. నాకు అర్థం అయ్యేట్టు చెప్పేదానివి కదా.. ఇప్పుడూ అంతేనేమో... చిచ్కూ గాడి కళ్ళలోకి చూస్తె నిన్ను చూసినట్టుందే, పర్లేదులేమ్మా, నా గురించి దిగులెందుకు.. నా కాలం ఐపాయింది ఇప్పుడు నీ జీవితం ముఖ్యం, నిన్ను నువ్వు బాగా చూసుకో, ఆరోగ్యం జాగ్రత్త అని ఎప్పటిలాగే నువ్వు చెప్పినట్టుంది... అమ్మా!!!!! వాడి వళ్ళో తలపెట్టుకుంటే కూడ హాయిగా ఉంది... వాడు కూడ బుజ్జి బుజ్జి చేతులతో నిమురుతూ నొప్పిగా ఉండి అనుకుని తల నిమురుతూ అమ్మ పోయి అంటే ఎంతో బాగుందమ్మా...  నిజంగా నువ్వే కదూ?

7 comments:

 1. "దుఖం అంటే ఒకే సారి వచ్చేయ్యదు.. అలల్లాగా చిన్నగా, పెద్దగా, వస్తూ పోతూ, ఒకోసారి అలా తగిలి వెళ్ళిపోతూ, ఒక్కోసారి ముంచేస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటుంది అని అర్థం అయ్యింది.."

  అవును కదా.. :( :(

  ReplyDelete
 2. కళ్ళు చెమ్మగిల్లాయి..

  ReplyDelete
 3. Pandu gaadilo prathi nityam thanu neeku kanipisthoone vundi kadaa Sushma...anduke thanu nee kalledute vundi anna bhavanatho ammamma dooramayina roju marchipoyaavemo...it happens...TC

  ReplyDelete
 4. @siva

  aatmeeyula gnaapakaalu migiledi aa neeti botlalonenemo.

  ReplyDelete
 5. @Keerthi..
  gurtu raagane chaala badhanipinchindi keerthi, ippudu it feels okay, that is what she would want too anipistundi..

  ReplyDelete
 6. padina badhalu chalu.. mee chirunavvulo tanu undipovali anukutnunnaru andukey badha kaliginche roju ni meeku gurtu ranivvaledu meeru emo pani kattukuni mari badhapadutunnaru.. ila aitey peddavida korika ela tirutundi...navvu amma navvuthu undu amma...kanillaki chellu cheeti icheyyamma ....

  ReplyDelete