Sunday, December 5, 2010

దేవుడంటే?

నాకు దేవుడు అంటే కొంచెం ఇష్టం, కొంచెం భయం.. ఆ అంతర్యామి ఎవరైనా సరే నాకు ఒక మంచి స్నేహితుడు, అది అతనే ఎందుకు ఆవిడ ఎందుకు కాకూడదు అంటే సమాధానం లేదు...అలాగ అలవాటు ఐపోయింది..  అలుగుతాను, అరుస్తాను, మెచ్చుకుంటాను, తిట్టుకుంటాను కాని అది మా ఇద్దరి మధ్యన పర్సనల్ మేటర్..


అసలు దేవుడు లేడేమో అనే అపనమ్మకం అసలు ఎప్పుడు లేదు కాని ఆయన్ని/ఆవిడని నేను చూసే కోణాలు మాత్రం చాలా చాలా మారాయి నేను పుట్టి పెరిగాక... చిన్నప్పుడు స్వామి తాత అంటే భయం, భక్తీ (ఇంట్లో వాళ్ళు నూరిపోసారు కదా) ఏదైనా తప్పు చేస్తే స్వామి తాత చూస్తాడు అబ్బో చెంపలు వాయిన్చేస్తాడు.. మంచి చేస్తే స్వామి తాత ఏది కావాలంటే అది ఇస్తాడు.. సో బేసిక్ గా  ఆయన మంచోడు.. fear factor , ఎప్పుడు బుద్ధిగా ఉండాలి అని మమ్మల్ని ఒక గాడిలో పెట్టె మార్గం అన్నమాట.


కొంచెం పెద్దగా అయ్యాక.. దేవుడి పూజ చేస్తే కొత్త బట్టలు వస్తాయి, భలే పిండి వంటలు వండుతారు, గుళ్ళో కూడ భలే ప్రసాదం పెడతారు... అబ్బో ఆయన ఫుల్ సూపరు ఎప్పుడు చూసిన దండలు, పూజలు, పిండి వంటలు, కొత్త కొత్త పట్టు బట్టలు, టైము కి అన్ని అమిరిపోవాడాలు.. అబ్బో అసలు పుడితే దేవుడిగా పుట్టాలి అని ఒకటే కుళ్ళిపోవడం, మళ్ళీ అంతలోనే అమ్మో దేవుడికి మన ఆలోచనలు తెలిసిపోతాయి కదా మనం కుళ్ళుకుంటున్నాం  అని తెలిస్తే తోక తెంపి చేతిలో పెడతారేమో అని ఒక మూలన భయం..


ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక, ఏదైనా సరిగ్గా ఒళ్ళొంచి చదవనప్పుడు, భారి తప్పు చేసేశాం ఇంక ఇంట్లో కోటింగ్ తప్పదు అనుకున్నప్పుడు గబా గబా ఒక instant prayer అండ్ లంచంగా మొక్కులు మోక్కేయడాలు.. ఈ మొక్కులు దేనికోసమైన అవ్వొచ్చు.. ఇవ్వాళ వాన పడాలి, ఫలానా టీచర్ గారికి కడుపు నొప్పి రావాలి, స్కూల్ లో వాచీ పాడైపోవాలి లంచ్ బెల్ కి హోం బెల్ కొట్టెయ్యాలి దేగ్గర్నించి ఏదైనా అవొచ్చు... అప్పుడు కూడ ఆయనంటే భయం, భక్తీ రెండు..


ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు నాలో దొంగ భక్తి అదేనండి మొక్కులు కోసం మొక్కే భక్తి కాకుండా ఒక మహా శక్తి మీద నమ్మకం పెరిగింది.. అది ఆయన అవొచ్చు, ఆవిడ అవ్వొచ్చు.. అన్నిటికి మూలం అదే శక్తి... ఎందుకో ఒక అతీతమైన శక్తి మీద నమ్మకం కుదిరిపోయింది.. అది ఎవరైనా అవొచ్చు.. ఆ శక్తి ఎన్నో రూపాల్లో ఉంటుంది.. మనకి ముందుకు నడవటానికి స్ఫూర్తి ఇస్తుంది.. ఆ నమ్మకమే లేకపోతె మనం ఒక్క అడుగు ముందుకు వెయ్యలేమేమో అనిపిస్తుంది నాకు .. భగవంతుడు అనేది ఒక మూర్తిలో కాదు, ప్రతి చోట, ప్రతి అణువులో ను ఉంది. నాలో ఉంది , నాలోనే ఉంది అని ఒక గట్టి నమ్మకం.  అందరు తలా ఒక పేరుతొ పిలిచినా దానికి కేంద్ర బిందువు ఒక్కటే, ఒక్కరే.  అచంచలమైన నమ్మకం, అపారమైన విశ్వాసం.  మనలోనే మనం భగవంతుడిని కనుగొంటే అంతకు మించి ఇంకో మోక్ష మార్గం ఉండదేమో.


నాకు దేవుడంటే ఇష్టం, చాలా చాల ఇష్టం.. కాని దేవుడి పేరు మీద చేసే చాందసం అంటే అసహ్యం, మూడ విశ్వాసాలు అంటే కంపరం.. హిందువులు ముక్కోటి దేవతలను పూజిస్తారు, నాకు అందరు ఇష్టమే, ఆ పూజ విధానం ఇష్టం.. ఆ పూలు, ప్రసాదాలు, అలంకరణలు అన్ని చాలా ఇష్టం కాని పక్క వాడు ఆకలితో మాడుతున్న సరే పంచభక్ష్య పరవాన్నాలు దేవుడికి నైవేద్యం పెట్టడం ఇష్టం లేదు.. నాకు అభిషేకం చూడటం అంటే ఇష్టం కాని చేస్తున్నంత సేపు మనసులో పీకుతూనే ఉంటుంది.. ఇన్ని పాలు అలా వృధా చెయ్యమని దేవుడు చెప్పాడా? ఒక పసి బిడ్డ ఆకలి తీరిస్తే ఆయనకి నిజంగా పెద్ద పూజ కదా అని.. పట్టు పీతాంబరాలు పూటకోసారి మారుస్తుంటే ఒంటిని కప్పుకునేందుకు సరిగ్గా బట్టలు లేక తిరిగే ఆడపిల్లలు గుర్తొస్తారు.. అంతలోనే అమ్మో దేవుడికి కోపం వస్తుందేమో అని ఒక భయం... TTD ఛానల్ ఎప్పుడు చూసిన వైభవంగా పూజలు చేస్తూ ఉంటారు, ఆ వేద ఘోష వింటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.. కాని ఎందుకో ఈ అభిషేకాలు అవి తలుచుకుంటే ఎక్కడో ముల్లు గుచ్చుతుంది.


ఎప్పుడు రద్దీగా ఉండే తిరుమల, శ్రీశైలం లాంటి గుళ్ళలో నాకు దర్శనం ఎందుకో తృప్తి కలిగించదు.. అష్ట కష్టాలు పడి ఒక నిమిషం కూడ చూడకుండానే తోసేయ్యడం, లంచాలు, అడ్డ దారులు, సిఫార్సులు... దేవుడి దెగ్గరికి వెళ్లాం అనే తృప్తి కంటే మనసు చిరాకు పెట్టుకోవడమే ఎక్కువ అయిపోతుంది.. గుడి అంటే ప్రశాంతత, నిశ్శబ్దం, మనసుకి స్వాంతన ఇచ్చే చోటు అని నా గట్టి నమ్మకం.  మన ఇంట్లోనే ఒక చిన్న మందిరం, అంతకంటే మన మనసులోనే ఒక బుల్లి మందిరం కట్టుకుని పూజిస్తే అంతకంటే ఏమి కావాలి  .



నాకు జీసస్ అంటే ఇష్టం కాని మతం మార్చేసుకోండి అప్పుడు మీకు మోక్షం అంటే నేను నమ్మను... మా బాబాయ్ వాళ్ళు మారిపోయి ఇప్పుడు హిందువులని తిడుతుంటే గొడవ కూడ పెట్టుకుంటాను.. మిమ్మల్ని నేను అననప్పుడు మీరు ఎందుకు మాట్లాడాలి, మీ గౌరవం మీరు నిలబెట్టుకుంటే మంచిది అని.

అల్లా అంటూ ౫ పూటలా చేసే నమాజు వినాలంటే కూడ చాలా ఇష్టం కాని ప్రతి సారి మతం పేరు చెప్పుకుని చేసే జిహాద్ అంటే చచ్చే భయం.



ఏదైనా మంచి జరిగితే candle వెలిగిస్తాను చర్చిలో, బూబమ్మకి చెప్పి తాయెత్తు కట్టించుకుంటాను, ప్రతి పండక్కి కుదిరితే గుడికి వెళ్లి మనసార దణ్ణం పెట్టుకుంటా.. ఒకప్పుడు నేను ఇష్టపడే వాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు అందరు చల్లగా ఉండాలి అనుకునేదాన్ని.. కాని ఈ మధ్య ఏమి అడగట్లేదు..ఆఖరికి చిచ్కూ గురించి కూడ మనం అడిగిన దాని కంటే మనకి మంచిది అనుకున్నదే ఆయన చేస్తారు అని ఒక నమ్మకం... అందరు బాగుండాలి అంతే.. ఇంకో కోరిక లేదు.. ఎందుకు కోరుకున్న సరే జరిగేది జరగక మానదు.. అదుగో కోరుకున్నాన నువ్వు మళ్లీ ఎందుకు చెయ్యలేదు అని ఆయనతో గొడవ పెట్టుకోలేను మళ్లీ :).


నేను దీపం వెలిగిస్తే అది నా మనసులోని చీకటి పారదోలటానికి.. మంత్రం వింటే మనసు పవిత్రంగా ఉంచుకోతానికి, వేద ఘోష వినపడితే నాలో అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి అంతే కాని అలా చెయ్యకపోతే నన్నెవరో ఏదో అంటారు అని కాదు.  తల స్నానం చెయ్యకుండా గుడికి వెళ్ళకూడదు అంటే నేను నమ్మను, శరీరం కాదు మనసు పవిత్రంగా శుభ్రంగా ఉండాలి అని గట్టిగా నమ్ముతాను.  కోటి పాపాలు చేసి ఒంటిని మాత్రం సుభ్ర పరుచుకుని గుడి ప్రాంగణంలో కెల్లటం కంటే, ఆ భగవంతుడుని తలుచుకుంటే ఇంట్లోనే ఉండటం మేలు అనుకుంటాను.  ఒక అజ్ఞాత శక్తి నన్ను నడిపిస్తుంది అని నేను గెట్టిగా నమ్ముతాను.. ఇప్పుడు నేను చిచ్కూకి ఏమి నేర్పించాలి, గుడ్డి నమ్మకమా లేక అంతఃకరణ సుద్దిగా నమ్మే తత్వమా.. ఇంత చిన్న మనసుకి ఏమి అర్థం అవుతుంది ఏమి చెప్పినా.  ఇప్పటికి తను కూడ స్వామి తాత అంటుంది.. తల వంచి దణ్ణం పెడుతుంది.. బలం బుద్ధి అని దబాయిస్తుంది :)).. నాకు భలే ముచ్చటేస్తుంది అలా దేవుడి గూడు ఎదురుగా నుంచుని.. బలం, బుద్ధి, బలం బుద్ధి అని బెదిరిస్తున్నట్టుగా అడుగుతుంటే... అంత ముచ్చటగా అడిగితె దేవుడు కూడ ఫ్లాట్ అయిపోవాలి మరి.


మానవ సేవే మాధవ సేవ అని నమ్మినా... మాధవుడే మనతో మానవసేవ చేయిస్తున్నాడు అని ఆ చిన్ని మనసుకి తెలేసేలా చెయ్యడమే నేను తనకి నేర్పించే మతం.. తనలోని దేవుడిని వెలికి తీయడమే తను చేసే పూజ.. తప్పో ఒప్పో.. ఈ తల్లికి పుట్టినందుకు తనకి నేను చెప్పేది ఇదే.

ఆ శక్తి మనతో చేయిస్తుంది అని నమ్మకం లేనప్పుడు నేనే గొప్ప అని భావన మనలో పెరుకుపోతుందేమో కదా?  ఒక సమదృష్టి అంటే ఏంటి.. అది ఎలా అలవర్చుకోవాలి అనేది ముందు నేను నేర్చుకోవాలి.  ఎప్పుడు తిక్కగానే ఆలోచిస్తాను కదా, చదవేస్తే ఉన్న మతి పోయినట్లు, ఇందులోనూ నా ఆలోచనలు నావి. ఈ పోస్ట్ కూడ తిక్కగానే అనిపిస్తుంది నాకు.  ఏమి అర్థం కాదు, అంతా అర్థం అయినట్లు ఉంటుంది... అన్నిటిలాగే నాకు దేవుడి మీద పూర్తి అవగాహన లేదు, నాకు తోచింది నేను అనేసుకోడమే, కాని తెలిస్తే కాని నమ్మను అని మూర్ఖత్వం మాత్రం లేదు... ఒక సద్గురువు ఉంటే చాలా బాగుంటుంది.. కాని ఈ కల్తీ కాలంలో నిజమైన గురువు ఎక్కడ దొరికేను అంతలోనే అనుమానం... కాలమే చెప్పాలి.

11 comments:

  1. ఎక్కువగాచదువుకునే మనలాంటి వాళ్లం ఇంతేనమ్మా
    అదే చదువులేకున్నా పెద్దలిచ్చినసంస్కారాన్ని యథాతథంగా పాటించేవాడు మాత్రం ఏ అనుమానాలు లేకుండా ఆయనను నమ్ముతాడు . మనమేమో మన జానాబెత్తలకొలతలకు దేవుడు ఇమిడిపోవాలని కోరుకుంటాము
    చివరి కోరికమాత్రం బాగుంది . దానికి మార్గం కూడా ఉంది. గురువు గురువు అని వెతికి మనతెలివితేటలతో వెతికి ఎవర్నో పట్టుకుంటే ,గుడ్డోడు ఇంకో గుడ్డోడి చేతినిపట్టుకుని నిర్భయంగా నడుస్తున్నాననుకున్నట్లు ఉంటుంది.
    అలాకాక గురుచరిత్రవంటి సద్గ్రంథాలను, మహనీయుల చరిత్రలను చదువుతూ ఉంటే ,భగవంతున్ని ప్రేమపూర్వకంగా ఆరాధిస్తూ లేక ధ్యానిస్తూ ఉంటే దూడ దగ్గరకు ఆవు పరిగెత్తుకునివచ్చినట్లు ఆయనే పరిగెత్తుకుని వస్తారు మనసంస్కారాలు సిధ్ధపడాగానే .శుభం

    ReplyDelete
  2. చాలా బాగుంది మీరు రాసినది.
    గురువులు ఉన్నారు, కానీ అందరు గురువులూ అందరికీ సరిపోరు. సరైన సమయం వచ్చినప్పుడు మీ గురువు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు.

    ReplyDelete
  3. www.dattapeetham.com visit cheyandi. andariki guruvu,guruvulake guruvu, sadguruvu varu evaro telustundi.
    alage sri guru charitra,sri datta darshanam chadavandi tappanisariga.

    ReplyDelete
  4. hi same feelings. meeru cheppe theeru bagundi. na guruvu nannu vethukuntu eppudu vastharo ante, maa ammayi antundi nannu guruvuni chesuko gyanbodha chesthanu ani...so sweet kada...nake thinaka nerputhundi.

    ReplyDelete
  5. :) baagundi mee post. guruvula sangathi naaku theliyadu kaani demudi gurinchi maatram same feelings naaku kooda... abhishekaalu choosinappudu naaku alane baadesthundi. nizam ga sivudi ki paalatho abhishekam chesthe punyam vasthundo raado theliyadu kaani oka peda vaadiki chese saayam lo unna trupthi nizam ga goppadi.. enni ksheerabhishekaalu chesina raanidi.. ika pillala vishayam antaara.. manam ela alochisthe aa alochanale vaallaki vasthai (thikka ga???) :) enthaina genes effect kada... just kidding..

    ReplyDelete
  6. @Durgeswara.. tane vastaaru ani waiting.

    ReplyDelete
  7. @Kotta paali. thank you and hope so.

    ReplyDelete
  8. @Sreedevi.. nijamgaane vaalla deggara ninchi manam chaala nerchukovaali kada..

    @Radha.. genes effect :).

    ReplyDelete
  9. @Maheshudu.. will see. thank you.

    ReplyDelete
  10. very well written. completely agree to your idea of "atheethamaina shakthi" or supreme power.

    chinna question: "telisthe kaani nammanu" anukovadam moorkhathvama leka peddalu chepparu, grandhallo undi, ade correct ayyi untundi ani mana gnananni, medhassu ni vadakapovadam moorkhathvama ?...

    grandhalu rasevallu, manaku cheppe peddalu kooda ekkado vini /chadivi cheppinave kada. ante annitiki moolam evaro okaru / kontha mandi, valla paristhuthula prabhavam lo srushtinchina aacharale ivanni..oppukuntara ? adi unnadi unnattu ga paatisthe samskaram lekunte moorkhathvam anadam nenu angeekarinchanu.

    ReplyDelete
  11. evoro okarini nammekante , devudini nammatam chaalaa melu anipisthundi chaala saarlu.

    ReplyDelete