Sunday, October 10, 2010

నేనేంటి? - కధాంబుధి 1

ముద్దు ముద్దు మాటలతో, బుడి బుడి అగుడులతో ఇల్లంతా తిరుగుతూ నా దెగ్గరకి చేరిన నా మనవడు ఆర్య, చిట్టి చిట్టి చేతులతో నా మెడని చుట్టేసి వీపు మీద వేలాడుతున్నాడు..  బామ్మ "what is your name ?" అంటూ తను కొత్తగా నేర్చుకున్న కొత్త విద్యలు ప్రదర్శిస్తూ అడిగిన ఈ ప్రశ్న జ్ఞాపకాల పొరలను చీల్చుకుని గుండెని సూటిగా తాకింది...

నేను...

అవునూ నేను అంటే ఎవరు, నా పేరేంటి.. అమ్మాయి, అమ్మడు, అమ్మాయి గారు, ఏమే, ఒసేయ్, అదిగో, ఇదిగో, అమ్మ గారు, అమ్మ, అత్తయ్య, పిన్ని, అక్క, ఇప్పుడు నానమ్మ, బామ్మ తప్ప నా పేరు అంటూ నాకు కూడా గుర్తులేదే. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ నాన్న నాకు పేరు పెట్టారు అన్న సంగతి వాళ్ళ లాగానే కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. నా పేరుతొ ఎవరికి అవసరం.. అసలు ఆ మాటకి వస్తే ఇప్పుడు మాత్రం నాతో ఎవరికి ఏమి అవసరం.

ఆడపిల్లకి చాకలి పొద్దు రాయటం వరకు చదువు వస్తే చాలు అన్న నాన్న గారి మాటలు విని, వాళ్ళు చూసిన సంబందం వంచిన తల ఎత్తకుండా చేసుకుని పుట్టింటి నించి అత్తగారి ఇంట్లోకి మారిపోయాను.. అక్కడ తండ్రి నీడలో, ఇక్కడ భర్త అడుగుజాడలో.. అదే నా జీవిత పరామార్థం అని చిన్నప్పటినించి నూరి పోసి ఉండటం వలన ఈ రోజుల్లో పిల్లల్లాగా నాకు పెళ్లి ఒక బంధకంగా అనిపించలేదు. జీవితం ఇలా ఉండాలి, భాగస్వామి ఇలాగ ఉండాలి ఏమి ఎరుగని కాలం అది. పెళ్ళంటే ఇది అని తెలిసేలోపే కడుపులో ఒక నలుసు.. మా బంగారు కొండ.. ఎంత మురిసిపోయాను, యాంత్రికమైన జీవితానికి కొత్త వెలుగు, ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయినా తరవాత నేను నా బొజ్జలో వాడు, తను నేను ఒకటి, నేనే తను తనే నేను అంటూ, ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూ ఏదో లోకాల్లో విహరించే దాన్ని. నాలో నాకే తెలియని ఒక సున్నితమైన మనస్తత్వం నాకు కనిపించింది, ఎంత వెదికి వెదికి నా ముద్దుల మూటకి నేను పేరు పెట్టుకున్నాను... అమ్మాయైతే శ్రేయ అని అబ్బాయి ఐతే శౌర్య అని.  అడిగిన వారికి అడగని వారికి కూడా వాడి పేరు చెప్పి, వాడి అల్లర్లు చెప్పి, వాడు అడిగే ప్రతి మాటకి సమాధానం నాకు తోచినంతలో కధలల్లి చెప్పి, వెండి వెన్నలని చూపించి పాల బువ్వ పెట్టి, వాడికి దెబ్బ తగిలితే నేను కంట నీరు పెట్టి, జ్వరం వస్తే నేను లంఖణం చేసి.. ఎన్ని ఎన్ని మధుర స్మృతులు.


వాడు పుట్టక ముందు అబ్బాయి ఐతే armed forces లో చేర్పించాలి అనుకునేదాన్ని, దేశమాత ఋణం అని ఏదో అనుకునేదాన్ని.. ఏముందిలే ఆలోచనలే కదా మేడలు కట్టేసాను.  వాడు పెరుగుతున్న కొద్ది నాలో స్వార్ధం కూడా పెరిగిపోయింది నా బిడ్డ నా కంటి ముందు ఉండాలి, కలకాలం ఉండాలి అని ఇంక అంతే అభ్యుదయ భావాలు, సమాజ  ఉద్దరణ లాంటి మాటలు నా నోట రావడం మానేశాయి.  గుండెలో నుంచి రాని భావన పెదవుల మీదకి మాతరం ఎలా వస్తుందిలెండి.

వాడి ప్రతి మాట నాకు వేదం, ప్రతి అడుగు నాకు మురిపెం, వాడి జీవితంలో ప్రతి మైలురాయి నాకు ఒక పెద్ద వేడుక, కొత్తవి నేర్పించడం, వాడితో పాటు నేను కూడా ఎన్నో నేర్చుకోవడం.. ఒక్కడు చాలు వరాల మూట అన్నట్టు నాకు తరవాత పిల్లలే పుట్టలేదు. మా ఇద్దరిదే ప్రపంచం.. మా ఇద్దరి కోసమే ప్రపంచం అన్నట్టుగా ఉన్నాం, అప్పుడు ఇంక ఏమి గుర్తు రాలేదు.. అన్ని బాగున్నప్పుడు కాలం ఆగుతుందా లేదు కదా.. వాడు కాలేజికి వెళ్ళడం, కొత్త స్నేహాలు, కొత్త వ్యాపకాలు, కొత్త ఆలోచనలు, మెల్లిగా నేను మరుగున పడిపోయా.. అలా నా జీవితంలో చరిత్ర కారులు చెప్పినట్టు స్వర్ణ యుగం, కాదు కాదు వజ్ర యుగం లాంటిది ఏమైనా ఉంటే అది ముగిసిపోయింది.

ఏమాటకామాట చెప్పుకోవాలి నేను పడ్డ కష్టం ఏముందో లేదో కాని వాడు మాత్రం ఎంతో శ్రద్ధగా చదువుకుని ఒక గొప్ప విద్యావేత్తగా మారాడు, software software అంటూ కాలం పరుగెడుతున్నా కూడా వాడు మాత్రం తనలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని తయారు చెయ్యాలి అని పవిత్రమైన విద్యని అందరికి పంచడమే వృత్తిగా ఎంచుకున్నాడు.. మేధావిగా ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు కూడా అందుకున్నాడు. ఎంతో మురిసిపోయాను నేను కాని ఎందుకో మనసు అట్టడుగు పొరల్లో ఒక వెలితి, సంపాదనలో ఉద్యోగంలో పడిపోయి ఇన్నాళ్ళు దూరంగా ఉన్న తండ్రి రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నందువల్ల ఒక ఆప్త మిత్రుడు దొరికాడు అంట, తీరిక సమయం దొరికితే తండ్రీ కొడుకులు ఒకటే చర్చలు కబుర్లూను, బయట స్నేహితులు, పెళ్లి అయ్యాక భార్య, ఇప్పుడు వాడి కొడుకు. సరదాలు ముచ్చట్లు వింతలూ విశేషాలు అన్ని వారితోనే పంచుకోవడం.. ఎప్పుడు అమ్మ అదేంటి, ఇదేంటి అంటూ నా చుట్టూ తిరిగే నా బిడ్డ ఏదైనా నేను కల్పించుకుని చెప్పాలన్నా ఊరుకో అమ్మా నీకు తెలియదు అంటున్నాడు. ఏంటి ఈ అన్యాయం అని నా మనసు విపరీతంగా ఘోష పెడుతుంది.. ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించడమే కదా మనిషి జీవిత లక్ష్యం, అదే కదా గీతలో శ్రీ కృష్ణుడు.. అదేలెండి.. భగవంతుడు మనకి చెప్పింది మరి నా పరిమితిలో నేను బాగానే చేసానే.  అసలు ఏనాడు ఇది బరువు, బాధ్యత అన్నట్లుగా చెయ్యలేదే? ఎంతో మనస్ఫూర్తిగా చేసానే మరి ఎందుకు ఈ వయసులో నాకు ఈ వంటరితనం అందరూ నా చుట్టూ ఉండి కూడా నా చుట్టూ నేను గిరి గీసుకుని ఉండేలాగా ఎందుకు మారిపోయాను. అంతేలే మనం ఫలాపేక్ష లేకుండా ఏదైనా సరే చెయ్యాలి అని కూడా ఆయనే అదే గీతలో చెప్పాడు కదా.. ఏంటో పిచ్చి మనసు అన్నిట్లోనూ నాకు కావలసింది మాత్రమే వెతుక్కుంటుంది. వారి ధోరణిలో వారు ఉంటే నేను నిర్లక్ష్యం అని ఎందుకు అనుకోవాలి.. ఎందుకు నేను సర్డుకోలేకపోతున్నాను.

కొత్తగా వచ్చిన కోడలు పిల్ల అయినా నన్ను అర్థం చేసుకుంటుంది నాతొ సమయం గడుపుతుంది అనుకుంటే తను కూడా అబ్బాయి ప్రోత్సాహం వలన పైచదువులు చదివి ఉద్యోగంలో చేరింది. ఎంతో గౌరవంగా ఉన్నా కూడా ఏదో ఒక అడ్డుగోడ మా మధ్యలో... బహుశా నేను నా గిరి నుండి లోనికి రానివ్వలేదేమో.. మరి నాకు నేనే వారు, నేను, వాడు తప్ప ఎవరు లేని ఒక చట్రంలో బిగిసిపోయాను కదా.

తన వృత్తిలో ఎంతో శ్రద్ధాసక్తులు చూపించినందుకు ప్రభుత్వం నా భర్తకి బిరుదులిచ్చింది , సమాజం ధన్య జీవి అంది.


విదేశాలలో ఎన్నో అవకాశాలు ఉండి కూడా మన దేశంలో ఉండి విద్యని ప్రసాదిస్తున్నందుకు నా కొడుక్కి కూడా ఎన్నో సత్కారాలు చేసింది తండ్రికి తగ్గ తనయుడు అంది.


మరి జీవితాంతం ఉహ తెలిసిన తరవాత ప్రతి క్షణం ఈ కుటుంబానికి ధారపోసి, ఆయనకి ఇంట్లో బాధ్యతలు లేకుండా చూసుకుని, బిడ్డని ఎంతో అపురూపంగా, ఆదర్శవంతంగా  పెంచిన నాకు ఏమి మిగిలింది... నీకేమి తెలియదు అనే మాటా? నేను గొప్ప గొప్ప చదువులు చదవలేదు, సాహిత్యంలో ప్రవేశం అంతకంటే లేదు, తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి అని ఏనాడు అనుకోలేదు అయినా ఎప్పుడు అలుముకోని ఈ నిస్పృహ ఏంటి?


ఏదో అసంతృప్తి ఎందుకు ఉండిపోయింది నాలో. ..ఏమి?? వారికి అందిన గౌరవం పరోక్షంగా నాదే కదా.. ఎందుకు నేను ఆ కోణంలో ఆలోచించలేకపోతున్నాను. ఎందుకు నాలో నేను దహించుకుపోతున్నాను?

ఈ కుటుంబ ఆలనా పాలన ఒక తపస్సుగా భావిన్చానే.. ఏంటి ఆ తపస్సుకి ఫలం?  ఇంతకీ దేవుడు వరాలందించి శపించినట్లా  లేక శపించి వరమిచ్చినట్లా.. లేక ఆయన కూడా నాలాగా అయోమయం గందరగోళంలో ఉన్నట్లా?


జీవితంలో ఉన్న ఆశయం నేరవేరిపోయినాక ఏమి చెయ్యను నేను. ఆ ఫోటోలోని విష్ణు మూర్తి నల్లని విగ్రహం నన్ను చూసి నవ్వుకుంటున్నట్టుగా ఉంది. ఆయనకీ నేనంటే హేళన కాబోలు.  . ఎందుకు నాలో ఇంత ఉడుకుమోతుతనం.. నాకంటూ అస్తిత్వం ఒకటి ఏర్పరుచుకోలేదే అని ఒక వెలితి, ఇప్పుడు కొత్తగా ఏమి మొదలు పెట్టలేని అసహాయత.. ఎందుకు నేను ఇంకా ఉండటం తిండి దండగ అనిపిస్తుంది ఈ మధ్య.. కూతురైనా లేదే అని ఒక బాధ కొత్తగా మొదలు అయ్యింది.. ఏంటోలే, కంటి ఎదురుగా ఉండే కొడుకే పలుకరించే తీరిక లేకుండా ఉన్నప్పుడు, ఇంకో అయ్య చేతిలో పెట్టె కూతురు మాత్రం ఏమి చెయ్యగలదు, అసలు నేను ఏమి చేసానేంటి మా అమ్మకి?

కంట్లోనించి కారే నీరు గాల్లోకి తీక్షణంగా చూస్తూ ఆలోచించడం మూలాన వచ్చివో, లేక దుఖంతో పొంగినవో తెలియదు కాని చూపు మసకబారింది..  అడిగి అడిగి విసిగిపోయిన ఆ వెర్రి నాగన్న ఎప్పుడు చేరాడో నా వడిలోకి చేరి నిద్రలోకి జారిపోయి ఉన్నాడు. ఆలోచనల తరంగాలలో తిరిగి చేరిపోవడానికి అవకాశం లేకుండా వాడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడుతుండగా లేచి మళ్లీ గారంగా అదే ప్రశ్న.. what is your name బామ్మ అని.

అవును కదూ నా పేరు కదూ... వెనకటికి ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ చందాన ఉంది నా పరిస్థితి.. ఏంటబ్బా ?? లక్ష్మి కాంతమ్మగా కాలాంతరం చెందిన లక్ష్మి కాంతం కదూ, అసలు బామ్మలకి పేరు కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోయే ఈ తరానికి చెందిన వాడు కదా వీడికి మాత్రం ఎంత కాలం నాతొ ముద్దు ముచ్చటా ఉంటుందో... రెక్కలోస్తే ఈ పక్షీ ఎగిరిపోతుందిగా !!!



కధాంబుధి 

8 comments:

  1. chala bagundi sushma kadha .manchi telugu words use chesavu and nice thought process

    ReplyDelete
  2. Story baagundi Sree. Thoughts anni chala clear ga express chesaru. Oke okka correction, naanamma ani undali kada paina, ammamma ani raasavu ...I might be wrong but wanted to know

    ReplyDelete
  3. oopsie.. supani garu thanks.. maarustaa

    ReplyDelete
  4. ఈ కథ ఈ కాలం అమ్మల కు దర్పణమా ?
    బాగుంది .

    ReplyDelete
  5. kadha baagundi... paatha kaalam vaalla feelings maatrame kaadu.. prati intlo oka stage vachina tharvatha aadavaarilo ekkuvaga kanipinche feeling ani nenu anukuntunna... maa baamma ila anukundo ledo kaani..maa amma anukuntundi appudappudu.. nenu ela anukuntaano..

    nice one

    ReplyDelete
  6. చాలా బాగుంది శ్రీ...

    స్త్రీ కి అస్తిత్వం చాలా చాలా అవసరం...మన వాళ్ళ అస్థిత్వంలో మన అస్థిత్వాన్నిఊహించుకుంటే మనసుకి త్రుప్తిని ఊహించుకోవడమే... మన ముందు తరాలు అలాగే గడిచాయి, మనవి మన ముందు తరాలవి అలా కాకుండా కాపాడుకోవడం మన భాద్యత.

    ReplyDelete
  7. chaala bagundhi, Migilinivi kudaa chadavaali.

    ReplyDelete
  8. చాలా బాగ వ్రాసారు. నిజమే .. స్త్రీ జీవితం లోని ప్రతి అంకం లో తన వాళ్ళ గురించి ఆలొచిస్తూ, తన ఉనికిని కొల్పొతోంది.. తనని ఫలాన వారి అమ్మాయి అనో, ఫలాన వారి ఇల్లాలు అనో అబ్బాయి/అమ్మాయి వాళ్ళ అమ్మ అనే తప్ప తనకంటూ ఆస్థిత్వమంటూ లేదు. ఆన్నీ మారిపొయాక, మనమున్నమనే ఉనికిని కొల్పొయాక మేల్కొంటాము అనిపిస్తుంది . ఇది మారాలి ..అది మన నుండే మొదలవ్వాలి..

    ReplyDelete