Sunday, October 24, 2010

నాదాకా వచ్చినప్పుడు కదా - కధాంబుధి 2

కళ్ళు కొంచెం కొంచెం తెరవగలుగుతున్నాను నేను కాని ఏమి అర్థం కాట్లేదు, అమ్మని చూస్తె ఏడుస్తుంది, నాన్న ఎటో చూస్తున్నారు.. అదేంటి అన్న ఇక్కడున్నాడు వీడు ఎప్పుడోచ్చాడు అమెరికా నించి.. అరె ఏంటి నోట్లోంచి మాట రావట్లేదు...


నేను కళ్ళు తెరవడం చూసి అమ్మ ఏడుపు ఇంకొంచెం పెరిగింది.. డాక్టర్ హడావుడిగా వచ్చి చూసి పర్లేదు అల్ ఇస్ వెల్ అని చెప్పి వెళ్లారు.. నాకు ఇంకా ఏమి అర్థం కాలేదు.. ఏమయ్యింది అమ్మా అని అడిగాను ఎలాగో కూడదీసుకుని.. నా గొంతు నాకు కొత్తగా ఉంది.. ఏమి లేదు అని ఎన్నో రకాలుగా సర్ది చెప్పారు అమ్మ నాన్న... మెల్లిగా ఒక రోజు గడిచాక అర్థం అయ్యింది నా మీద ఆసిడ్ దాడి జరిగింది అని.. అది చేసింది ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకడు రాము అని.. షాక్, అది తేరుకునే లోపు ఇంకో షాక్... ఖాళీగా ఉండి TV పెడితే నాకు జరిగిన incident మీద చర్చలు, పేపర్స్ అంటే దాచేశారు కాని పాపం remote దాచినా directgaa ఆన్ చేసుకుంటా అని మర్చిపోయినట్టున్నారు...


చాల నీచంగా ఉన్నాయ్ విశ్లేషణలు, ఈ తరం కుర్రకారు ప్రేమలు పైత్యాలు అంటూ ఏదో మాట్లాడుతున్నారు, ఒకరితో తిరిగి కొత్త వాడు రాగానే అసలు వాడిని మోసం చేసినట్టుగా అంటున్నారు.. ఏమి జరిగింది అని అతన్ని అడిగారు, అమ్మని నాన్నని అడిగారు, అన్నని కూడా అడిగారు... నాకు ఏమి జరిగిందో నాకు తెలిసేలోపే దేశం అంతా మరుమోగించేసారు నిజా నిజాలు తెలుసుకోకుండా... నేను చేసిన తప్పేంటి, నా పరిసరాల ప్రభావానికి లొంగి పోవడమా, అలాగని నేను ఎలాంటి తప్పు చెయ్యలేదే.. చేసేవారు ఉన్నారు కాని నేను అలా కాదె, మరి ఎందుకు???? నా మూలాన నా కుటుంబం మొత్తం తల దిన్చుకుందే ఎందుకు??  ఈ ప్రలోభాలు పెట్టిందే ఈ సమాజం, ఒక standard set చేసి అది ఇలాగుండాలి అని చెప్తుంటారు మరి దానికి విరుద్ధంగా ఎందుకు జరుగుతుంది.. ప్రేమ నీచం అంటూ ఇప్పుడు చెప్తున్నటువంటి ఇదే ఛానల్ శ్రీజ శిరీష్ పెళ్ళికి ఎందుకు అంతా కవరేజి ఇచ్చింది... ఆ టీవిలో చెడిపోతున్న పిల్లలు అంటూ lecture ఇస్తున్న జ్యోత్స్న వాళ్ళ అమ్మకి ఇంట్లో కూతురు చేసేవి తెలియదు కాని నేటి యువత మీద ఏక ధాటిగా భలే వాయిన్చేస్తుంది....


కనీసం ఆలోచించే ఓపిక కూడా లేదు నాకు ఇంక, కనీసం కన్నీరు రాదే... అమ్మ వాళ్ళు ఏంటి అసలు ఏమి అనడం లేదు.. వాళ్ళేదో వాళ్ళే పాపం చేసాము అన్నట్టుగా బాధపడుతుంటే నన్ను రంపంతోటి కోస్తున్నట్టుగా ఉండి.. అమ్మా వినమ్మా.. నువ్వన్నా నన్ను నమ్మమ్మా అని కరువు తీర ఏడవాలి అని ఉంది.. కాని అది కూడా చెయ్యలేకపోతున్నా, ఏమి అర్థం కావట్లేదు... తోటి వాడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటాను అన్నట్లు చెయ్యొద్దు అని అమ్మ ఎన్ని సార్లు చెప్పినా వినలేదు కదా.. ఈ అమ్మ ఒత్తి పిచ్చి మాలోకం అనుకున్నాను.  ఇప్పుడు కనీసం ఆ స్నేహితులు కూడా నాకు సాయం రారే అలాంటిదేమీ లేదు తను మంచిది అని చెప్పరే...


అంతా పిచ్చి పిచ్చిగా ఉంది.. ఇదంతా ఒక కల నేను మేలుకుంటే పోతుంది అనిపిస్తుంది కాని కళ్ళు తెరిచే ఉన్నాయ్, ఇది నిజంగా నిజం అని నేను నమ్మట్లేదు అంతే... కళ్ళు మూసుకుని వెనక్కి వాలితే నాకు గతం కళ్ళ ముందు తిరిగింది.. నిజం నిప్పు లాగ వెంటాడుతుంటే జ్ఞాపకాలే నీడని ప్రసాదిస్తాయేమో...


అమ్మ నాన్నల గారాల పట్టిని నేను.  ఇంటికి లక్ష్మి అని మురిసిపోతూ అల్లారు ముద్దుగా పెంచుతున్నారు నన్ను, అన్న ఉన్నాడు, వాడికీ నేనంటే చెప్పలేనంత ప్రేమ.  చిన్నప్పుడు ఉహ తెలియనప్పుడు ఏమి కొట్టుకున్నామో కాని తరవాత మా మధ్య ఎప్పుడు చిన్న తగువు కూడా లేదు.  అందరూ ఇదేమి విడ్డూరం అనుకుంటూ ఉంటే.. అమ్మ నాన్న కళ్ళల్లో కోటి కాంతులు, తమ పెంపకం గురించి తలుచుకుని గుండెలలో పొంగిపోయేవారు.   మాదేముందండి జ్ఞానం గల బిడ్డలు, భగవంతుడిచ్చిన వరాలు, వాళ్ళు నిజంగా మేము ఏనాడు చేసుకున్న ఫలమోనండీ అంటూ గర్వంగా చెప్పుకునేవారు.


నాకంటూ ఏమి లోటు లేదు, ఆడింది ఆట పాడింది పాట.  అమ్మ గుట్టుగా గుంభనంగా ఉన్న దాంట్లో పొదుపుగా ఉంటూ ఒకరి దెగ్గర చెయ్యి చాచకుండా, ఒకరితో పోల్చుకుని ఎగిరి ఎగిరి పడకుండా నాన్న తెచ్చిన దాంట్లో గడుపుతూ, మాకు మంచి చెడు తెలియచెబుతూ, పల్లెత్తు మాట అనకుండా, భయంతో కాకుండా శ్రద్ధతో పెంచింది.  బాల్యంలో అల్లరి మామూలే కాని ఒక నిండు కుండ లాంటి జీవితం మాది.  దేనికైనా సరే తల్లి తండ్రి ఉన్నారు అని ధీమాతో పెరుగుతున్నాము.


అంతా మంచే కాని ఎటువంటి తేడా లేకుండా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది.   పెరుగుతున్న కొద్ది అమ్మ, నాన్న, అన్న అనే ప్రపంచం తో పాటు బయట కూడా అవహగాహన మొదలయ్యింది.  చుట్టాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు, బళ్ళో వాళ్ళు మా పరిసరాలు మా మీద ప్రభావాలు చూపడం మొదలు పెట్టాయి.  అన్న నేను చెయ్యి చెయ్యి పట్టుకుని బడికి వెళ్ళడం, పాస్ బెల్లు వేళకి మళ్లీ అన్న దెగ్గరకి చేరిపోవడం, తనతో ఆడుకోవడం.. అంతా బాగానే ఉంది.  నేను 7 తరగతికి వచ్చేపాటికి అన్న కాలేజికి మారిపోయాడు... అప్పుడు మొదలయ్యింది నా కొత్త ప్రపంచం... నాకు ఒక స్వేచ్చ దొరికింది... అప్పటి దాక అలాంటిది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు నాకు.  ఇంట్లో వాళ్ళ తోడిదే లోకం.  సరదాగా టీవిలో వారానికి ఒక సినిమా, నెలకో షికారు ఇది మా జీవితం.


అన్నీ ఉన్న ఈ జీవితంలో అపశ్రుతి ఎప్పుడు మొదలయ్యింది?  అందరు మెచ్చుకుంటుంటే మంచి పిల్ల అని అది ఎప్పుడు నా తలకి ఎక్కింది, అన్ని నాకే తెలుసు అనే అహం ఎందుకు నాలో చేరింది.. ఏమో మనిషి మెదడు పలు రకాలుగా ఎందుకు పరుగుతీస్తుందో తెలిస్తే, అంతా సక్రమంగా జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది.


పని పిల్ల రంగి నన్ను ఆడించేది, సాయంత్రం షికారుకి తీసుకెళ్ళేది, నేనంటే ఎంతో ప్రేమగా ఉండేది.  అలా వెళ్తున్నప్పుడు మా వెనక ఒక కుర్రాడు వచ్చేవాడు, రంగితో ఎన్నో మాటలు మాట్లాడేవాడు, నేను అక్కడ వేరే పిల్లలతో ఆడుకుంటుంటే వాళ్ళు కబుర్లు చెప్పుకునేవారు, అతన్ని చూడగానే అక్క కళ్ళలో ఆనందం, పని తీరులో హుషారు, ఇంకో లోకంలో ఉండేవారు, ఒకోసారి చీకటిపడి అందరు వెళ్ళిపోయాక వెళ్దాంరా అని పోరు పెట్టేదాకా కదిలేవారు కాదు.  ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని రంగి ఒట్టు వేయించుకుని అప్పుడప్పుడు చాక్లెట్టు ఇచ్చేది, బాగా అల్లరి చేసినా అమ్మకి చెప్పేది కాదు, బురదలో తిరిగినా శుబ్రం చేసి ఏమి తెలియనట్లు ఉండేది.  ఎలా తెలిసిందో ఇంట్లో ఈ విషయం తెలిసి రంగిని తనతో పాటు నన్నుబయటకి పంపడం మానేశారు, నా వీపు విమానం మోత మొగిన్చేసారు నిజం దాచినందుకు.


వీధి చివర అన్న బడిలో అక్కకి ఉత్తరం ఇచ్చి రమ్మంటే ఇవ్వడం, అక్క రాసిన జాబు తేవడం... వాళ్ళ స్నేహితులకి కూడా ఇలాంటి పనులు చేసి పెట్టడం మాకు పనులు.  అక్కలు ఎవరిని దెగ్గరకి చేర్చుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ పాపులారిటీ ఉండేది.  అంతా భలే తమాషాగా ఉండేది, ఎవరికి తెలియకుండా చెయ్యమనడం తోటి అబ్బో అసలు మనకి ఎంత importance ఇచ్చేస్తున్నారో అని ఒక పిచ్చి భ్రమ, ఒక వింత లోకం.  Teenage అంటే ఇవ్వన్ని ఉంటే కాబోలు ఇదంతా కామన్ కాబోలు అనుకునేదాన్ని.  ఇంట్లో చాలా విషయాలు చెప్పడం లేదు నేనిప్పుడు ఎందుకంటే వాళ్ళు నన్ను ఏమి తెలియని దాన్ని అంటారు, కళ్ళెర్ర జేసి చిన్న పిల్లవి అంటారు.  నాకు నన్ను నన్నుగా నా వ్యక్తిత్వానికి విలువ నిచ్చేవాల్లుగా నా స్నేహితులు అక్కలు అన్నలె కనిపించడం మొదలు పెట్టారు మరి.


వయసు వచ్చాక మరీ అదుపులు పెరిగిపోయే, వోని వెయ్యాల్సి వచ్చింది, ఎన్నో కొత్త భావాలు, కొత్తగా ఎన్నో మార్పులు.. శారీరకంగాను మానసికంగాను.. ఇవన్ని ఇంట్లో వాళ్ళకంటే ముందు కుర్రాళ్ళు పసిగాట్టేస్తారు కదా, ఇంక నాకు ఉత్తరాలు రావడం మొదలయ్యింది, టీవిలో ఎప్పుడు చూసిన ప్రేమ సందేశం ఉన్న సినిమాలు, చుట్టు ఉన్న peer pressure అన్నిటికి మించి యవ్వనపు మత్తు.. ఎక్కువ సేపు చూస్తె ఎక్కడ దిష్టి తగులుతుందో అని పెంచిన అమ్మ నాన్నలేక్కడ, నిన్ను చూస్తె చూపు తిప్పుకోలేకపోతున్న అని చెప్పే రాజు లాంటి వాళ్ళ మాటలు ఎక్కడ.   ఏమి కావాలో తెలియని వయసులో ఇలాంటివి భలే మత్తుగా అనిపిస్తాయి కదా.


ఒక పక్కన భయం, ఇంట్లో తెలిస్తే ఎలాగా అని.. మళ్లీ ఆ తెలియనివ్వనులే నేను తెలివి గల దాన్ని ఎవరికి నేను ఐ లవ్ యు చెప్పలేదు కదా, వాళ్ళు చెప్తున్నారు నేను వింటున్న, ఒక నవ్వు పారేస్తున్న, నేనేమి వాళ్ళతోటి తిరగట్లేదు కదా.. ఐన తప్పేముంది, గిర్ల్స్ బోయ్స్ ఫ్రెండ్స్ అవ్వలేరా అంత ట్రాష్ అని మనసులో అనుకుని నాలిక తిప్పేసుకుని సర్డుకుపోయేదాన్ని.


ఒక్కోసారి టీవిలో ప్రేమోన్మాదులు అని అది అని చూసి కొంచెం భయం వేసేది కాని నేనేమైన అమాయకురాలినా అని మళ్లీ అదే నాలిక తిప్పుడు.  ఇంట్లోనే నా గురించి తెలియనివ్వట్లేదు ఇంక టీవీ దాక కూడానా అని ధీమా.  ఎప్పుడు మితి మీరి ప్రవర్తించలేదు కాని నలుగురు నా చుట్టూ తిరిగితే అదొక సరదా, ఎక్కడికెళ్ళిన bodyguards లాగ నలుగురు తిరుగుతుంటే అదొక గర్వం.   నుంచున్న కూర్చున్న తుమ్మినా దగ్గినా ఒక fan following , మన వైపు చూసి కుళ్ళుకునే మిగతా ఆడపిల్లల మోహంలో చూసి అదొక గర్వం.  ఎవరైనా బుద్ధిగా చదువు కుంటూ  ఉంటే ఇవన్ని పట్టనట్టు ఉంటే అబ్బో sour grapes వాళ్ళ వైపు ఎవరు చూడట్లేదు కదా ఎన్నైనా చెప్తారు అనుకోవడం.  చదువులో తేడా రానంత వరుకు, టైంకి ఇంటికి చేరిపోయినంత వరుకు ఎలాంటి ఇబ్బంది లేదు నాకు ఇంట్లో.


ఎప్పుడు రూమ్లో దూరిపోయి ఇంటర్నెట్, texting , ఫోన్స్ అంటూ ఉన్న నా గురించి తెలియక.. అబ్బో నా బిడ్డకి అసలు చదువు తప్ప వేరే ధ్యాస లేదు అని మురిసిపోయే అమ్మ నాన్నలు... ఇది నా లోకం.


పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరు చూడట్లేదు అనుకుంటే అది నిజం కాదు కదా.. ఎప్పుడో ఎదురు దెబ్బ తగులుతుంది.. సరదాగా ఉంటూ మా grouplo ఉండే రాము ఈ మధ్య విపరీతంగా possessive ఐపోయాడు, ఎవరితో మాట్లాడిన అదొక రకంగా అయిపోవడం, తనతోనే ఎప్పుడు ఉండాలని అనుకోవడం.  తప్పురా అని చెప్పాను, నాకు ఇవన్ని కేవలం స్నేహాలు,  ఈ రోజీ లాగే ఆ రాజు కూడా, నా జీవితంలో నాకు వేరే aims అండ్ hopes ఉన్నాయ్  అని చెప్పాను.. ఏమయిందో ఏమో సారీ అని చెప్పి మళ్లీ మామూలుగా ఉంటాను అన్నాడు.  అంతటితో అది నా దృష్టిలో ఒక సమస్య కాదు, జస్ట్ చిన్న misunderstanding క్లియర్ ఐపోయింది అంతే.  ఇంతలో Engineeringlo చేరడం కొత్త లోకంలో పడటం జరిగిపోయింది.. seniors లో ఉండే కృష్ణ చాలా intelligent,  మంచి మనిషి.. తను నాకు propose చెయ్యడం, నాకు నచ్చడం, నేను ఇంట్లో అడగమనడం ఇంట్లో వాళ్ళు సరే ముందు చదువు తరవాత చూద్దాం అనడం కూడా జరిగిపోయింది... మళ్లీ ఎప్పట్లాగే నేను నా స్నేహాలు నా లోకం..


ఇంతలో ఒక రోజు రాము బైక్ మీద కనిపించాడు, చాలా రోజులయ్యింది కదా అని చెయ్యి ఎత్తి పలకరిస్తుంటే, గబాల్న ఏదో తీసి నా మీద చిమ్మాడు.. అబ్బా ఏంటి ఈ మంట, ఈ నొప్పి ఏముతుంది ఏమి తెలియట్లేదు.. కళ్ళు తెరవలేకపోతున్న.. పిచ్చిగా అరవాలనుంది అరవలేకపోతున్నా.. ఏమి అవుతుందో తెలియట్లేదు.....


అమ్మా అని ఒక పిచ్చి కేక మాత్రం వేసాను.. ఎప్పుడు వచ్చాడో తెలియదు అన్నయ్య కంగారుగా కుదుపుతూ ఉంటే ఏమి అర్థం కాలేదు.. వాడిని గెట్టిగా పట్టుకుని కరువు తీర ఏడుపు తీర్చున్నాను.. పరవాలేదు నేనున్నాను అని నిబ్బరంగా వాడు చెప్తుంటే అర్థం అయ్యి కూడా కానట్లే ఉంది...


అన్నీ నాకే తెలుసు ఎంతో తెలివిగల దాన్ని అని విర్రవీగిన విషయం తలుచుకుంటే ఒక వెర్రి నవ్వు వస్తుంది.. అది చూసి పిచ్చి పట్టిందేమో అని హడిలిపోయిన అమ్మ నాన్న అన్నలని చూస్తె ఏడుపొస్తుంది... ఏమి చేసినా కాలం తిరిగి రాదు, యవ్వనం వృధా చేసుకోకండి అని యువతరానికి అరిచి గీపెట్టి చెప్పాలని ఉంది.. కాని మొన్నటి దాకా మైకం కమ్మిన నా కళ్ళకి ఏమి కనిపించిందో చెవులకి ఏమి వినిపించిందో తమ దాకా వచ్చేవరుకు వాళ్లకి అదే కదా వినిపిస్తుంది అనిపిస్తుంది..  తప్పు ఎక్కడ జరిగిపోయిందో అర్థం అయ్యేలోపు అంతా ఐపోయింది.

5 comments:

  1. చాలా బాగా రాసారు.

    ReplyDelete
  2. చాలా బాగా రాసారు శ్రీ...

    విషయానికి వస్తే...హ్మ్మ్...ఏం చెప్పాలి? నాకు ఏడుపు వస్తుంది ఇక్కడ.
    అమ్మ నాన్నలు ఎంత అపురూపంగా పెంచుకుంటారు ఆడపిల్లలని..నవ్వులు నవరత్నాల్లా...పలుకులు పసిడిమూటల్లా..వాళ్ళ మీద ఏం హక్కు ఉందని ఈ యాసిడ్ దాడులు, ఈ కత్తి పోట్లు??

    దేవుడా...ఈ ఒక్క విషయాన్ని లోకంలొనుండీ తీసెయ్యి..నా ఒక్కదాని ప్రార్ధన కాదు...ఈ లోకం లోని కోటి మంది తల్లి తండ్రుల ప్రార్ధన అదే

    ReplyDelete
  3. Very good writing Sree. Story chaala baagundi. Touching ga undi.
    Tappu ammayidi kaadu. Abaayidi and tana alaa chesetattu prerepistunna social and media elements. This is a very complex issue. Severe and prompt punishment; change in the media (TV and Cinema) are steps towards handling this at this point.

    ReplyDelete
  4. తెలుగులో ఇక్కడ చాలా రాసారు, నేను ఇప్పటి వరకూ చూసుకోలేదు...

    అమ్మాయి అంతరంగాన్ని బాగా ఆవిష్కరించారు...

    ReplyDelete
  5. శ్రీ,
    ఎంతనబాగా రాసారండీ. తమదాకా వస్తేకాని అర్థం కాని విషయం ఇది. నిజం.
    మీరు ఇంగ్లీషులో మాత్రమే రాస్తున్నారనుకొని ఓ మెయిల్ చేసాను. ఇప్పుడే చూసాను. తెలుగులో కూడా రాస్తున్నారని. చాలా బావుంది ఈ టపా.
    తల్లితండ్రులు పిల్లలను ప్రశ్నించడానికి భయపడుతున్నారు...లేదా మొహమాటపడుతున్నారు అనిపిస్తుంది. వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో సెల్ ఫోన్లు ఇంటర్నెట్ లు అన్నీ ఇస్తున్నారు. కానీ వాళ్ళకు అవి ఎంతవరకు అవసరమో ఎవరికీ తెలియడం లేదు. వీటిని ఎక్కడ కట్ చెయ్యాలో కూడా తెలియడంలేదు. ఇంకా ఈ విషయం మీద చర్చించవలసినది చాలా ఉంది.
    కానీ ఆ చర్చల వల్ల లాభం ఏమిటో కూడా తెలియదు. ఎందుకంటే దాని ఫలితాన్ని అవసరమయిన వాళ్ళు అందుకునే స్థాయిలో కాని, అందుకునే ఉద్దేశంతో కాని లేరు కనుక. మనలో మనం కుమిలి పోవడమే చివరికి మిగులుతుందేమో.

    ReplyDelete