Sunday, October 10, 2010

Naa Chitti Koonaనా చిట్టి బంగారానికి,ఎన్ని రోజులు అయ్యింది నానా నీకు ఉత్తరం రాసి.. ప్రతి నెలా తొమ్మిదో తారీకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి, కొత్త గౌను కొని, ఏదోకటి వండించి, దాన్నో పెద్ద వేడుక లాగ చేసి ఒక ఉత్తరం రాసి ఎంత హంగామా చేసేదాన్నో కదా!! ఇప్పుడు కూడా అదే ప్రేమ అదే మమత కాని ఎందుకో ఒక రొటీన్ లో పడిపోయింది జీవితం.  నువ్వు పడుతూ, లేస్తూ, పరుగులెడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, ఏడుస్తూ నాకు ప్రసాదించే మధుర అనుభూతులు ఎన్నో కదా.. కేవలం తొమ్మిది నెలలు మోసి కన్నందుకు ఇంత అనుబంధం పెనవేసుకుపోతుందా, ఒక జీవన కాలానికి సరిపడే మధుర అనూభూతులని నింపుతుందా .. ఏమో, నాకు మాత్రం అంతా ఇంకా కలలాగే ఉంది.  నువ్వు లేకముందు అసలు జీవితాని ఊహించడమే కష్టంగా ఉంది.  పెద్దయ్యాక నువ్వు నన్ను తిట్టుకోవచ్చు, తిట్టేయ్యనూ వచ్చు కాని నీ చిన్నారి వయసులో నాకిచ్చన ఈ ఆనందం ముందు ఏదైనా చాల తక్కువేనేమో కదా? ఈ నెల దాటితే నీకు సంవత్సరంనర్ర  అనుకుంటేనే అబ్బో అనిపిస్తుంది... కాలం పరుగెడుతుంది అంటారు కాని నిజం కాదేమో నాన్నా,  అలాగ మాయం ఐపోతుందేమో.


నిద్రలో నీ బోసి నవ్వులు చూస్తె నాకు నిద్ర రాదు, అలాగ అన్నిమర్చిపోయి ఆ అమాయకత్వం, ఆ నవ్వులోని దైవత్వంలో తడిసిపోవాలనిపిస్తుంది.. ముద్దుగా చేసే గారం ముచ్చటగా అనిపిస్తున్నా కూడా కేకలేయ్యాల్సి వచ్చినప్పుడు నేను పడే బాధ చెప్పలేను, కాని తప్పదు.


బుడి బుడి నడకలు నడిచే చిన్నారి తల్లి చేయి పట్టుకుని నడిపిస్తుంటే ఇంక ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది.  చిట్టి చిట్టి చేతులతోటి ముఖం మీద తడుముతుంటే బాధ అంటే ఏంటో కూడా గుర్తు రాదు.


బుల్లి శీలి రాకాసి లాగ అరేయ్ ఒరేయ్ అని అందరి మీద కేకలేసి పిలుస్తుంటే ఒక పక్కన ముద్దు రెండో పక్కన అయ్యో అలవాటు ఐపోతుందేమో అని బాధ,  ఎవరికి చెప్పను.  కోపంలో వస్తువులు గిరాటేస్తుంటే అవి పట్టుకొచ్చి నిన్ను నాలుగు పీకాలి అని అనిపించే మనసుని ఎలా అదుపులో పెట్టుకోను.  నా కోపం నీకు వారసత్వంగా రాకూడదు, నా లాగ పిచ్చి దాని ముద్ర నీ మీద పడకూడదు అని ఎంత వ్యధ అనుభవిస్తుంటానో ఎలా చెప్పను.


ఎప్పుడైనా ఎందుకు ఈ నిత్య ఘర్షణ, ఈ విరామం లేని పోరాటం అని వైరాగ్యం కమ్ముకున్నప్పుడు, నీ చిలిపి చూపు, కిల కిల నవ్వు కనిపిస్తే చాలు ఎంతటి శక్తి వస్తుందో నాకు అర్థం కాదు.  నా బలం, బలహీనత రెండు నువ్వే బుజ్జి నాన్నలు.   ఎవరికీ లొంగని నేను నిన్ను చూసి చూడగానే పడిపోయా.. ఇప్పటికి కూడా ఆ మొదటి చూపు, ఆ తొలి స్పర్శ, నాకు ఒళ్ళంతా జల్లు మనిపిస్తుంది.


నువ్వు పుట్టక ముందు నిన్ను అలాగ పెంచాలి ఇలాగ పెంచాలి, అది నేర్పించాలి, ఇది నేర్పించాలి, ఎంతో ఆదర్శంగా తీర్చి దిద్దాలి  అని ఎన్నో అనుకున్నాను, ఇప్పుడు ప్రతి నిమిషం నీ నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను.. క్షణంలో నవ్వు, క్షణంలో ఏడుపు, ఏది గుర్తుండదు, ఎప్పుడు సంతోషం, ఉన్నది నలుగురితో పంచుకోవడం, ఇష్టం ఉంటె ఆడటం, లేదంటే ఆడించటం, నీ ప్రపంచంలో కోపం, చిరాకు, బాధ సంతోషం అంటూ ప్రత్యేకంగా ఏమి లేవు, అన్నిటిని సమ దృష్టితో చూస్తావు.  పక్షులు, జంతువులు, పేద, గొప్ప, ముసలి పడుచు ఇది అది ఏది లేదు.. అన్ని సమానమే, ఏదైనా రెండు నిముషాలే.


ఎప్పుడూ నిజమే చెప్పాలి, ఎంత కష్టమైనా సరే ఎంత నిష్టూరమైనా సరే నిజాయితీగా ఉండాలి అని చెప్పాలంటే తరవాత ఈ సమాజంలో నువ్వు బ్రతకలేవేమో, అదంతా పాత చింతకాయ పచ్చడి ఏమో అని ఒక్కోసారి దిగులు అనిపిస్తుంది.  తియ్యని అబద్ధాలు చెప్పి కనికట్టు చేసే వారు బయట చాలా మంది ఉన్నారు వాళ్ళని ఎలా గుర్తుపడతావో, అసలు గుర్తిస్తావో లేదో అని ఏదో ఆలోచనలు.  నల్లనివన్నీ నీళ్ళు తెల్లనివన్నీ పాలు అని భ్రమలో నిలిచిపోయి, కాదని ఆ తరవాత తెలుసుకుని తల్లడిల్లిపోతావేమో అని  బెంగ... నిజం చెప్పాలి అంటే అసలు ఎప్పుడు ఇదొక ఆలోచన..


ఏదో నేర్పించాలి అనుకుంటూ, నీ నించి నేర్చుకుంటున్నా అనుకుంటూ నన్ను నేను మభ్య పెట్టుకుంటూ బ్రతికేస్తున్నానేమో కూడా..


Born intelligent and education ruined అంతే ఇదేనేమో.. ఎంతో జ్ఞానంతో పుట్టి మెల్లి మెల్లిగా అన్ని మార్చిపోటమే మనం జీవితంలో సాదిస్తున్నామేమో అనిపిస్తుంది ఒక్కోసారి నిన్ను చూస్తె.


ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి అని ఒక తపనలో నిన్ను అందరికి దూరం చేస్తున్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి.  కాని చుట్టుపక్కల వాళ్ళ సూటి పోటి మాటలు విని నీ మనసులో చెరగని ముద్రలు పడకుండా ఉండటం ఎంత అవసరమో తలుచుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎంత సరి ఐనదో తెలుస్తుంది.


నా చిన్ననాటి నుంచి కూడా తల్లి తండ్రి మీద ప్రేమ లేదు, వాళ్ళ మీద నాకు ఉన్న అభిప్రాయలు నేను నాకు నేనుగా ఏర్పరుచుకున్నవి కావు, నా చుట్టు ఉన్నవారి మాటలు, కబుర్లు వాళ్ళ ఏర్పడిన ఫీలింగ్స్ మాత్రమే.  ఒక మనిషి మీద ఇంకొకరికి ఎంత విషంనింపగలరోఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది.. నేను కోల్పోయిన బాల్యం గుర్తొస్తుంది.. సాధ్యం కాని పరిస్తితుల్లో తల్లి తండ్రులు ఎవరిదగ్గరైనా పెంచినప్పుడు  వారు ఏమి వింటున్నారో చూస్తున్నారో తెలుసుకోలేరు కదా.  నిష్కల్మషమైన మనసుని అలాగే ఉంచడం నా కనీస బాధ్యత అని నేను అనుకుంటున్నా.. ఒక మనిషి గురించి నాకు నచ్చనప్పుడు నీదగ్గర ఆ వ్యక్తి గురించి మాట్లాడటం కంటే అసలు ఆ వ్యక్తీ ఉనికి నేను తెలియకుండా ఉండటం మేలేమో కదా.నువ్వు పుట్టక ముందు ఒక శిశువు జన్మ ఒక మిరకిల్ అని అనిపించేది.. అదే ఇప్పుడు కలిగే భావన వర్ణించలేను, ఒక కణం చేసిన రణం, నా కంటి ముందు జీవం పోసుకుని కనిపిస్తుంటే, మైమరిచి పోవడం, మురిసిపోవడం.. ఈ చిరు జీవి చిరంజీవిగా వర్ధిల్లాలి అని ఆశించడం తప్ప నేను ఏమి చెయ్యలేను... నీ ఎదుగుదలకి కొంత కాలం గర్భంలో మాత్రం నిలుపుకున్న నాకు, జీవితతాంతం మదిలో చెరిగిపోని చోటుని ఇచ్చావు..


నేను మారిపోయాను నాన్నా, చాలా మారాను, మార్పు అంటే భయపడే నేను, అసలు మార్పు అంటే చిరాకు పడే నేను ఎంతగానో మారిపోయాను.


ఎన్నో లక్షాల కణాలని ఓడించి ఎన్నో మార్పులకి తలవంచి ఒక గొప్ప విజేతగా పుట్టిన నిన్ను నీలోని శక్తిని మర్చిపోకుండా, నీ సామర్థ్యాన్ని మరవనియ్యకుండా చెయ్యడం ఎలా?  నీ ఉనికి నీకు ప్రశ్న కాకూడదు ఎందరో జీవితాలకి వెలుగు కావాలి అని అనుకోవడం ఒక పెద్ద కోరికా?  భగవంతుడిచ్చిన ఒక అద్బుత వరం నీ జీవితం, దాన్ని నువ్వు అలాగే నిలబెట్టుకునేలాగా చెయ్యటానికి నా వంతు కృషిగా నేను ఏమి చెయ్యగలను...


బిడ్డల్ని కంటాం కాని వారి రాతలని కాదు అని ఎందరో అంటే విన్నాను.. నిజమే.. కాని అభం శుభం తెలియని పసి మనసులో కల్మషం రేపింది ఎవరు?  ఎందుకు ఒకరు మహాత్ముడిగా మరొకరు క్రూర మృగంగా ఎందుకు మారుతున్నారు.. ఏమి చేస్తే మన సమాజము స్టితి గతులని మనం మార్చగలం.


నిన్ను ఒక human being లాగ పెంచడం కంటే "being human " గా పెంచడం నా ధ్యేయం బంగారు.


ఏదో అయోమయంలో నాకు సరి అని తోచిన విధంగా నేను నిన్ను పెంచుకుంటున్నాను కన్నలు... ఒక్కోసారి ఎప్పుడు గబుక్కున పెద్దగా ఐపోయి నా కంటి ముందు కనిపిస్తావో అనిపిస్తుంది, ఒక్కోసారి ఇలాగే ఎప్పుడు పసి పాపలాగా ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది. నిమిషానికి ఒక భావం కాని ఒకటి మాత్రం శాశ్వతం ఈ ప్రేమ, ఈ బంధం, ఈ క్షణం.


ఎప్పుడైనా కోపం వచ్చి ఎందుకురా బాబు ఈ పిల్లల్ని కనడం పడరాని పాట్లు పడటం అని విసుక్కుంటే ఈ ఉత్తరం కాస్త నాకు చూపించు.. బ్రతుకు బండిలో పడి ఆ విసుగు నీ మీద పడినప్పుడు, వెలకట్టలేని క్షణాలు ఎన్నో నాకు ప్రసాదించావు అని గుర్తుచేయ్యి... నన్ను కను అని నువ్వు నన్ను అడగలేదు, ఇలాగే పెంచు అని నువ్వు నన్ను నిర్దేశించడం లేదు,  ప్రతి దానికి ఏదోఒక  అర్థం పరమార్థం ఆపాదించుకుని నేనే ఏదో చేస్తున్నాను, అది మర్చిపోయి నిన్ను దుమ్మెత్తి పోస్తే ఆ రోజు నన్ను గట్టిగా నిలదియ్యి.. ఎవరికీ తలవంచకు, ఎక్కడ తల దించుకోకు.. చివరకి నా దగ్గర కూడా.  నేను నీకు బలం బలగం అవ్వాలి తప్పితే నీ ఎదుగుదలని కట్టిపడేసే ప్రతిబంధకం మాత్రం అవ్వకూడదు చిన్నమ్మలు.  ఇది తప్పమ్మా అని నువ్వు నాకు చెప్పిన రోజు, నా చిట్టి కూన నాకే సరైన దారి చూపిస్తోంది అని నేను గర్వపడే రోజు వస్తే నా జన్మకి అది చాలు రా బంగారమ్మలు..  


ఏదో రాయాలి అని ఉంది.. ఎంతో చెప్పాలి అని ఉంది, చెప్పిందంతా సోది అనిపిస్తుంది, చెప్పాల్సింది కూడా సోదేనేమో అనికూడా అనిపిస్తుంది నాకు నేను నీకు తెలుసు కదరా రాజాలు, ఏదోకటి చెప్పెయ్యాలి... ఎలా పడతావో ఏంటో కదా నా తోటి... తప్పదురోయ్ నీకు నేను నాకు నువ్వు రాసి పెట్టి ఉన్నాం ;)..తప్పించుకుందాం అన్నా సరే నీకు దారి లేదు కదా :).


బోలెడంత ప్రేమతో
అమ్మ.

PS:  ఇది నేను నా ఇంగ్లీష్ బ్లాగులో ఎప్పుడో రాసుకున్న ఉత్తరం.. ఇప్పుడు ఇలా పంపిస్తున్నా

# తల్లిగానేను

శ్రేయస్సు  

2 comments:

 1. చాలా బాగా వ్యక్తీకరించారు మీ భావాలని.

  >>ఒక మనిషి మీద ఇంకొకరికి ఎంత విషం నిమ్పగాలరో ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది.. నేను కోల్పోయిన బాల్యం గుర్తొస్తుంది

  >>నిష్కల్మషమైన మనసుని అలాగే ఉంచడం నా కనీస బాధ్యత

  >>ఒక మనిషి గురించి నాకు నచ్చనప్పుడు నీ దెగ్గర ఆ వ్యక్తీ గురించి మాట్లాడటం కంటే అసలు ఆ వ్యక్తీ ఉనికి నేను తెలియకుండా ఉండటం మేలేమో

  ఈ మాటలు ప్రతిఒక్కరూ తెలుసుకుంటే చాలా పసిమనసులు గాయపడకుండా సహజమైన బాల్యాన్ని అనుభవించగలవు. ఇంత స్పష్టత మీలో ఉన్నాక మీ బిడ్డ చక్కగా పెరుగుతుంది. అభినందనలు.

  ReplyDelete
 2. chalabaaga raasaru...enno bhavaalu vachhina kondare rayagalaru...andarini aalochimpachesela rasaru..
  abhinandanalu
  lakshmi raghava

  ReplyDelete