Thursday, December 16, 2010

వాన దేవుడి చావు దెబ్బ

వాన తాతోయ్ ఎన్నాళ్ళని ఈ వానలు.. మే నెలలో మొదలయ్యి వీర బాదుడు బాదుతున్నాయ్.. మొదట్లో ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వాన అని త్రిష రేంజిలో గంతులేసిన, మెల్లిగా నొప్పి తెలుస్తుంది.. బాబోయ్!!! ఈ వానలేన్టండి బాబు.. ఏడు నెలలా.  అసలేమైపోవాలి జనాలు, జబ్బులు వచ్చేస్తాయ్ ఇలాగే కొన్నాళ్ళు సాగితే, ఎక్కడా పరిసుబ్రత అనేది ఉండట్లేదు, బురద కాలువలు, పాచి పట్టేసిన పారుదల లేని నీరు, కుప్పలు తెప్పలుగా దోమలు, కప్పలు, వాటిని తినడానికి వచ్చే పాములు.. ఎక్కడో లాగితే ఏదో కదిలినట్లు ఈ వాన దెబ్బకి ప్రకృతిలో ఉండే వైపరీత్యాలు అన్ని జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు


వానొచ్చిందంటే, వరదొచ్చింది.. వరదొచ్చిందంటే బురదొచ్చింది అని కెవ్వున ఏడుపు తన్నుకొస్తుంది ఈ మధ్య ... ఈ బురద వరదలో, గతుకు రోడ్డులో కాలి ప్రయాణం అంటూ ఏడ్చుకుంటూ బురదలో కూరుకుపోయే కాళ్ళు పైకి తీసుకోవాలో, ఎక్కడో అడుగున అత్తుక్కుపోయే చెప్పులు తీసుకోవాలో అర్థం కాక చెప్పులు చేతిలో పట్టుకుని తిరగాల్సినంత బురద.. ఎందుకులెండి చెప్పుకోడం మొదలెడితే ఇక్కడ నా కుర్చీ కింద నా కన్నీటి మడుగు తయారు అవుతుంది.  తడిచిన బట్టలు ఆరవు, ఉతికిన బట్టలు ఎండవు, ఎండినా అదొక రకం వాసన, ఇల్లంతా చిందర వందర, ఎక్కడ పడితే అక్కడ తడి.. వీటిని అన్నిటిని మించి చినుకు పడగానే బయటకి పరుగులు తీసి బట్టలిప్పేసి మరీ డాన్సులు చేసే నా కూతురు.. హయ్యో హయ్యో ఏమని వర్ణించనూ, నేనేమని వర్ణించనూ.. వద్దు నాన్న తడిచిపోతావ్ అంటే పెద్ద ఒక చెయ్యి నెత్తిన అడ్డం పెట్టుకుని మరీ పరుగులు తీస్తుంటే ఏమని వర్ణించనూ, అసలే fracture అయిన కాలు వేసుకుని వెనక పరుగెట్టలేక, అరిచి అరిచి గొంతు రాసుకుపోయి.. అబ్బో అవి ఒక రకపు సినిమా కష్టాలు.


గచ్చు ఆరకుండా అరంగుళం మందాన పట్టిన ఆకు పచ్చటి పాచిని చూసి ఏమి చెయ్యను, ఎన్ని ఆసిడ్ సీసాలు అని గుమ్మరించను... అడ్డదిడ్డంగా విరిగి పడే కొబ్బరి మట్టలు, కాయలు, గెలలు ఎక్కడ గుండు మీద పడతాయో అని వేరొక టెన్షన్ మళ్లీ.  సరేలే అని కొట్టిన్చేద్దాం అంటే చెట్టు ఎక్కేవాడు ఏడి.  ఇవి చాలనట్టు తేళ్ళు, కాల జెర్రి పిల్లలు ఎక్కడైనా రాళ్ళల్లో నేర్రలు  ఉంటే అక్కడి నించి టింగ్ మని బయటికి రావడం... కన్నాల్లోకి  నీళ్ళు చేరిపోయి అవన్నీ పాపం ఎక్కడని ఉంటాయి, ఇలా ఇళ్ళ మీద పడిపోతాయి.  ఇంక కప్పలు కుప్పలు తెప్పలు గా ఉన్నాయి అవి కూడ ఇంట్లోపల, ఒక దాని మీద అడుగేసి బోయికలు కూడ విరగ్గొట్టుకున్నాను.. వా!!


పల్లెటూర్లో ఉండటం అంటే అందరు ఏదో సుఖపడిపోతున్నాం అనుకుంటారు, ఇక్కడ ఉండే సాధక బాధకాలు ఇక్కడ కూడ ఉంటాయి.. చుట్టు పక్కల వాళ్లకి ఖర్మ కాలి గేదలు ఆవులు గట్రా ఉంటే అక్కడి నుంచి వచ్చే వాసన, దేవుడా మొత్తం మీద వాన అంటే వణుకు వచ్చేలాగ ఉంది.. దీనికి తోడు చిరుజల్లి పడినా సరే అబ్బో ఇంకేముంది ఇంకాసేపట్లో జిల్లా జిల్లా కొట్టుకుపోతుంది అనే రేంజిలో TV వార్తలు.  ఎక్కడైనా చెట్టు కొమ్మలు రాలిపడో, ఏదైనా పెద్ద లారి అడ్డం తగిలి వైరులు ఊడిపోయో కరెంటు ఫోను రెండు ఉండవు.. ఎప్పుడు కరెంటు వస్తుందో, inverter ఎంత సేపు supply ఇస్తుందో  అంతలోపు చిచ్కూ గాడిని ఎలాగా పట్టుకోవాలో అర్థం కాక బుర్ర బద్దలుకొట్టు కోవడం.  అయ్య బాబు ఇవ్వాళా కరెంటు లేదు నేను ఉద్యోగం పూర్తిగా చెయ్యలేను అని ఆఫీసుకి ఫోన్లు.. ఇంట్లో సిగ్నలు రాదు కాబట్టి వానలో గొడుగు ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో పట్టుకుని మెయిన్ రోడ్ ఎక్కి సెల్లు ఫోనులో ఒక కబురు చెప్పేసి ఊపిరి తీసుకోవడం.. చెప్పటానికి నాకే విసుగొచ్చింది ఇంక పాపం ఆఫీసోల్లు ఎలా వింటున్నారో మహానుభావులు అనిపిస్తుంది ఒక్కోసారి.


అసలిన్ని బాధలున్న ఎప్పుడు ఈ రేంజిలో ఏడవలేదు నేను.. ఏదో కుయ్యో మొర్రో అని సర్దిపెట్టేసుకున్నా, కాని కోతలు మొదలు పెట్టాక వచ్చే వానలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది అసలు నావి కూడా కష్టాలేనా అనిపిస్తుంది.  సగం ఏడాది కష్టపడి దుక్కి దున్ని, దమ్ము చేసి, నారు మడి పోసి, ఊడిపించి,  కలుపు తీయించి, ఎరువులు చల్లి అడపా దడపా వచ్చే వానలు తట్టుకుని వచ్చే పంట కోసం ఆశగా ఎదురు చూసే రైతు కి అసలు ఏమి చెప్పి ఓదార్చగలం .. కూలి మనిషి పలకక, కోత మిషను పొలంలో దిగక, మనుషులు దొరికినా సరే ఆ కూలి ధరలు తట్టుకోలేక.. పొలం మీద పంట ఉండగానే తడిచిపోయి మొక్క మోలిచిపోతే నిస్సహాయంగా చూస్తున్న ఆ కుటుంబానికి  ఏమి చెప్పి ఓదార్చాలి..  పని లేని రోజుల్లో చేసిన అప్పులు పంట చేతికొచ్చాక తీర్చుకుందాం అనే ఆశ కంటి ముందే కరిగిపోతుంటే ఏమని చెప్పాలి.


ఆఖరికి ఇలాంటి విపత్తు ను కూడా రాజకీయం చేసే వాళ్ళని చూస్తె వచ్చే కోపాన్ని ఎవరి మీద చూపించాలి.. రైతు రుణాల మాఫీ అంటారు, కాని అది ఎంత మంది నిజంగా పొలం మీద పెట్టుబడికి పెట్టిన వారికి అందుతుంది.. అసలు ఏదైనా వస్తువు తాకట్టు పెట్టి తెచ్చుకోలేని వాళ్ళ పరిస్తితి ఏంటి.. పొలం యజమాని పొలం కాగితాలు మీద తెచ్చుకుంటాడు, కౌలు రైతు పరిస్థితి ఏంటి.. బంగారం కూడా లేని వాడు ఏమి చేస్తాడు, బ్యాంకులో కాక బయట వాడి దెగ్గర తీసుకున్న రుణాలు ఎలా తీరుస్తాడు, అవి వాళ్ళు మాఫీ చెయ్యరు కదా.

చావులను సైతం రాజకీయం చేస్తుంటే చూస్తూ ఏమి చెయ్యలేని అసహాయతకి సిగ్గేస్తుంది... ఇలా వానల మూలాన ఆత్మహత్యలు, గుండె ఆగి పోయి చచ్చిపోవడాలుగా చిత్రీకరించిన చావుల మధ్య నిజంగానే ఈ వాన దెబ్బకి చావుని ఏరి కోరి వరించిన వారు మూలన పడిపోతున్నారు.  ఆకలి చావులు లేవు కాని, ఈ కలి చావులకి బాధ్యులు ఎవరు.

India is a developing county.. Why?? అని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను.. small land holdings అని అప్పుడు చదువుకున్నా కూడా పెద్ద అర్థం కాలేదు.. ఎకరం, అరెకరం సాగు చేసుకునేవారిని చూస్తుంటే ఈ రోజు ఆ నిజం ఏంటో నాకు ప్రత్యక్షంగా కనపడుతుంది.. Rich is becoming richer and poor the poorer అంటే దీని మూలానేనేమో.. ఈ సారి బంగారం మీద రుణ మాఫీలు జరిగితే ఏదో అవసరానికి అడ్డం వేసుకున్న డబ్బున్న వారికి జరిగినంత మేలు నిజంగా అవసరంలో ఉన్నవాడికి కచ్చితంగా జరగదు. కాని ఎవరు ఒప్పుకోరు, గొప్పగా ధర్నాలు చేస్తారు, మొక్క మొలిచిన ధాన్యాన్ని ఎక్కడినించో తెప్పించి రోడ్డు మీద బైఠాయించి పెద్ద పెద్ద మాటలు చెప్తారు అది కూడా కెమెరాలు దేగ్గర్లో ఉన్నంత సేపు మాత్రమే, ఏదోకటి ప్రభుత్వాన్ని దుయ్య బట్టాలి కాబట్టి అదే చేసేద్దాం, రాజకీయాల్లో ఉండాలి అంటే ఎలాగో ఎప్పుడు జనాల కళ్ళలో ఉండాలి అది ఎలాగైతే ఏంటి అనుకుని తప్పితే నిజమైన సేవా భావం ఎంత మందికి ఉంది.  అసలు కారణాలు, తరుణోపాయాలు ఎవరికి అర్థం కావు, అర్థం అయిన JP లాంటి వాళ్ళు ఏదో టీవిలో ఒక రెండు నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చేసి, జరిగిన ప్రతి అంశం మీద తమ expert opinion ఇచ్చేసి  తమ బాధ్యత ఐపోయింది అని అమెరికాలో వాళ్లకి మన దేశం పట్ల ప్రేమ పెంచడానికి ఒకసారి వెళ్లి వస్తారు... ఎవరో వస్తారు ఏదో చేస్తారు, వాళ్ళని పట్టుకుని మనం కూడా ఏదో ఉద్దరిద్దాం అంటే అది జరిగేలాగ కనిపించట్లేదు.. నేను లోక్ సత్తా అంటే నా సత్తా అనుకుని ఎంతో మురిసిపోయా, కాని చిన్నప్పుడు ఆశగా అన్నలు వచ్చి కష్టాలు తీరుస్తారు అని ఎదురు చూసి నిరాసపడ్డట్టే ఇది కూడా అని తలుచుకుంటే బాధగా ఉంది.


మనం పదవిలో ఉన్నప్పుడు ఏమి చేశాం అని వెనక్కి తిరిగి చూసుకునే వాడు లేదు, పోనీ అవతలి వాడు చెయ్యలేదు మనం చేద్దాం అని ఉన్న వాడికి లేదు.  అమెరికా లో వాడు డబ్బుతో ఇండియాలో రాజ్యాలు ఎలేసేవాళ్ళు, ఈ రైతు లేకపోతె కేవలం డబ్బు ఉంటుంది తినడానికి తిండి ఉండదు అని గుర్తుంచుకుంటే ఈ కష్టాలు కొద్దిగా తగ్గుతాయేమో.


India is a developing country.. ఇదే మాట మా అమ్మ నాన్నల తరం చదివింది, నేను చదివాను, రేపు చిచ్కూ ఆ తరవాత తన పిల్లలు కూడా చదువుతూనే ఉంటారేమో ఇదే పరిస్థితి కొనసాగితే.

ఏదో ప్యాకేజి ప్రకటిస్తారు రైతులకి అని వార్తల్లో వస్తుంది, ఎమోస్తుందో, ఎంత మేర అది ఉపయోగ పడుతుందో ఎదురు చూడటం తప్ప పెద్దగా నేను చెయ్యగలిగిందేమీ లేదు.

బయట రోడ్డు మీద మొక్క మొలిచిన ధాన్యం చూస్తె తట్టుకోలేని బాధ, నిజంగా ఇదంతా రైతు గురించి బాధేనా రేపు పెరగబోయే బియ్యం ధర గురించా అని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేనంతగా ఈ జీవిత చట్రంలో ఇరుక్కుపోయిన నాకు ఇంకొకరి గురించి అనే యోగ్యత కూడా లేదేమో.

5 comments:

  1. బాగుందండి .ఈ వర్షాల పై సెం నాది ఇదే ఫీలింగ్ .వర్షాల పై నా పోస్ట్ చుడండి.http://saisatyapriya.blogspot.com/2010/12/blog-post_10.html.

    ReplyDelete
  2. బావుంది చాలా బాగా రాశారు

    ReplyDelete
  3. మన రైతుల కోసం లోక్ సత్తా పార్టీ లేదా JP ఏం చేస్తే బాగుంటుందంటారు?

    వీలైతే ఇది చూడండి.. http://www.youtube.com/watch?v=IiwOmW-L1G4&feature=player_embedded

    ReplyDelete
  4. edo cheptaaru kada rajesh pettani amma elaagu pettadu pette ---- ki emi rogam vacchindi ane typelo.. nenu Loksatta ante adi inka organizationga unna time ninchi veerabhimanini.. aayana theoriticalga pucca plan toti, chaala nirdishtamaina abhipraayalatoti untaaru.. like the speech where he speaks about exporting rice and stuff is super effective IF AND IF it is put in practice, kaani follow up undaalsinanta undatledu, maybe partly because he is the sole warrior in the assembly or the state or whatever...

    emi cheyyali ani teliyadu. tanu edo cheppestaru ani nenu eduru choosi impact lekapote okkosari kopam vastundi.. expectations from him to me are really high. I guess he has to be more result oriented elaa anedi naa burraki inkaa tattatledu..

    ReplyDelete
  5. vammo. super andi varsham meeda mee blog. heroin ki santhosham rythulaki santhapam annatlundi ee varshala thoti. ika JP vishayanikosthe ayanokkadu em cheyyagaladu rajesh gaaru. atleast manam mana relatives friends tho (who can vote) vote chepinchadam roju discuss cheyyadam lantivi chesi konchem root level lo improve cheyyali

    ReplyDelete