Friday, December 3, 2010

మొదటి బంతిలో భోజనం

మా ఊర్లో నాకు చాలా చాలా నచ్చే విషయం ఎవరైనా భోజనాలకి పిలిస్తే వెళ్లి రావడం.. ఇందులో కొత్తేముంది, అసలు అంత భారీకాయం తిని తినే పెంచావ్ కదా అనుకుంటున్నారు కదా.. వాకే, వాదం లేకుండా నిజమే అని ఒప్పేసుకుంటున్న.. ఇక పోస్ట్ విషయానికొస్తే.. ఊర్లో భోజనాలంటే ఇష్టం ఉండటానికి చాలా బలమైన కారణం అవి బఫే భోజనాలు కాదు.. ఎంచక్కా టేబులు, కుర్చీలు వేసి విస్తరాకో, అరటి ఆకో వేసి అవి కడుక్కోటానికి ముందుగా నీళ్ళు పోసి చేతులు ఆకులు కడుక్కున్నాక.. కమ్మని వాసనలోస్తున్న వేడి వేడి వంటలు అయిన వాళ్ళు వడ్డిస్తూ, సరదాగా పలకరిస్తూ, ఆప్యాయంగా కొసరి కసరి మారు వడ్డిస్తూ ఉంటే ఆ తృప్తి వేరు కదా.


ఒక ప్లేటు పట్టుకుని క్యూ లో నుంచుని, మన వంతు వచ్చేదాకా ఆగి, మనం పెట్టుకు రావడమో, ఎవరైనా ఏస్తే వేయించుకుని రావడమోఅంటే నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు.. కాని ఎక్కడ చూడు ఇదే గోల.. ప్లేటు 200లు పెట్టి చేయించాం, 300 పెట్టి చేయించాం అనేవాల్లె కాని ఎంత మంది తృప్తిగా తింటున్నారు అని పట్టించుకునేవారేవారు?  పోనీ ఎలాగోలా ఆ తిండి వేయిన్చుకోచ్చమే అనుకోండి అది పట్టుకుని ఎక్కడో ఒక చోట నుంచుని తినాలి... తక్కువ తక్కువ పెట్టించుకుంటే మళ్లీ వెళ్లి రావాలి అని ఒకేసారి అని వేయించుకొచ్చేసరికి మోయలేనంత బరువు ఉన్న ప్లేటు, కూర్చో కూర్చో అని చేతులు పీకేసేలాగా చేస్తుంది.. ఇంక అస్సో ఉస్సో అంటూ తినడం పూర్తి చేసి ఏదో అయ్యిందనిపించడమే అక్కడ.. గుంపులో గోవిందంలాగా.  ఒకప్పుడు ఇవే సరదాగా ఉండేవనుకోండి, కాని అది బాగా చిన్నప్పుడన్నమాట. ఏంటో అందంగా తయారు చేసిన కూరగాయల బొమ్మలు, ఐస్ కార్వింగ్లు, చాట్ కౌంటర్లు, సెగలు పొగలు కక్కే గిన్నెలు.. చక్కగా కోసిన క్యారెట్, కీర, ఉల్లి ముక్కలు.. అబ్బో అసల పండగంటే అదే.. కాని అప్పుడు మనకి సిగ్గు గట్రా ఉండవు కనక, ఎన్ని సార్లు ఐన వెళ్ళొచ్చు కనక, ఎంత దూరమైనా ప్లేటు పెట్టుకుని వెళ్ళొచ్చు కనక, లేదంటే అసల కిందే కూచుని చక్కగా లాగించొచ్చు కనక.. వయసు పైబడ్డ కొద్ది నాకు ఈ విందులు నచ్చడం మానేశాయి. 


నేను ఎక్కువగా సెలవల్లో ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అవ్వడం, సెలవల్లోనీ పెళ్ళిళ్ళు జరగడం, లేదంటే వోణీలు, పంచెలు, శష్టిపూర్తులు వగైరా వగైరా కార్యక్రమాలన్నీ అప్పుడే ఉండేవి.. చెంగు చెంగు మంటూ గంతులేసుకుంటూ బయల్దేరేవాళ్ళం తాతయ్య తోటి.. అమ్మమ్మ తో వెళ్తే మరి ఎప్పుడో చివరాఖర్న పెడతారు కదా అదే తాతైతే ఫష్టు బంతిలో కూర్చుని తినేస్తాడు మరి.  ఆ మొదటి బంతిలో అందరు తాతలే ఉంటారు.. పొద్దున్నే 10 గంటల నించి మొదలు, మరి వాళ్ళు ఇంట్లో అన్నం తినే టైము అదే కదా.  నాకు మా తాతతో భోజనానికి వెళ్ళడం అంటే చాలా సరదాగా ఉండేది.. తన పక్కనే కూర్చోపెట్టుకునే వాడు, ఏదైనా నచ్చి మళ్లీ కావలి అంటే వాళ్ళని కేకేసి పెట్టించేవాడు, చక్కర పొంగలి లో జీడిపప్పు గట్రా వస్తే చక్కగా వేరు చేసి నాకు పెట్టేవాడు.. ఆఖర్లో నిమ్మకాయ మజ్జిగ పోస్తే గ్లాసులో అడిగి పోయించి ఇచ్చేవాడు.. కిల్లి ఐతే ఎప్పుడు నాకే తనది కూడ.. అస్సలు మొహమాటం లేకుండా కుమ్ముడే కుమ్ముడు.  అమ్మమ్మ ఏమో అన్ని పనులు పూర్తి చేసుకుని, ఎప్పుడో తీరికగా తన గ్యాంగ్ తోటి వచ్చేది, అప్పటికి మేము ఏసిన గంతులకి అది అరిగిపోతే మళ్లీ రెండో రౌన్డుకి కూడ రెడీ... పది పన్నెండేళ్ళు వచ్చేవరుకు ఇదే వరస, తరవాత కొంచెం సిగ్గు పడాలి, ఆడపిల్లలు అని అమ్మమ్మ తాతతో పంపేది కాదు.. సో అక్కడితో మా విందు వినోదాలు కట్టు అన్నమాట.


కాని అప్పటికి కూడ మా కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే నేను మాత్రం తాతతోనే తినేదాన్ని.. దగ్గరుండి సుబ్బరంగా పెట్టించేవాడు, తనతో తింటే నాకు నా బాల్యం అంతా కనిపించేది మరి... కాని సీన్ change అన్నమాట.. ఇప్పుడు ఐస్ క్రీం పెడతారు కదా అది నాది కూడ తాతకే ఎందుకంటే తనకి చక్కగా నమలకుండా మింగేయోచ్చు కదా.. కిళ్ళీ మటుకు ఆయన ఉన్నంతవరుకు నాదే.


నిన్న మా ఊర్లో, కార్తీక మాసం అన్న సమారాధన కార్యక్రమం శివాలయంలో జరిగింది.. ఊరంతా వెళ్లి భోంచేస్తారు అక్కడ ప్రతి ఏడాది.. బీద గొప్ప అని లేకుండా.. ఎవరికి తోచింది వారు ఇచ్చి గుడి ప్రాంగణంలో తిని దేవుడుకి దణ్ణం పెట్టుకుని వస్తారు.. గత ౩ సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటున్నా కాబట్టి నేను తప్పకుండా వెళ్తున్నా.. నిన్న చిచ్కూ గాడిని తీసుకుని వెళ్దాము అనుకున్నా కాని తను పడుకుండి పోయింది, లేపి తీసుకెళ్లడం ఇష్టం లేక నేను సోమామయ్య ఎల్లోచ్చేసాం.. 12 గంటలకి వేల్లెపాటికి ఇంకా బల్లలు సర్దుతున్నారు.. చక్కగా ఇద్దరం వెళ్లి మొదటి బంతిలో కూర్చుని.. నా చిన్న నాటి కబుర్లు చెప్పుకుంటూ, ఊర్లో వచ్చే వారినందరినీ పలకరించుకుంటూ, లేదంటే దూరం నించి ఇకిలిస్తూ, సుష్టుగా తినేసి మాకు తోచింది చదివించి వచ్చాం.. ఊర్లో అందరు కోతలకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చాక సాయంత్రం దాక ఈ సంతర్పణ జరుగుతూనే ఉండి.. మైకులో చదివింపులు వినపడుతూనే ఉన్నాయి.


ఇప్పటికీ ఊర్లో బల్లలు, కుర్చీలు వేసి పెడుతున్నారు కాని టేబుల్ liner మాత్రం polythene వాడుతున్నారు.. విస్తరాకుల బదులు పేపర్ ఆకులు వస్తున్నాయ్.. గ్లాస్సుల బదులు disposables వాడుతున్నారు.. పెద్ద వాళ్ళు మాత్రమే ఊర్లో మిగిలిపోయి, కుర్రాళ్ళకి ఇష్టాలు లేక suppliers వచ్చేసారు కాని ఇప్పటికీ పెద్ద వారు ఆ చివర నించి ఈ చివరి దాక తిరుగుతూ అందరు సరిగ్గా తింటున్నార లేదా అని అజా కనుక్కుంటూనే ఉన్నారు, ఇంక చుట్టరికాలు కలుపుకుంటూ నోరార మనవడా, మనవరాల, అబ్బాయి, కోడలా అని నోరార పలకరిస్తూనే ఉన్నారు.  మొన్న మేనమామ కూతురు పెళ్లి జరిగింది అందులో కూడ ఇలాగే చక్కగా పెట్టారు, నాకు చాలా చాలా తృప్తిగా అనిపించింది.. ఏదో కమ్యూనిటీ హాల్ మాట్లాడేసి, పెళ్ళికి ఒక పూట ముందు, కొన్ని సార్లు కొన్ని గంటల ముందు వెళ్లి, అంటీ ముట్టనట్లు వచ్చేయకుండా, ఇంట్లోనే తాటాకులు, కొబ్బరాకులు కలిపి పందిరి వేసి, మండపం చేయించి, కొత్త పాత కలయికలో ఎంతో ముచ్చటగా చేసారు.. చిచ్కూ గాడి పెళ్లి నాటికి నేను ఇలాగే చెయ్యగలిగితే నాకు ఇంతకంటే ఇంక ఏమి వద్దేమో.. హయ్యో హయ్యో ఎంత విడ్డూరం చూడండి.. తనకి ఇంకా రెండో ఏడు కూడ నిండలేదు నేను తన పెళ్లి గురించి కోరికలు.. సగటు తల్లి లాగ ఆలోచించా కదా?  తాత అమ్మమ్మ తప్ప మిగతా అంతా అలాగే ఉన్నట్టు అనిపించింది నాకు మాత్రం పెళ్ళిలో.. వాళ్ళు తిరుగాడిన దొడ్డిలోనే పెళ్లి, వాళ్ళు వేసిన చెట్ల నీడలోనే భోజనాలు, పందిళ్ళు.. చాలా చాలా బాగుంది..


నిన్న మొదటి బంతిలో తినడం ఈ జ్ఞాపకాల వెల్లువకి తెర తీసింది... నాకు ఉన్న ఇన్ని మధురానుభూతుల్లో ఎన్ని నేను నేను నా బంగారు తల్లికి మిగల్చగలను?  తనని నాగరికత నడుమ, గొప్పగా ఇంగ్లీషు పద్దతిలో ఈ కాలం పిల్లలాగ పెంచనా.. లేదంటే ఇంకొన్నాళ్ళు ఈ మమతానురాగాల మధ్య ఉంచనా?

7 comments:

  1. వోణీలు, శష్టి పూర్తులకు వెళ్ళేవాళ్ళు. బానే ఉంది. కానీ పంచెలు ఎంటండి.. పంచెలు కూడా పెట్టేవాల్లా మీ వూళ్ళో ;-)

    చిచ్కూ నిద్రపోతుందని మీరు 12 గంటలకల్లా బొంచేసి వచ్చేసారు. బానే ఉంది. మరి చిచ్కూ లంచ్ పరిస్థితి ఏంటి? చిచ్కూ తినలేదని చెప్పి మరలా 2 గంటలకు వెళ్లి మళ్ళీ ఓ రౌండ్ లాగించేసారా ఏంటి? నిజం చెప్పేయండి.. :-)

    ReplyDelete
  2. yeah.. ammayilakaite vonilu, abbayilakaite panchelu istaaru.. similar to the vonilu function, menamaamalu, ammamma vaallu istaaru.. krishna zillalo chestaaru mari..

    hee... sannaga rivata laaga unnappudu enni saarlu kummina parledu babu, ee sizelo rendo saari velite pette vaallu kooda tarimi tarimi kodataaru.

    ReplyDelete
  3. Well written. Na chinnanati gnapakalanu kooda thatti leparu.. chinnappudu nenu kooda ma thathayyatho vellevadini bathulaki :-)

    ReplyDelete
  4. good post sree...

    nizamga naaku kooda anipisthundi maa pillala pellillu kooda patha kaalam lo la cheyyalani.. toomuch mundu choopu kada! appati varaku meeru ila blog lo raasthoo unte, nenu ilane chaduvuthoo unte, thappakunda inform chestha ela chesano pelli :)

    ReplyDelete
  5. @Ramakrishna...
    aa mazaane veru kada.

    ReplyDelete
  6. @Radha ante enti asalu mee uddesam, innellu manam postlu commentlo parichayam undi kooda pelliki pilavara... hammma hamma, nenu hurtu.

    ReplyDelete
  7. meru cheppinattu banti bhojanam Ruche veru...evarina eppatikipudu piliste bagundu anipinchindi...tis is my blog meku vilunnapudu oka look vesi ela undo cheppandi

    http:/kallurisailabala.blogspot.com

    ReplyDelete